సోషియో పాంటసి 45 మూవీ రివ్యూ
x

సోషియో పాంటసి '45' మూవీ రివ్యూ

ఉపేంద్ర, శివన్నల మాస్ జాతర


వినయ్ (రాజ్ బి శెట్టి) ఒక సాధారణ మిడిల్ క్లాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తల్లిదండ్రులే ప్రపంచంగా బతికే అతనికి, ఒకరోజు వచ్చిన భయంకరమైన కల తో 'గరుడ పురాణం' మీద ఆసక్తి కలుగుతుంది. మనిషి చనిపోయాక ఆత్మ పడే కష్టాలు, యమలోక శిక్షలు చదివి భయంతో వణికిపోతుంటాడు. అయితే, అక్కడితో విధి అతన్ని వదిలిపెట్టదు. ఆ కల అతని జీవితంలోకి రావటం మొదలవుతుంది.

ఒకరోజు ఆఫీసుకి వెళ్తూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వినయ్.. నడిరోడ్డుపై ఒక కుక్కను ఢీకొట్టి చంపేస్తాడు. "కుక్కే కదా" అని లైట్ తీసుకున్న వినయ్ జీవితంలోకి అక్కడే విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఆఫీసులో ఉన్న వినయ్‌ను కొందరు రౌడీలు కిడ్నాప్ చేసి ఒక రహస్య స్థావరానికి తీసుకువెళతారు. అక్కడ వినయ్‌కి అసలు బాంబు పేలుతుంది. తాను చంపింది ఒక సాధారణ కుక్కను కాదు.. ఆ ఊరిని గడగడలాడించే డాన్ రాయప్ప (ఉపేంద్ర) ప్రాణంగా చూసుకునే పెంపుడు కుక్కను!

తన కుక్క ప్రాణం తీసినందుకు, వినయ్‌కి రాయప్ప ఒక డెత్ వారెంట్ జారీ చేస్తాడు. "సరిగ్గా 45 రోజుల్లో నిన్ను చంపేస్తా" అని వార్నింగ్ ఇస్తాడు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ ప్రయాణం కూడా 45 రోజులే అని తెలిసిన వినయ్, చావు భయంతో వణికిపోతూ తన ప్రేయసి మేఘన సాయం కోరతాడు. వినయ్ ప్రాణాలను కాపాడటం కోసం మేఘన అతన్ని శివప్ప (శివరాజ్ కుమార్) దగ్గరికి తీసుకెళ్తుంది.

అసలు ఈ శివప్ప ఎవరు? రాయప్ప లాంటి డేంజరస్ డాన్‌ని ఎదిరించే ధైర్యం అతనికి ఉందా? శివప్పకి, రాయప్పకి మధ్య ఉన్న పాత పగ ఏంటి? చివరకు గరుడ పురాణం వీరి ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది? అనేదే ఈ '45' క్లైమాక్స్!

ఎనాలసిస్

యాక్షన్ సినిమాలను కేవలం ఫైట్లు, పాటలకే పరిమితం చేయకుండా, మనిషి జీవితం, మరణం వెనుక ఉన్న గొప్ప రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందీ చిత్రం '45'. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారిన అర్జున్ జన్య (Arjun Janya), తన ఏళ్ల తరబడి సంగీత అనుభవాన్ని విజువల్స్ లోకి మార్చి ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేసారు. "జీవితం, మరణం ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. వాటి మధ్య ఉన్న ఒక చిన్న ఖాళీ సమయమే మన జీవితం". ఆ చిన్న సమయంలో మనం చేసే పనులే మన అంతిమ గమ్యాన్ని నిర్ణయిస్తాయని ఈ చిత్రం ద్వారా చెప్దామని దర్శకుడు ప్రయత్నించారు.

కర్మ మీ పక్కనే నిలబడి లెక్క పెడుతోంది! ఒక చిన్న రోడ్డు ప్రమాదం.. ఒక ప్రాణం పోవడం.. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. కానీ, మనం చేసే ప్రతి చిన్న తప్పు ఒక పెద్ద అలలా మారి మనల్ని ఎలా ముంచేస్తుందో ఈ సినిమా కళ్లకు కడుతుంది. కర్మ అనేది ఎక్కడో ఉండదు.. అది మన పక్కనే నిలబడి మన రోజులను లెక్కిస్తూ ఉంటుందని (Karma is Imminent) దర్శకుడు చూపించారు. ఐడియాగా ఇదంతా బాగానే అనిపిస్తుంది.

అయితే స్క్రిప్టు రైటింగ్ లో కొంత లోపం కనిపిస్తుంది. మనిషి మరణాన్ని ఎలా తప్పించుకోవాలి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలైన సినిమా, మధ్యలో దారి తప్పినట్లు అనిపిస్తుంది. వేద గ్రంథాల నుండి తీసుకున్న కర్మ సిద్ధాంతాలను అతిగా వివరించడం కథనంకు అడ్డంకిగా మారింది. సినిమాలో గ్రాఫిక్స్, సెట్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రం 'Mad Max' ని గుర్తు చేస్తాయి. సర్రియలిజం పేరుతో లాజిక్ లేని సన్నివేశాలు రావడం చూసేవాళ్లను కొంత గందరగోళానికి గురిచేస్తుంది. ఇవన్ని ప్రక్కన పెడితే థీమ్ పరంగా ఓ కొత్త ప్రయత్నం.

టెక్నికల్ గా ...

అర్జున్ జన్య (Arjun Janya) తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశారు. ప్రతి సీన్ లోనూ భావోద్వేగాలను (Emotion), ఉత్కంఠను (Tension), మరియు ఆలోచనలను (Reflection) తన సంగీతంతో పీక్స్‌కు తీసుకెళ్లారు. అలాగే సినిమాటోగ్రాఫర్ సత్య హెగ్డే (Satya Hegde) అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ లోని స్పీడు, ఎమోషనల్ సీన్స్ లోని సున్నితత్వం ఆయన కెమెరా కంటితో అద్భుతంగా ఆవిష్కరించారు.

రాజ్ బి శెట్టి అమాయకత్వం, ఉపేంద్ర ఆవేశం, శివన్న పవర్.. ఈ ముగ్గురు స్టార్ల కెమిస్ట్రీ, యాక్టింగే ఈ సినిమాని మరో లెవల్‌కు తీసుకెళ్లింది!

ఫైనల్ థాట్

"'45' చిత్రం కేవలం డివోషనల్ ఫాంటసీ జానర్ లో తీసిన కమర్షియల్ సినిమా మాత్రమే కాదు; ఇది మరణంపై సాగే ఒక తాత్విక అన్వేషణ, అయితే ఇంత గ్రాండ్ ఐడియా కూడా కొన్ని తడబాట్లుతో పెద్దగా ఎక్సైటింగ్ గా అనిపించలేకపోయింది.

చూడచ్చా

ఓ కొత్త తరహా సినిమా గా దీన్ని చూడచ్చు. తెలుగులో ఆ మధ్యన వచ్చిన కిరణ్‌ అబ్బవరం క(KA) సినిమా గుర్తుకు వస్తుంది. ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ చూడచ్చు

జీ 5 ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story