
న్యాయం ఓ సామాజిక పక్షపాతం?: '23' సినిమా రివ్యూ
ప్రశ్న… నిప్పులా చురుక్కుమంటుంది.
చమక్కుల వైపు నిలబడే కమర్షియల్ సినిమా ఎప్పుడూ చురుక్కుమనిపించటానికి ఇష్టపడదు. కానీ అప్పుడప్పుడూ చట్టాలను, న్యాయవ్యవస్థను, సమాజపు పరిధలను ప్రశ్నించే సినిమాలు వస్తుంటాయి. వాటి ఉద్దేశ్యం సమాధానాలు రాబట్టడం కాదు… మనలోనూ ప్రశ్నలు వేయాలనే తాపత్రయాన్ని కలిగించటం, మనలోని మనిషిని నిలదీయడం.
ఎందుకంటే కొన్ని ప్రశ్నలు సమాధానాలకంటే గొప్పవి. అవి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మన నిశ్చలతను, మన విశ్వాసాలను, మన నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తాయి. అవి వచ్చి — మన కట్టుబాట్ల గోడల్ని తుడిచిపెట్టేస్తాయి. మనలోని ప్రశ్నించే తత్వాన్ని మేల్కొలుపుతాయి. అలాంటి ఓ ప్రశ్నే "23". ఈ సినిమా కథేంటి, ఇందులో చర్చించిన విషయం ఏమిటి, ఎలా ఉంది?
స్టోరీ లైన్
ఒక లాయర్. ఒక నమ్మకం. మూడు కేసులు. ఓ నిజం.
అతనో అగ్రకుల లాయర్… కానీ అతడు తన కులాన్ని కాదు – న్యాయాన్ని ప్రేమిస్తాడు. తన మతాన్ని కాదు – మానవత్వాన్ని గౌరవించాడు. అతడి కోర్ట్ జీవితం ఓ లక్ష్యంతో కాదు... ఒక కలతతో మొదలయ్యింది. ఎందుకంటే, అతడు చూసిన కొన్ని కేసులు న్యాయవ్యవస్థలోని అసమానతల్ని బహిరంగంగా ఎత్తి చూపించాయి.
1991 – చుండూరు:
ఒక చిన్న ఊరి థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు, ఒక దళిత యువకుడు అకస్మాత్తుగా ఒక అగ్రవర్ణ యువతి కాలును చూసుకోకుండా తొక్కుతాడు. అతడు వెంటనే క్షమాపణ అడిగినా అది పెద్ద వివాదానికి దారి తీస్తుంది. ఆ చిన్న తప్పిదం మీద క్షమాపణ కోరినా తీరని కోపంతో, ఆ ఊరిలోని అగ్ర వర్గం దళితులపై దాడి చేసి 8 మందిని హత్య చేసే దాకా దారి తీస్తుంది.
8 మంది దళితులపై అగ్రవర్ణస్తులు వారు దాడి చేసి, బహిరంగంగా హత్యలు చేసిన ఈ కేసు పెద్దదే . కానీ… వారు బయిటకు వచ్చేసారు, ఎలా,అగ్ర కులం వారనా?
1993 – చిలకలూరిపేట:
గుంటూరు జిల్లాలో సాగర్ (తేజ) మరియు సుశీల (తన్మయ) ప్రేమలో ఉంటారు. సాగర్ దళిత వర్గానికి చెందినవాడు. అతని స్నేహితుడు దాస్ కూడా అతని సమాన వర్గానికి చెందుతాడు. కుల విభజనల మధ్య వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓసారి వాళ్లు బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. కంగారులో అంటించేస్తాడు సాగర్.. అంతే 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు. దాంతో వాళ్లకు కోర్ట్ ఉరి శిక్ష వేస్తుంది.
సాగర్, దాస్ – వారి మీద ప్రత్యక్ష సాక్ష్యం లేదు. కానీ కులం, సామాజిక స్థితి మాత్రం ‘తక్కువ’. కాబట్టి వారిని మరణశిక్షతో దోషులుగా నిర్ధారించారు.
1997 – జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్:
28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు మద్దెల చెరువు సూరి. అతని శిక్షను, "జైలులో మంచి ప్రవర్తన" పేరుతో తగ్గించడమేకాదు – మాఫీ కూడా చేసారు. ఎందుకు? ఎందుకంటే అతని వెనుక ఉన్న సామాజిక బలాలు
ఈ మూడు ఘోర ఘటనలలో ఒక సగటు లాయర్ జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణల ద్వారా, న్యాయం అంటే ఏమిటి? నిజమైన న్యాయం మన వర్గం, సామాజిక స్థితి దాటుకుని అందరికీ సమానంగా వస్తుందా? అనే ప్రశ్న ఈ సినిమా ‘23’ వేస్తుంది.
విశ్లేషణ
"23" అనే సినిమా కోర్ పాయింట్ ఒకటే – న్యాయం సమానంగా జరగదన్న అసమానమైన నిజం. ఒక సగటు లాయర్… కానీ మనసున్న మనిషి, ఈ మూడు కేసుల మధ్య దాగి ఉన్న కుల, వర్గ, సామాజిక వ్యవస్థల కుట్రని ఎలా ఎదుర్కొన్నాడో తెలియజేసే కథ ఇది. ఈ మూడు కేసులలో నిందితుల ఆర్థిక స్థితి, సామాజిక బ్యాక్‌గ్రౌండ్ – వాటన్నింటి మీద ఆధారపడి న్యాయవ్యవస్థ ఎలా వక్రీకరించబడిందో ఈ సినిమా గట్టి ప్రశ్నలు వేసింది. నేరం చేసినవాడికి శిక్ష పడాలా… లేక శిక్షపడటానికి సామాజికంగా "తక్కువ"వాడిగా ఉండాలా? అనే అనూహ్యమైన సత్యాన్ని,ప్రశ్నని మన ముందుంచుతుంది.
ఈ సినిమా బలహీనులకు న్యాయవ్యవస్థ ఎలా బలవంతంగా శిక్ష విధిస్తుందో చూపిస్తుంది. వేర్వేరు సందర్భాలు. వేర్వేరు నేరాలు. వేర్వేరు నిందితులు. కానీ... న్యాయం మాత్రం ఒకేలా జరగలేదు అనే విషయం గుర్తు చేస్తుంది. అందుకోసం నేరస్దులు వైపు నుంచి కథ నడపటం చాలా ధైర్యమైన విషయం. చిలకలూరి పేట కేసులో న్యాయం ప్రశ్నించటం కోసం మరో రెండు కేసులను ముడి వేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది.
మనదేశంలో న్యాయం కూడా కులం వైపు నుంచే చెప్పబడుతుందనేది దర్శకుడు ఆలోచన, వాదన. అందుకోసం తీసుకున్న సీన్స్, నేపధ్యం కొంత డాక్యుమెంటరీ వాతావరణం క్రియేట్ చేసిన మాట నిజం. అయితే ఇలాంటి సినిమా అనగానే అలాంటి నేరేషన్ ఉంటుందనే ప్రిపేర్ అయ్యివెళ్తారు కాబట్టి పెద్ద సమస్య రాదు. అలాగే పూర్తిగా నేరస్దులను సపోర్ట్ చేయలేదు. దాంతో చూసేవారికి వారిమీద పూర్తి సానుభూతి కూడా రాదు.
ఎవరెలా
కొత్తవాళ్లైనా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు అందరూ. ఇక స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. డైలాగులు సహజంగా బాగున్నాయి. సూటిగా చాలా ప్రశ్నలను మన ముందు ఉంచాయి. మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్ . పాటలు జస్ట్ ఓకే. ఎడిటర్ అనిల్ ఆలయం ఇంకాస్త షార్ట్ గా ట్రిమ్ చేసి ఉంటే స్లోనెస్ తగ్గేదేమో. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రాజ్ రాచకొండ తను అనుకున్నది మాత్రం క్లియర్ గా చెప్పగలిగారు.
ఫైనల్ థాట్
మూసలో పోసినట్లు వచ్చే కమర్షియల్ సినిమాల మధ్యలో ఇలాంటి కొత్త ప్రయత్నాలు ఖచ్చితంగా అవసరం. కొన్ని చోట్ల డైరక్టర్ ది వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ గా అనిపించినా, చాలా మంది ఆ వాదనకు కనెక్ట్ అయ్యే అవకాసం ఉంది.