
తండ్రిని చంపాలనుకునే కొడుకు కథే ‘రామం రాఘవం’
కొడుకు కోసం ప్రాణం పెట్టే తండ్రి రామాన్ని రాఘవం ఎందుకు చంపాలనుకున్నాడు?
‘రామం రాఘవం’ సముద్రఖని, ధనరాజ్ ముఖ్యపాత్రలుగా వచ్చిన సినిమా. ఈ సినిమా మీద ఆసక్తి పెరగడానికి కారణం ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తూనే ధనరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించడం. విమానం సినిమాతో హిట్ కొట్టిన శివ ప్రసాద్ యానాల రాసుకున్న కథ ఇది. దీనిలో మొదట ధనరాజ్ ని నటుడిగా మాత్రమే అనుకున్నా, అనుకోని పరిస్థితుల్లో ధనరాజ్ ఈ సినిమాకు దర్శక బాధ్యతలు కూడా చేపట్టాల్సి వచ్చింది. ఓ పక్క ధనుష్, శివ కార్తికేయన్ ఇంకా ఎందఱో ప్రముఖ నటులతో నటించడంతో పాటు, తనకంటూ ఒక స్టార్ డం క్రియేట్ చేసుకోవడంతో పాటు ,స్వయంగా దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాలో రామం పాత్రలో నటిస్తుంటే, ఇప్పటివరకు కేవలం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ ద్వారా మాత్రమే పరిచయం అయిన ధనరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తూనే, దర్శకత్వం కూడా వహించడంతో ఈ సినిమా మీద ఆసక్తి,అంచనాలు పెరిగాయి. అటూ తమిళ్ ,ఇటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది. మరి ధనరాజ్ డైరెక్టర్ గా, రాఘవంగా ఏకకాలంలో మెప్పించగలిగాడా?లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
తండ్రికొడుకుల కథ ‘రామం రాఘవం.’ దశరథ రామంగా, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, విలువలనే ఆస్తిగా భావించే తండ్రి పాత్ర సముద్రఖనిది. ఇక కొడుకు రాఘవం పాత్రకు వస్తే చిన్నప్పటి నుండే చదువు అబ్బలేదు, పైగా డబ్బు కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని పాత్ర. కష్టపడే మనస్తత్వం లేదు. ఇంకా చెప్పాలంటే పక్క కన్నింగ్ పాత్ర. అమలాపురంలో జరిగే కథ ఇది. కొడుకు కోసం ప్రాణం పెట్టే తండ్రి రామాన్ని రాఘవం ఎందుకు చంపాలనుకున్నాడు అన్నదే కథ.
సముద్రఖని రామంగా ఒక ఫీల్ గుడ్ పాత్రగా నిలిచిపోయారు. ఇక ధనరాజ్ విషయానికి వస్తే, కథ మొదటి నుండి చివరి వరకు ఎక్కడో ఒక చోట రాఘవం మారతాడు అన్న ప్రతి సారి ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సినిమా చివరి వరకు రాఘవం దుర్మార్గుడిగానే మిగిలిపోతాడు. చివరిలో అతని మార్పు కూడా భయంతో వచ్చిందే. అది తర్వాత అతనిలో పరివర్తన తెచ్చినా, రామం లేకపోవడంతో చివర్లో ప్రేక్షకులను ఏడిపించేసాడు ధనరాజ్. ధనరాజ్ కంప్లీట్ విలన్ గా, డైరెక్టర్ గా సక్సెస్ అయిన సినిమా ఇది. రాఘవం పాత్రలో ధనరాజ్ బాడి లాంగ్వేజ్, ఆ పాత్రకు సరిపోయే ఎమోషనల్ పర్సనాలిటీని సినిమా మొత్తం ఒకేలా ఉండేలా జాగ్రత్త తీసుకోవడంలోనూ, ఇంకో పక్క సినిమాను ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా మలచడంలో మాత్రం ధనరాజ్ పూర్తీ స్థాయిలో సక్సెస్ అయిన సినిమా ఇది.
తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమను, కొడుకుకి తండ్రి మీద ఉన్న కోపాన్ని,ద్వేషాన్ని ఒకేసారి చూపించే సినిమా ఇది.దుర్మార్గుడైన మనిషి మాటలతోనో లేక ఇంకేదో కారణాల వల్లో మారే అవకాశం తక్కువ.తను చేసే దుర్మార్గానికి స్వచ్చందంగా బలయ్యే ప్రేమ మాత్రమె అతన్ని మార్చగలదు అని చెప్పే సినిమా ఇది. తండ్రి ప్రేమ కూడా రాఘవాన్ని మార్చలేకపోయింది, కాని ఎప్పుడైతే కొడుకే చంపిస్తున్నాడని తెలిసి కూడా దాన్ని ఆ తండ్రి దానికి సిద్ధపడ్డాడో అప్పుడే రాఘవం మారతాడు. కథలో ఈ ట్రాన్స్ ఫర్ మేషన్ ని ధనరాజ్ తన నటనతో గొప్పగా ప్రదర్శించాడు.
‘రామం రాఘవం’ సినిమాలో ఉన్నవి మూడు,నాలుగు ముఖ్య పాత్రలు మాత్రమే. ఈ సీరియస్ స్టోరిలో సత్యను రాఘవం ఫ్రెండ్ కేరెక్టర్ గా తీసుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే రాఘవం పాత్ర చాలా క్రూరమైన పాత్ర, భౌతికంగా మాత్రం ఫైట్స్ చేసే పాత్ర కాదు. ఈ రాఘవం పాత్రకు శారీరక బలం ఉన్న దేవా పాత్రను ఎన్నుకోవడంతో కథ బలపడింది. రియలిస్టిక్ కథ కాబట్టి ఇందులో పాత్రలు ఏవి కూడా వాస్తవానికి దూరంగా లేవు. కాస్టింగ్ విషయంలో సునీల్ పాత్రను మాత్రం కొంత పరిమితంగా వినియోగించుకున్న భావన కలుగుతుంది. డైరెక్టర్ గా,నటుడిగా ధనరాజ్ సక్సెస్ అయిన సినిమా ఇది. ఈ సినిమాకి హీరో రామం. విలన్ రాఘవం. సముద్రఖని తన పాత్రలో అవలీలగా నటించేసారు. ‘బుజ్జి ఇలారా’ సినిమా తర్వాత ఒక ఫుల్ రోల్ లో ధనరాజ్ నటించిన సినిమా ఇది. కాని ఇప్పటివరకు విలన్ షేడ్ పాత్రల్లో నటించని ధనరాజ్ ఈ సినిమాతో పూర్తి స్థాయి విలన్ గా తనను తానూ మార్చుకున్నాడు.
సినిమా నిడివి పరంగా పెద్ద ఇబ్బంది పెట్టకుండా ఉంది. ఎడిటింగ్ బాగుంది. తెలుగు సినిమాల్లో సాంప్రదాయంగా కనిపించే ఓవర్ ఎమోషనల్ డ్రామా కనిపించని సినిమా. కనిపించేదంతా ఇప్పుడు మన సమాజంలో మనకు ఎక్కడో ఓ చోట కనిపించే మనుషుల పాత్రలే, బయట పడే వరకు కనిపించని వారి దుర్మార్గ మనస్తత్వాలు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే;ఎప్పటికి అటూ రామాన్ని, ఇటు రాఘవాన్ని గుర్తుంచుకునేలా ధనరాజ్ క్లైమాక్స్ ను నిర్మించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఫైనల్ గా, సినిమా చూడొచ్చా అంటే తప్పక చూడొచ్చు!
* * *