జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలకృష్ణకు అంత కోపం ఎందుకు?
x
బాలకృష్ణ నివాళులు అర్పిస్తున్న చిత్రం

జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలకృష్ణకు అంత కోపం ఎందుకు?

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. అసలేం జరిగింది.. బాలయ్య ఎందుకంత మాటన్నారు?


జూనియర్‌ ఎన్టీఆర్‌పై నందమూరి బాలకృష్ణకు ఏమాత్రం కోపం తగ్గినట్టు లేదు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో జరిగిన సంఘటన వీరిద్దరి మధ్య గొడవలు సమసిపోలేదన్న విషయాన్ని బలపరుస్తోంది.


బాలకృష్ణ అంతమాటన్నారా?

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను 'తీసేయాలంటూ' తన అభిమానులతో అనడం తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు బాలకృష్ణ వచ్చారు. ఆయన అనుచరులు అక్కడున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను చూపించారు. వీటిని చూసిన వెంటనే ఒకింత అసహనానికి గురైన బాలకృష్ణ.. తన సహజ రీతిలో 'తీయించేయ్‌' అన్నారు. అనుచరులు తీసేశారు. ఈ విషయాన్నే కొడాలి నాని వంటి వైసీపీ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. వేయి మంది బాలకృష్ణలు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానాలు చేశారు.

ఈనాటి గొడవ కాదా?

ఎన్టీఆర్‌ కుటుంబానికి ముఖ్యంగా బాలకృష్ణకు, చంద్రబాబుకు కుటుంబానికి, ఎన్టీఆర్‌ కుటుంబంలో భాగమైన జూనియర్‌ ఎన్టీఆర్‌కూ దాదాపు 15 ఏళ్ల కిందట వివాదం మొదలైంది. అది రానురాను ముదిరింది. అప్పుడప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. హరికృష్ణ కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను 2009కి ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరదీశారు. తమ బంధువుల కుటుంబానికి చెందిన ప్రణతిని జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇలా ప్రచారం చేసి.. హైదరాబాద్‌కు తిరిగి వస్తూ ఖమ్మం వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాతి కాలంలో, ఇరు కుటుంబాల మధ్య రాజకీయ కోణం జోడవ్వడంతోనే అంతరం మొదలైంది. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో అప్పుడు రెండు కుటుంబాల మధ్య అగాధం మరింత ముదిరింది.

లోకేశ్ వర్సెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌...

చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణకు అల్లుడు అయిన లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీకి భవిష్యత్‌ నాయకుడిగా ప్రొజెక్ట్‌ చేసే క్రమం ఈ అంతరానికి ఆజ్యం పోసినట్లయింది. విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్‌ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందన అటు చంద్రబాబుకు గానీ ఇటు బాలకృష్ణకు గాని నచ్చలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కూడా ఒక్క జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్ప మిగతా నందమూరి కుటుంబమంతా బాబుకు అండగా నిలిచింది.

చంద్రబాబును అరెస్ట్‌ చేసినా స్పందించని లోకేశ్‌...

ఇవన్నీ ఒక ఎత్తయితే... చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి, 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉంచిన సందర్భంలో... జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుకు సంఘీభావం లభించలేదు. జూనియర్ తీరు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం మింగుడుపడలేదు. బహిరంగంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌ను విమర్శించారు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు కుటుంబంపై రాజకీయంగా నిప్పులు చెరుగుతున్న కొందరు వైసీపీ పార్టీ నాయకులతో... జూనియర్‌ ఎన్టీఆర్‌కు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందన్న అభిప్రాయం బలపడడం కూడా ఇరు కుటుంబాల మధ్య గ్యాప్‌ను బాగా పెంచింది.

ఆస్తుల గొడవలైతే కాదు...

గత 15 ఏళ్లుగా జరుగుతున్న పలు పరిణామాలే... తాజాగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్లెక్సీలను తొలగించడానికి దారితీసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగించడంతో ఇప్పుడు చోటుచేసుకున్న పరిణామం... మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. దివంగత ఎన్టీఆర్‌ కుటుంబంలో హరికృష్ణ మరో కుమారుడైన కళ్యాణ్‌రామ్‌ ఒక్కరితోనే జూనియర్‌ ఎన్టీఆర్‌కి సంబంధాలు ఉన్నాయి.

Read More
Next Story