
కర్ణాటక కంపెనీ Vs అమెరికన్ AI సంస్థ
తన బ్రాండ్‌ను కాపాడుకునేందుకు అమెరికన్ కంపెనీతో చట్టపర పోరాటానికి దిగిన కర్ణాటకకు చెందిన AI సంస్థ
కర్ణాటక రాష్ట్రం బెళగావి కేంద్రంగా ఆంత్రోపిక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ 2017లో స్థాపించారు. అయితే అదే పేరుతో (Anthropic) 2021లో అమెరికాలో మరో కంపెనీ ప్రారంభమైంది. ఈ రెండు కంపెనీలు ఒకే పేరుతో పనిచేస్తున్నాయి. దీంతో బెళగావి కంపెనీ అమెరికా కంపెనీపై చట్టపరమైన చర్యలకు దిగింది. కంపెనీ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయాజ్ ముల్లా ఫెడరల్ కర్ణాటకతో మాట్లాడారు. “మేం 2017 నుంచి ‘ఆంత్రోపిక్’ పేరుతో కంపెనీ నడుపుతున్నాం. అమెరికన్ కంపెనీ అదే పేరుతో మార్కెట్లోకి రావడంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు.” అని చెప్పారు.
ఇదే అమెరికన్ AI సంస్థ ఇటీవల బెంగళూరులో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. దీంతో బెళగావి సంస్థ వారికి నోటీసులు జారీ చేసింది. కానీ స్పందన లేకపోవడంతో, కోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రోపిక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మూడు పేటెంట్లు ఉన్నాయి. వాటిలో రెండు డ్రైవింగ్ సేఫ్టీ టెక్నాలజీకి, ఒకటి Wi-Fi మానిటరింగ్ సిస్టమ్‌కు సంబంధించినవి. రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో ‘క్విక్‌ట్యూన్స్’ వంటి పరిష్కారాలను వారు అభివృద్ధి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఆవిష్కరణలకు అవార్డులు కూడా ఇచ్చింది. ఈ కంపెనీకి anthropic.in డొమైన్ ఉంది.
కానీ ‘Anthropic’ కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తే.. అమెరికన్ కంపెనీ వెబ్‌సైట్ (anthropic.com) ముందుగా కనిపిస్తుంది. ఫలితంగా స్థానిక సంస్థ కనిపించక కస్టమర్లు, వ్యాపార అవకాశాలను నష్టపోతున్నారు. బెళగావి సంస్థ, అమెరికన్ AI సంస్థ నుంచి రూ. 90 లక్షల (సుమారు $10,000) పరిహారం కోరుతోంది.
విచారణ వచ్చే నెలకు వాయిదా..
బెళగావి జిల్లా వాణిజ్య కోర్టు ఫిబ్రవరి 16న అమెరికన్ కంపెనీని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ వారు హాజరుకాకపోవడంతో విచారణ మార్చి 9కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు, పన్ను చెల్లింపు రికార్డులు, సేవా ఒప్పందాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
‘జెనీవాకు వెళ్లాలి..’
“వ్యాపార సంబంధిత వివాదాల్లో ముందుగా కంపెనీ పనిచేసిందని చూపగలవు. కోర్టు పేరు ఉచ్చారణ, స్పెల్లింగ్ కూడా పరిశీలిస్తుంది. పరిహారం చెల్లిస్తే అమెరికన్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అయితే భారతదేశంలో మాత్రమే ఆదేశాలు అమలు అవుతాయి; అంతర్జాతీయంగా అమలు కోసం జెనీవా వంటి వేదిక అవసరం.” అని వాణిజ్య న్యాయ నిపుణులు అంటున్నారు.
మొత్తంగా కర్ణాటక సంస్థ తన బ్రాండ్‌ను కాపాడుకునేందుకు అమెరికన్ కంపెనీతో చట్టపర పోరాటానికి దిగింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

