చెదిరిన రంగుల కల!  చేరింది జైలుకి ఇలా!!
x
సౌమ్య శెట్టి (File Photo)

చెదిరిన రంగుల కల! చేరింది జైలుకి ఇలా!!

చెలే కదా స్నేహ హస్తం చాస్తే ఇంటికే కన్నమేసిందో వర్థమానతార. మన విలాసాలకు ఇతరుల సొత్తు కాజేస్తే ఏమవుతుందో తెలుసుగా.. ఈమెకు అదే జరిగింది..


(తంగేటి నానాజీ విశాఖపట్నం)

కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? విలాసమే జీవితమైతే ఎలా ఉంటుందీ? ఇదిగా ఇలా ఉంటుంది. కష్టపడి పేరు తెచ్చుకోమ్మా అని తల్లిదండ్రులు దీవించి పంపిస్తే ఇంటికి కన్నాలేసి పేరు తెచ్చుకుందీ తల్లీ. ఈమే పేరు సౌమ్య శెట్టి. ఊరు విశాఖపట్నం.సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలగాలనుకుని ఎవరికీ ముఖం పరిస్థితిలోకి వెళ్లారు. చిన్నచిన్న రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి... నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చోటు సంపాదించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. అంతలోనే ఓ దొంగతనం కేసులో పట్టుబడి.. సినిమాల్లో క్లాప్ కొట్టించుకోవలసిన ఆమె జైల్లో కటకటాల పాలయ్యారు. అసలు ఏం జరిగింది..


విశాఖ శివారు గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సౌమ్య శెట్టి... రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసేవారు. ఈ క్రమంలో 2016లో మౌనిక అనే బిటెక్ స్టూడెంట్ పరిచయం అయ్యారు. వీరిద్దరూ కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అనంతరకాలంలో మౌనికకు పెళ్లిఅవడంతో వీరి స్నేహం విడిపోయింది. మౌనిక కు పాప పుట్టిన తర్వాత భర్త ఉద్యోగరీత్యా సౌదీ వెళ్లారు. అప్పటినుంచి మౌనిక దొండపర్తి లో తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. ఈమధ్య తనకు పాప పుట్టింది అంటూ ఇంస్టాగ్రామ్ లో మౌనిక ఫోటో పోస్ట్ చేసింది... ఈ పోస్ట్ చూసిన పాత స్నేహితురాలు సౌమ్య కామెంట్ పెట్టారు. దీంతో పాత స్నేహితురాలిద్దరూ కొత్తగా కలిశారు. ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని మాట్లాడుకున్నారు. మాటల్లో భాగంగా మౌనిక దొండపర్తి బాలాజీ రెసిడెన్సిలో గల తన పుట్టింట్లో ఉంటున్నట్టు చెప్పారు. దీంతో సౌమ్య మౌనిక ఇంటికి తరచూ రాకపోకలు సాగించింది. సౌమ్య తాను ఇటీవల "ది ట్రిప్"... "యువర్స్ లవింగ్లీ" చిత్రాల్లో నటిస్తున్నట్టు కూడా మౌనికకు చెప్పింది.

మౌనిక కుటుంబ సభ్యులు షాక్...

మౌనిక తండ్రి ప్రసాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్లేందుకు బీరువాలోని నగలు కోసం వెతికితే నగలు మాయం అయ్యాయి. 74 తులాల బంగారు ఆభరణాలు ఇటీవలే బ్యాంకు నుంచి విడిపించి ఇంటికి తీసుకు వచ్చాం"... అంటూ మౌనిక తండ్రి లబోదిబోమన్నారు. దీంతో రంగంలోకి దిగిన విశాఖ నాలుగో పట్టణ నేర విభాగ పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. "సౌమ్యను అనుమానించినప్పటికీ ఆమె వివరాలు తెలియలేదు. సీసీ కెమెరా ఆధారంగా సౌమ్య వాడిన కారు నెంబరు ఆధారంగా అడ్రస్ కనిపెట్టి విచారిస్తే అసలు విషయం బయటపడింది. 57 తులాల బంగారం రికవరీ అయింది" అని విశాఖ నగర క్రైమ్ ఏ డి సి పి గంగాధరం ది ఫెడరల్ కు చెప్పారు.

పోలీసుల దర్యాప్తులో సామ్య గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితురాలు మౌనిక ఇంట్లో విడతలు విడతలుగా బంగారు ఆభరణాలు దొంగతనం చేసి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సాలు చేసిందని, గోవాలో పార్టీలకు హాజరైందని, అంతేకాకుండా తన క్రెడిట్ కార్డు అప్పులు, కారు ఈఎంఐలు కట్టుకుందని పోలీసులు చెబుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన సౌమ్య తన జీవితాన్ని నాశనం చేసుకున్నారంటున్నారు.

Read More
Next Story