హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ పై నమ్మకం పెంచిందా?
x

హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ పై నమ్మకం పెంచిందా?

నోటిఫికేషన్ అంటేనే న్యాయ వివాదాల కేంద్రంగా పలు పరీక్షలు


నిరాధారమైన ఆరోపణలు, ఊహజనిత సూత్రాల ఆధారంగా గ్రూప్-1 వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు రద్దు చేయడం కుదరదని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు, ప్రశ్నా పత్రాల లీకేజీ, కొందరికి అనుకూలంగా నిర్ణయాలు జరిగినట్లు కూడా పిటిషనర్లు నిరూపించలేకపోయారని పేర్కొంది.

గత ఏడాది మరోసారి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మోడరేషన్ పద్దతిలో రీవాల్యూయేషన్ ప్రక్రియను మాన్యువల్ గా నిర్వహించి ఫలితాలను వెల్లడించి 563 గ్రూప్ -1 పోస్టులు భర్తీ చేయాలని గత ఏడాది మార్చి 30 న సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.
అయితే తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ తో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో కేసు దాఖలు చేశారు. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లతో కూడిన కూడిన ధర్మాసనం గురువారం 123 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది.

ఏళ్లకు ఏళ్లుగా పోరాటం..

తెలంగాణ వచ్చిన తరువాత టీజీపీఎస్సీ నుంచి విడుదలయిన గ్రూప్స్ నోటిఫికేషన్ అన్ని కూడా న్యాయ వివాదాలలో చిక్కుకున్నాయి. ముందు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేయడం, పరీక్షలు తేదీలలో మార్పులు, కొన్ని రోజులకు ఏవో కొన్ని విద్యార్థుల సంఘాలు ధర్నా చేయడం మళ్లీ తేదీలు మార్చడం పరిపాటిగా మారింది.
మొదట 2017 లో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ ను ఒకసారి పరిశీలిస్తే.. మొదట ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ సరిగా సమయం లేదని, పుస్తకాలు మార్కెట్లోకి రాలేదని వాటిని చివరకు సెప్టెంబర్ వరకూ వాటిని పోస్ట్ పోన్ చేశారు.
ఎలాగో అలా పరీక్షలు పూర్తి చేస్తే వాటి ఫలితాలను మాత్రం రకరకాల కారణాలతో దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఫలితాలను ప్రకటించలేదు. 2019 లో జనవరిలో గానీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే ఇందులోను డిప్యూటీ తహసీల్దార్ లాంటి ఉత్తమ కేటగిరీ పోస్టులకు కూడా మరోసారి పెండింగ్ లో పెట్టారు.
దీనితో అభ్యర్థులు తీవ్రంగా మానసికంగా కుంగిపోయారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థులు కూలీ పనులకు వెళ్తున్నారని కొన్ని పత్రికలలో ఫొటోలతో వార్తా కథనాలు ప్రచురితం కావడం కలకలం రేపింది.

గ్రూప్-2 వివాదం... రద్దు చేస్తూ ఉత్తర్వూలు..

2015-16 నాటి గ్రూప్ పరీక్షను సైతం రద్దు చేయాలని హైకోర్టు గత ఏడాది నవంబర్ 18న తీర్పు వెలువరించింది. టీజీపీఎస్పీ తనకున్న అధికార పరిధిని దాటి వ్యవహరించిందని, ఎనిమిది వారాల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని బోర్డును ఆదేశించింది. అయితే ఉద్యోగం వచ్చిన ఆరు సంవత్సరాలకు తీర్పు రావడంతో అప్పటి అభ్యర్థులు అవాక్కయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వం 2015 లో 1032 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అనేక వాయిదాలతో చివరకు 2016 లో పరీక్ష నిర్వహించారు. చివకరు బుక్ లెట్ నంబర్, ప్రశ్నాపత్రం బుక్ లెట్ నంబర్, ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరడం లేదని సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.
అన్ని అంశాల అధ్యయనం తరువాత చిన్నచిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని, వైట్ నర్, బబ్లింగ్ తుడిచివేతలు ఉంటే మూల్యాంకనం చేయరాదని పేర్కొంది. కానీ హైకోర్టు సరైన నిబంధనలు పాటించలేదని ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఈ కేసు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కు చేరింది.

గ్రూప్ వన్ వివాదం..

తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు పది సంవత్సరాలకు గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కూడా ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోరంగా విఫలమయింది.
ఏకంగా మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. 2022లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన అది కమిషన్ ఉద్యోగి లీక్ చేసినట్లు తెలియడంతో ప్రభుత్వం రద్దు చేసింది.
రెండో సారి మూడు నెలలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్ అందులో సొంత నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి హైకోర్టు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
తాము అన్ని నిబంధనలు పాటించామని హైకోర్టు నిర్ణయంపై స్టే విధించమని కోరింది. దాంతో అప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల అయి సంవత్సరం దాటింది. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా కొన్ని ఉద్యోగాలు జోడించి కొత్త నోటిఫికేషన విడుదల చేసింది. ఎలాగోలా ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది.
అయితే ఇందులో కూడా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, కొన్ని కేంద్రాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్ గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించింది. అయితే డివిజన్ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. కేవలం ఊహగానాల ద్వారానే ఈ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుందని, వాస్తవాల పరిశీలన జరగలేదని పేర్కొంది. పరీక్షలో ఎలాంటి లోపాలు లేవని తాజాగా తీర్పు ఇవ్వడంతో వివాదం ముగిసినట్లు అయింది.

ఎన్నో ఏళ్ల కల..

ఈ అంశానికి సంబంధించి సీ. కరుణ అనే గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థిని ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. తాము ఏళ్లకు ఏళ్లు చదివిన ఉద్యోగాలు రావడం గగనమవుతుందని, అనేక నిబంధనలు కేసు పేరుతో మానసికంగా హింసకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
2013 లో గ్రూప్ వన్ కోసం హైదరాబాద్ కు కోచింగ్ కు వస్తే.. 2022 లో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. చివరకు ఎన్నో వివాదాలతో పరీక్ష సాగిందని, ఈ కాలంలో ఎన్నో మానసిక వేదనలు అనుభవించామని వివరించారు.
గ్రూప్ వన్ లో ఎంపీడీఓగా సెలెక్ట్ అయిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ పూర్తయిన 2014 లో సివిల్స్, గ్రూప్ వన్ కోసం సిద్ధమయితే చివరకు 2024 లో ఉద్యోగం సాధించానని చెప్పారు.
అయితే గ్రూప్ పరీక్ష కేసులు అనేక రోజుల పాటు నిద్రలేకుండా చేశాయని చెప్పారు. చివరకు ఉద్యోగం సాధించామని ఆనందపడే లోపు మరోసారి సింగిల్ బెంచ్ పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పడంతో మరోసారి కుంగిపోయినట్లు చెప్పారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు సమగ్రంగా ఉందని ఇకపై న్యాయవివాదాలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాలని కోరారు.
Read More
Next Story