
సెప్టెంబర్ లో పదకొండు శాతానికి పెరిగిన టోకు ధరల సూచీ
ఇంధన, విద్యుత్ రంగంలో పెరిగిన ధరలే కారణం
ఆహార, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడంతో దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగష్టులో 9.92 శాతం నుంచి సెప్టెంబర్ లో 11.39 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు బుధవారం వెల్లడించాయి. ఆహార సూచీలో ద్రవ్యోల్బణం ఆగష్టులోని 7.05 శాతం నుంచి సెప్టెంబర్ 8.66 శాతానికి పెరిగింది.
తయారీ వస్తువుల రంగంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఆగష్టులోని 8.37 శాతం కంటే ఎక్కువగా 9.76 శాతంతో శ్రేణిలోనే అత్యధిక స్థాయికి చేరింది. ఇంధన, విద్యుత్ రంగంలో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ లో 25.85 శాతంగా నమోదు అయింది.
అంతకుముందు నెలలో ఇది 22.93 గా ఉంది. వివిధ గ్రూపులలో ఖనిజ నూనెలు, ఆహారపదార్థాలు, ముడి పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు, లిగ్నైట్, ప్రాథమిక లోహాల తయారీ, రసాయనాలు, వాటి ఉత్పత్తులు, వస్త్రాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, విద్యుత్ పరికరాలు సెప్టెంబర్ 2026 లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణానికి చోదకాలుగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ డబ్ల్యూపీఐ డేటాను విడుదల చేస్తూ తెలిపింది.
పశ్చిమ ఆసియా యుద్ధం, దాని ఫలితంగా భారత్ లోకి అధిక శాతం ముడి చమురు దిగుమతి అయ్యే హార్ముజ్ జలసంధి దిగ్భంధనం, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, ఎరువుల ధరలను పెంచడం దాని ప్రభావం ఆహారం, నిత్యావసర వస్తువుల ధరలపై పడటంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డబ్ల్యూపీఐ పెరుగుదల బాటలో ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ గతవారం ప్రామాణిక పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. ఈవారం ప్రారంభంలో విడుదలైన రిటైల్ ద్రవ్యోల్భణ గణాంకాల ప్రకారం, ఆహార ధరలలో తీవ్రమైన పెరుగుదల కారణంగా ఆగష్టులోని 4.83 శాతం నుంచి సెప్టెంబర్ లో ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ట స్థాయి అయిన 5.54 శాతానికి పెరిగింది.
Next Story
