
'పేచి' ఓటిటి మూవీ రివ్యూ
దారి తప్పిన దెయ్యం కథ
సాధారణంగా మనిషి భయపడేది చీకటికి కాదు… ఆ చీకటిలో ఎవరైనా ఉన్నారేమో అన్న అనుమానానికి. హారర్ సినిమాలు ఈ అనుమానాన్ని స్పష్టమైన రూపంలో చూపిస్తాయి — కొన్నిసార్లు శబ్దాలతో, మరికొన్నిసార్లు నిశ్శబ్దంతోనే. శూన్యంలో చప్పట్లు,చీకట్లో వినీ వినపడిని శ్వాసలు,నవ్వులు, లేదా ఒక మూల నుంచి మెరిసే కళ్ళు — ఇవన్నీ కలిపి మనలోని అసలైన భయాలను బయటకు తీస్తాయి. ఇవన్నీ హారర్ చిత్రాలకు తప్పనిసరి అన్నట్లు మన సినిమాలు సాగుతూంటాయి. అలాగే ఓటిటిలో రిలీజైన 'పేచి' అనే హారర్ సినిమా, ఆ చీకటి ప్రపంచంలో మనల్ని ఎంతవరకు లాగగలిగిందో చూద్దాం.
స్టోరీ లైన్
ఐదుగురు ఫ్రెండ్స్ — చరణ్, మీనా, చారు, సేతు, జెర్రీ — వీకెండ్‌కి ట్రెక్కింగ్ చేయాలని డిసైడ్ అవుతారు. నేచర్ లవర్స్ అన్నమాట. అలా వాళ్లు సెలెక్ట్ చేసుకున్న అడవి… ప్రెండ్లీ ఫారెస్ట్ కాదు. అరాణ్మణైకాడు అనే దట్టమైన అటవీ ప్రాంతం. ఫర్మిషన్ లేకుండా ఎవరూ అక్కడికి వెళ్లరాదు అన్నది ఆ ఫారెస్ట్ రూల్. అంతే కాదు, ఆ అడవి దరిలోనే ఉన్న పల్లెవాళ్లే కూడా ‘అక్కడ అడుగు పెట్టొద్దురా బాబూ’ అని భయపెడుతూ చెప్తూంటారు. అలా ముందుకు వెళ్తే ఆ అడవిలో ఓ చోట రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే బోర్డ్ కనిపిస్తుంది. ఆ ఏరియాలోకి ఎవరూ అడుగుపెట్టకుండా కంచె ఏర్పాటుచేస్తారు. కానీ యూత్ వింటుందా?
ఒక లోకల్ గైడ్ — మారి (బాలా శరవణన్) — "ఓకే, నన్ను ఫాలో అవండి. మిమ్మల్ని హ్యాపిగా తీసుకెళ్తా" అంటాడు. అడవిలో అడుగు పెట్టాకే తెలుసుకుంటారు... అక్కడ ఓ నిషేధిత జోన్ ఉందని. ఆ జోన్ మీద చెడు శక్తి ఉన్నదని మారి వార్నింగ్ ఇస్తాడు. "ఇక్కడ ఓ దెయ్యం ఉంది బాస్, పేరు – పేచి! మేటర్ ఏంటంటే, ఎవడు వినకుండా ముందుకు వెళ్తాడో, వాడికి మూడినట్లే ." అని చెప్తాడు. కానీ మన కుర్రాళ్లకి దెయ్యం ఆంటీ పేచీ మీద నమ్మకం లేదు. మరిగే రక్తం కదా – మారి వార్నింగ్ లు లెక్క చెయ్యారు. దెయ్యం ఛాలెంజ్ లకు తగ్గేదేలే అంటారు .
జెర్రీ ఫోటోలు తీయడం మొదలుపెడతాడు… కానీ కేమెరాలో కనిపించేది నార్మల్ ప్రపంచం కాదు. పక్కవాళ్లు నవ్వేస్తారు. కానీ అతడికి విషయం సీరియస్ అని అర్థమవుతుంది. ఆఖరికి సేతు–చారు లాంటి డేర్ మాస్టర్లు కూడా పేచీ అనే ఆత్మ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అడుగు పెడతారు. అక్కడి నుంచే అసలు హారర్ మొదలవుతుంది.
అసలు ఈ ‘పేచి’ ఎవరు? ఆమె ఇలా ఫుల్ల్ రివెంజ్ మోడ్‌లో ఎందుకు ఉన్నది? ఈ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా హారర్ రియలైజ్ అయ్యేలా చేస్తుందా లేక చాకచక్యంగా తప్పించుకుంటారా? ఇది కేవలం ట్రెక్కింగ్ ట్రిప్ కాదు బ్రదర్… డెత్త్ ఎక్స్‌పీరియన్స్! అందరూ బయటపడతారా? లేక ఎవరో అక్కడే చిక్కుకుంటారా? ఇవన్నీ ఇంట్రస్ట్ ఉంటే స్క్రీన్ మీదే చూడాలి.
విశ్లేషణ
కథాపరంగా చూసుకుంటే, ‘పేచి’లో ఒరిజినాలిటీ అనేదే పెద్దగా లేదు. గతంలో ఎన్నో హారర్ సినిమాల్లో చూసిన సెటప్ ఇది. ఇటు హాలీవుడ్ నుంచీ, అటు టాలీవుడ్ వరకూ వచ్చిన పాపులర్ హారర్ మూవీస్ అన్నిటి నుంచి ఎలిమెంట్స్ తీసుకుని, వాటినే క్రాస్ఓవర్ చేసి తెరమీదకు తీసుకువచ్చినట్టుగా సినిమా మొదటి టైటిల్స్ లోనే డైరెక్టర్ క్లీన్‌గా చెప్పేశాడు. అంటే డెరివేటివ్‌గా ఉందన్న ఫీలింగ్ ఇన్‌బిల్ట్!
ఫస్ట్ సీన్ దగ్గర నుంచి డైరెక్టర్ టెన్షన్ బిల్డ్ చేయడంలో బిజిగా ఉన్నాడు. మెయిన్ క్యారక్టర్స్ అడవిలో అడుగు పెట్టిన దశ నుంచి... వాతావరణం, సౌండ్ డిజైన్, స్క్రీన్‌ప్లే – అన్నీ ఫుల్ గా భయంలో ముంచేద్దామని ఫిక్స్ అయ్యాడని అనిపిస్తుంది. కానీ మిడ్‌పాయింట్ దాటి వచ్చిన తర్వాత...
ఒక్కో సీన్ చూస్తుంటే — "అబ్బా ఇది 'క్వైట్ ప్లేస్'లో చూసిన సీన్ లాంటి దే కదా!" "ఇది 'డిమాంటే కాలనీ' లోని కెమెరా పాయింట్ కదా!" అని గుర్తొస్తూనే ఉంటుంది.
పాత్రలు రియలిస్టిక్… కానీ స్కేర్స్ ఎనాటివి? చెట్లలోంచి చేతులు బయటకు రావడం, పొరపాటుగా భూతం ఎదురుగా నిలబడటం, ఫ్లాష్ బ్యాక్ లెవల్స్‌కి నడవడం – ఇవన్నీ ఇప్పటికే మనం చాలాసార్లు చూసిన స్కేర్స్. భయపెట్టే ప్రయత్నం ఉంది కానీ... భయం లేదు. సినిమా predictable అయిపోయింది. ఏ సీన్‌లో ఏ భూతం వస్తుందో మనకు ముందే టిప్స్ , క్లూలు కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ – షాక్ ఇవ్వాలనుకుని, డైరక్టరే షాక్ తినేలా ఉంది ఆడియన్స్ ఎక్సప్రెషన్స్ చూస్తే.
అలాగే ఒకవేళ మీరు హారర్ సినిమాల వీరాభిమాని అయితే, ఈ పాయింట్లపై ఫుల్ డిజావూ గ్యారంటీ. అలాగే పేచీ మూవీలో యాక్టింగ్ పరంగా గాయత్రి మెప్పిస్తుంది
ఫైనల్ థాట్
భయం విషయానికి వస్తే ఈ సినిమాలో ఎలిమెంట్స్ కు కాకుండా.. దీనికి కూడా ఓ సీక్వెల్ వస్తుందేమో అన్న భయమే చూసిన వారిని వెంటాడుతుంది. కాబట్టి చూసాక..మీ పేచీ ,పూచి మాకేం లేదు అని చివర్లో వేస్తే బాగుండేది.
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.