
ఒక్క నెలలోనే 52 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
పశ్చిమాసియాలో యుద్ధభయాలతో దేశం నుంచి వెళ్లిపోతున్నపెట్టుబడులు
పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి క్షీణత నమోదు చేస్తుండటంతో భారత్ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఒక్క మార్చి నెలలలో దేశీయ ఈక్విటీల నుంచి సుమారు రూ. 52,704 కోట్ల వరకూ వెనక్కి వెళ్లిపోయాయి. కార్పొరేట్ రంగం ఆదాయాలు యుద్ధం వల్ల ప్రభావితం అవుతాయనే భయం కూడా పెట్టుబడుల ఉపసంహరణకు మరో కారణం.
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) ఫిబ్రవరిలో భారత ఈక్విటీలలోకి రూ.22,615 కోట్లు పెట్టుబడి పెట్టిన తరువాత తాజా అమ్మకాలు అంతకుమించి జరుగుతున్నాయి. ఇది 17 నెలల్లో అత్యధిక నెలవారీ ఉపసంహరణ ప్రవాహం. దీనికి ముందు, డిపాజిటరీ డేటా ప్రకారం, జనవరిలో రూ.35,962 కోట్లు, డిసెంబర్‌లో రూ.22,611 కోట్లు, నవంబర్‌లో రూ.3,765 కోట్లు ఉపసంహరించుకున్నారు. మార్చిలో ఇప్పటివరకు (మార్చి 13 వరకు), FPIలు నగదు మార్కెట్లో దాదాపు రూ.52,704 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
నెలలోని అన్ని ట్రేడింగ్ రోజులలో నికర అమ్మకందారులుగా ఎక్కువగా ఉన్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ ఉపసంహరణకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధికి అంతరాయం కలిగించే దీర్ఘకాలిక సంఘర్షణ భయాలు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగిందని, దీనివల్ల రిస్క్-ఆఫ్ చర్యకు దారితీసిందని ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ అనలిస్ట్ వకార్జావేద్ ఖాన్ అన్నారు. డాలర్ తో పోలిస్తేత రూపాయి మారకం విలువ 92కి అటూ ఇటూ ఉండటం, యూఎస్ బాండ్ రేట్లు పెరగడం కూడా ఈ చర్యకు మరో కారణంగా నిఫుణులు చెబుతున్నారు.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో సంఘర్షణ తర్వాత ప్రపంచ ఈక్విటీలలో బలహీనత, రూపాయి విలువ తగ్గడం, దేశ వృద్ధిని, కార్పొరేట్ ఆదాయాలను ప్రభావితం చేసే అధిక ముడి చమురు ధరల ఆందోళనలు ఎఫ్‌పిఐ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయని అన్నారు.
గత 18 నెలలుగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత్ నుంచి బలహీనమైన రాబడి కూడా ఎఫ్‌పిఐ ఉపసంహరణకు దారితీసిందని ఆయన అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, దక్షిణ కొరియా, తైవాన్, చైనా ప్రస్తుతం మరింత ఆకర్షణీయమైన మార్కెట్లుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవలి దిద్దుబాటు తర్వాత కూడా అవి భారత్ కంటే లాభాల బాటలో పయనిస్తున్నాయి. మెరుగైన కార్పొరేట్ ఆదాయ అవకాశాలు అక్కడ లభిస్తున్నాయి. అందువల్ల, దేశంలో మరింత ఎఫ్‌పిఐ అమ్మకాలు స్వల్పకాలంలో జరిగే అవకాశం ఉంది.
మార్చి రెండవ అర్ధభాగంలో, అంచనాలు ఎక్కువగా వస్తాయని అందుకే మదుపరులు జాగ్రత్త పడతారని ఖాన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే లేదా బ్యాంకింగ్, వినియోగ రంగాల నుంచి క్యూ4 ఆదాయాలు సానుకూలంగా ఉంటే అవుట్‌ఫ్లోలు తగ్గుతాయి.
అయితే, చమురు ధరలలో మరింత పెరుగుదల అమ్మకాల ఒత్తిడిని కొనసాగిస్తుంది. రంగాల వారీగా చూస్తే, 2025లో ఇప్పటివరకు ఐటీ అతిపెద్ద ఉపసంహరణలను చూసింది. ఆదాయ వృద్ధి మందగించడం, సుంకాల సంబంధిత అనిశ్చితి, బలహీనమైన ప్రపంచ టెక్ వ్యయం మధ్య FPIలు దాదాపు రూ.74,700 కోట్లు ఉపసంహరించుకున్నాయి.
పట్టణ వినియోగం మందగించడం, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా FMCG దాదాపు రూ.36,800 కోట్ల ఉపసంహరణలను నమోదు చేసిందని సెంట్రిసిటీ వెల్త్‌టెక్ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య శంకర్ అన్నారు. విద్యుత్, ఆరోగ్య సంరక్షణ కూడా గణనీయమైన అమ్మకాలను చూశాయి. ఆదాయాల పంపిణీకి సంబంధించి విస్తరించిన విలువలు కారణంగా రూ.24,000-26,000 కోట్లకు పైగా ఉపసంహరణలు జరిగాయి.
Next Story

