
రాథిక 'తాయ్ కిళవి' మూవీ రివ్యూ!
క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది!
తమిళనాడులోని మారుమూల ఒక కొండవాలు గ్రామం.. అక్కడ పవునుతాయి (రాధికా శరత్ కుమార్) అంటే అందరికి హడలే. ఊరంతా అప్పులు ఇచ్చి, వడ్డీ కోసం జనాన్ని చెడుగుడు ఆడుకుంటూంటుంది.ఆవిడకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. అల్లుడు కట్నం డబ్బుల్లో మూడు తులాల బంగారం బాలెన్స్ ఇవ్వలేదని గొడవ పెట్టుకోవటంతో కూతురు సురుళి (రేచల్),మనవుడు రాజుని తన దగ్గరే పెట్టుకుని సాకుతూంటుంది. తల్లి దగ్గరే సెటిలైపోయింది. ఇక కొడుకులు కూడా ఆస్తి గొడవలతో నాలుగేళ్ల క్రితమే ఇల్లొదిలి వెళ్ళిపోయారు. తనకు తోచినట్లు తన సంపాదనతో కులాసాగా,ధీమాగా బ్రతుకుతున్న పవునుతాయికి హఠాత్తుగా ఓ రోజు పక్షవాతం వస్తుంది. కాళ్లు, చేతులు, మాట అన్నీ పడిపోతాయి.
సాధారణంగా ఎవరికైనా జబ్బు చేస్తే ఊరంతా బాధపడుతుంది, కానీ ఇక్కడ పవునుతాయి పక్షవాతం బారిన పడగానే ఊరి జనం ఆనందంతో గంతులు వేస్తారు. ఊరి జనం 'పార్టీ' మూడ్‌లోకి వెళ్ళిపోతారు. మరో ప్రక్క కొడుకులు, కోడళ్లు మాత్రం ఆస్తి కోసం వాలిపోతారు. ఇక్కడ అసలు 'ట్విస్ట్' ఏంటంటే.. ఈమె రీసెంట్‌గా 160 తులాల బంగారం కొన్నదని గోల్డ్ కుమార్ అనే వ్యక్తి లీక్ ఇస్తాడు. దాంతో కొడుకులందరికీ ఒక్కసారిగా 'గోల్డ్ ఫీవర్' పట్టుకుంటుంది. బంగారం మేటర్ చెప్పకుండా ఈ ముసలమ్మ ప్రాణం ఎప్పుడు పోతుందా అని భయపడుతూంటారు. అలాగే ఆ బంగారం ఎక్కడ దాచిందో సైగలతోనైనా చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతుంటారు. అల్లుడు కూడా తన మూడు తులాల కోసం లైన్లో ఉంటాడు.
మరి ఆవిడ ప్రాణం పోయిందా.. ఆ 160 తులాల గోల్డ్ ఎక్కడుందో కొడుకులు కనిపెట్టారా? తల్లి ప్రాణం కంటే బంగారం ముఖ్యం అనుకున్న ఆ స్వార్థపరులకు పవునుతాయి ఎలాంటి షాక్ ఇచ్చింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ సినిమా ఆత్మ 'మహిళల ఆర్థిక స్వావలంబన'. పవునుతాయి పాత్ర ద్వారా మూడు తరాల మహిళల ప్రయాణాన్ని దర్శకుడు విశ్లేషించే ప్రయత్నం చేసారు దర్శకుడు. 60 ఏళ్ల వయసులో బామ్మ పొందిన స్వేచ్ఛ, మనవరాలికి టీనేజ్‌లోనే దక్కాలనే ఆశయం చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. గ్రామీణ నేపథ్యంలో కథని సెట్ చేసి, "ఆడపిల్ల తన సొంత కాళ్లపై నిలబడాలి" అనే అభ్యుదయ భావజాలాన్ని కథలో ఇమడ్చడం అభినందనీయం. సినిమా ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లింది. హై సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో స్క్రీన్ ప్లే ఏమి వర్కవుట్ అయ్యాయో చూస్తే ప్రధానంగా మోటు కామెడీ కనిపిస్తుంది. కాకపోతే గతంలో పాండ్యరాజ్ వంటి దర్శకులు ఇలాంటి కామెడీలు చేసి,మనం చూసి ఉన్నప్పుడు ఇది అంత అతిశయోక్తిగా అనిపించదు. లేకపోతే కాస్తంత అరవ అతి అనిపిస్తుంది కొన్ని చోట్ల.
సినిమా స్క్రీన్‌ప్లేను పరిశీలిస్తే, సెటప్ (మొదటి 20 నిమిషాలు): పవునుతాయి పాత్ర ఎంత పవర్‌ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం. ఇది చాలా ఎనర్జిటిక్‌గా, రాధికా మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో చేసారు. అయితే కథలైన కోర్ పాయింట్ , కాంప్లిక్ట్ లోకి వెళ్లటం మొదలయ్యేసరికి బామ్మకు పక్షవాతం రావడం, 160 తులాల బంగారం చుట్టూ కొడుకుల వేట మొదలవ్వడం. ఇక్కడే స్క్రీన్‌ప్లే 'ఫ్యూనరల్ కామెడీ' జానర్‌లోకి మారుతుంది. అయితే, ఇక్కడే కథనం క్లారిటీ కోల్పోయింది.
ఇక ముగింపు(క్లైమాక్స్) విషయానికి వస్తే...ఒక విషాద ఘటన ద్వారా కొడుకుల్లో మార్పు రావడం. ఇది పేపర్ మీద బాగున్నా, స్క్రీన్ మీద చాలా అబ్రప్ట్‌గా (హఠాత్తుగా) అనిపించింది. కథలోని కీలక పాత్రలు రియలిజం వర్సెస్ ఒక రకమైన అతిశయోక్తి (Caricature) అన్నట్లు సాగుతాయి. దాంతో చూస్తున్న సీన్స్ సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి.
ఇక కొడుకుల పాత్రలు విషయానికి వస్తే .. ప్రతి కొడుక్కి ఒక వింత అలవాటు పెట్టడం కామెడీ కోసం బాగుండవచ్చు కానీ, వారిలో సీరియస్‌నెస్ తగ్గించేసింది. కమల్ హాసన్ ఫ్యాన్, పూలదండ కట్టలేని పూల వ్యాపారి.. ఇవన్నీ కేవలం స్కిట్ తరహా కామెడీకి పరిమితమయ్యాయి.
ఇక ఈ సినిమా బేసిక్ లెవల్‌లో కలర్‌ఫుల్ పాత్రలు, చమత్కారమైన వన్-లైనర్లతో వినోదాన్ని అందిస్తుంది. కానీ స్క్రిప్ట్ విషయంలో మాత్రం అంతా 'కన్వీనియన్స్' (సౌలభ్యం) కోసమే రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఎవరో ఒకరు వచ్చి నీతి పాఠం చెప్పగానే, పాత్రలు రాత్రికి రాత్రే మారిపోవడం అంత సహజంగా లేదు. కథ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు డ్రామా పండాలి. కానీ, ఇందులో డ్రామా కంటే 'మెలోడ్రామా' ఎక్కువైపోయింది. ఏదైమైనా పాత్రలు ఉన్నట్టుండి మారిపోవడం (Character Arc) కన్విన్సింగ్‌గా లేదు.
మరీ ముఖ్యంగా సినిమా నిడివిలో 80% కామెడీకే కేటాయించడం వల్ల, క్లైమాక్స్‌లో వచ్చే సీరియస్ మెసేజ్ ప్రేక్షకుల మీద అంతగా ప్రభావం చూపదు. దానికి తోడు పేసింగ్ ఇష్యూస్ కనపడతాయి. బామ్మ బెడ్‌రెస్ట్ తీసుకునే సెక్షన్ చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. కేవలం జోకుల కోసమే సీన్లు రాసుకున్నట్లు అనిపించడం వల్ల ప్రధాన కథ (160 తులాల బంగారం చిక్కుముడి) పక్కదారి పట్టింది.
ఎవరెలా చేసారు.
రాధికా శరత్‌కుమార్ 'తాయ్ కిళవి' సినిమాలో ఒక 'మాస్ హీరో' రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఒక పాటలో ఆమెను "సుంగుడి చీర కట్టుకొచ్చిన సూపర్మ్యాన్" అని అభివర్ణించడం ఆమె క్యారెక్టర్ పవర్ ఏంటో చెప్తుంది. అయితే, పౌనుతాయి పాత్ర మంచం పట్టిన తర్వాత రాధికా స్క్రీన్ మీద కనిపించదు, ఆ తర్వాత వచ్చే కథ ఆ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండదు. ఈ సినిమాలో మునీష్‌కాంత్, రైచల్ రెబెక్కా చేసిన రెండు సీన్లు అత్యుత్తమంగా నిలిచాయి, అవి ప్యూర్ డ్రామా సీన్లు.
టెక్నికల్ గా..
ఈ సినిమా కామెడీతో గాడి తప్పుతున్న ప్రతిసారీ, దానిని తన భుజాల మీద మోసింది మాత్రం సాంకేతిక బృందమే. దర్శకుడు శివకుమార్ ఎంచుకున్న 'మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం' అనే పాయింట్ అద్భుతం. కానీ, ఆ మెసేజ్‌ను చెప్పడానికి ఆయన ఎంచుకున్న 'అరవ అతి కామెడీ' కాస్త తగ్గించి ఉంటే మనకు ఇంకా బాగా నచ్చేది. అలాగే సినిమాను ఒక 'అవేర్నెస్ క్యాంపెయిన్'లా కాకుండా, ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా డీల్ చేసి ఉంటే బాగుండేది.
కెమెరా: వివేక్ విజయ్ కుమార్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా నేచురల్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించాయి.
మ్యూజిక్: నివాస్ కె ప్రసన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ పిల్లర్, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ప్రాణం పోశారు.
ఎడిటింగ్: సెకండాఫ్‌లో అక్కడక్కడా సాగదీత ఉన్నప్పటికీ, కామెడీ టైమింగ్‌ను మిస్ చేయకుండా సాన్ లోకేశ్ చేసిన ఎడిటింగ్ సినిమాను బోరు కొట్టకుండా కాపాడింది.
ఫైనల్ థాట్
సినిమా చివర్లో పవునుతాయి ఇచ్చే 'మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం' స్పీచ్ సినిమాకే హైలైట్. OTTలో వచ్చింది కాబట్టి ఈ సీన్ రీల్స్‌గా వైరల్ అవ్వడం ఖాయం. కానీ, ఆ ఒక్క బలమైన సీన్ కోసం సినిమా అంతా వెయిట్ చేయడం ప్రేక్షకుడికి కొంచెం ఇబ్బందే. నిజానికి ఇది ఒక పక్కా ఎమోషనల్ డ్రామా అవ్వాల్సిన సినిమా, కానీ దర్శకుడు దీనిని "తక్కువ డ్రామా.. ఎక్కువ కామెడీ" గా మార్చేశారు. ఆ కామెడీ కూడా స్కిట్ లెవల్లో ఉండటంతో, కథలోని అసలు గాఢత (Impact) మిస్ అయ్యింది.
చూడచ్చా?
సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీలతో చూడదగ్గ సినిమా
ఎక్కడ చూడాలి?
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

