’12th పెయిల్‘ ఒటిటిలో తెలుగు లో చూడవచ్చు..
సకుటుంబ సపరివారంగా చూడాల్సిన సినిమా, ముఖ్యంగా పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా. ఇపుడు ఒటిటిలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
అతను డిల్లీ వచ్చేసాడు. ఐపీఎస్ అవ్వాలనేది అతని కోరిక..కానీ అక్కడేమీ ఎవరు తెలియరు. ఏమీ తెలియదు. చేతిలో డబ్బులు లేవు. పలకరించటానికి తెలిసున్న మనుష్యులులేరు. కానీ కడుపులో ఒకటే పట్టుదల అమ్మకి ఇచ్చిన మాట,నాయనమ్మ ఆశ్వీర్వచనం రెండూ తలుచుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టాలి... అతను డిల్లీ కు బయల్దేరిన నాటి పరిస్థితిని చూస్తే బాల గంగాధర తిలక్ రాసిన ఒక కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తాయి.
చిన్నమ్మా నేను వెళ్లొస్తాను..
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది..
శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది..
దారంతా గోతులు.. ఇల్లేమో దూరం..
చేతిలో దీపం లేదు
ధైర్యమే ఒక కవచం..
అలా ధైర్యమే కవచంలా బయల్దేరిన బాటసారి కొన్నేళ్ల తర్వాత చేసిన విజయ గర్జనతో దేశమంతా అతని వైపు చూసింది. అతనే మనోజ్ కుమార్ శర్మ. అతను రాసిన పుస్తకం ఆధారంగానే ఈ సినిమా తయారైంది.
అతి తక్కువ బడ్జెట్‍తో వచ్చి ఈ మద్యకాలంలో అతి పెద్ద హిట్టైన బాలీవుడ్ మూవీ ‘12th ఫెయిల్’.స్టార్ డైరక్టర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అవటమే కాకుండా విమర్శలు ప్రశంసలను పొందింది. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. సాధారణ ప్రేక్షకుల నుంచి చాలా మంది ప్రముఖులు కూడా ఈ మూవీని చాలా మెచ్చుకున్నారు. ఓకే ఇంకా ఏమున్నాయి అంటే... ‘12th ఫెయిల్’ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విక్రాంత్ మాస్సే. ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది. సరి..సరే అసలు కంటెంట్ ఏమిటి ..దేని గురించి అంటే... ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రాసిన పుస్తకం బేస్ చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల నిజ జీవిత కథగా వచ్చిన పుస్తకం ‘12th ఫెయిల్’. ఈ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. నవలా రచయిత అనురాగ్ పాఠక్ ఎంత అద్బుతంగా రాసారో అంతకు మించి విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. బందిపోట్లకి పేరు బడ్డ చాలా వెనుకబడిన చంబల్ గ్రామంనుంచి ఒక హిందీ మీడియం సగటు విద్యార్థి పోలీసు శాఖలోని ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమమే ఈ కథ చెప్తుంది. మధ్యలో ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ... మనోజ్‌పై చుట్టుప్రక్కల వాళ్లు విసిరే ఛాలెంజ్ లను ఎలా దాటాడు..అనే విషయం చుట్టూ తిరిగే కథ ఇది.
మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతం అంటే దొంగలకు పేరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ మౌర్యానాకు చెందిన మనోజ్ కుమార్ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది తినటానికి తిండి లేని కుటుంబం. మనోజ్ తండ్రి ఉద్యోగంలో నిజాయతీగా ఉండి లంచాలు తీసుకోకపోవటంతో సస్పెండ్ అవుతాడు. ఇక మొదటి నుంచి మనోజ్ చదువులో టాపర్ కాదు. దానికి తోడు అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపల్ స్వయంగా ప్రోత్సహిస్తూంటాడు. ఓ రోజు ఈ కాపీ కొట్టే విషయం డీఎస్పీ దుష్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతాడు. సగటు విద్యార్థి అయిన మనోజ్ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్ ఏం చేశాడు? 12th ఫెయిల్ అయినా సివిల్స్ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల సమాహారమే ఈ చిత్రం.
ఎప్పుడో వచ్చింది కదా ఇప్పుడేంటి అంటారా.. 12th ఫెయిల్ సినిమా ఓటిటిలో వచ్చింది కానీ కేవలం హిందీ వెర్షన్‍లోనే అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం రిలీజైనా.. ఓటీటీలోకి మాత్రం హిందీ మాత్రం వచ్చింది. దీంతో 12th ఫెయిల్ తెలుగు వెర్షన్ కావాలని హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది డిమాండ్లు చేసారు. మొత్తానికి ఇప్పుడు తెలుగు వెర్షన్ సైతం దింపారు. 12th ఫెయిల్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా నేడు అందుబాటులోకి వచ్చేసింది. అలాగే, తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి చూసేయండి..మీ పిల్లలకు చూపెట్టండి...కొన్ని సినిమాలు పిల్లలతో కలిసి చూడాలి. వాళ్లూ నేర్చుకోవాలి. వాళ్లతో పాటు మనమూ నేర్చుకోవాలి. లేకపోతే అంతా సాప్ట్ వేర్ ఇంజినీర్లే అవుతారు.. ఐపీఎస్ లు ఐఏఎస్ లు అవ్వాలనే ఆలోచనలు రావటం లేదు.
Next Story