
శర్వానంద్ ‘బైకర్’ రివ్యూ
బిగ్ స్క్రీన్ థ్రిల్స్.. స్లో పేస్ డ్రామా
కథ 2003 నేపథ్యంలోనే మొదలవుతుంది. సునీల్ నారాయణ్ (రాజశేఖర్) ఒక లెజెండరీ ఓల్డ్-స్కూల్ బైకర్. అప్పట్లో ఇంటర్నెట్ లేని రోజుల్లోనే తన బైక్‌తో ఇండియాను గ్లోబల్ మ్యాప్‌లో పెట్టిన తోపు. అయితే భారత్ లో ఈ ఆటకు సరైన ప్రోత్సాహం, ప్రాధాన్యం లేకపోవడం వల్ల నెక్ట్స్ లెవిల్ కు వెళ్లలేకపోతాడు. అందుకే దేశంలో మోటోక్రాస్ రేసింగ్ కు గుర్తింపు తీసుకు రావాలని తపిస్తుంటాడు. ఈ క్రమంలోనే మోటోక్రాస్ రేసర్లని తీర్చిదిద్దే పనిలో ఉంటాడు.
ఇక అతని కొడుకు వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) పుట్టుకతోనే రేసర్. విక్కీకి బైక్ అంటే ఇష్టం, కానీ తండ్రికి అది ఒక 'మిషన్'. దాంతో తను సాధించలేని దాన్ని తన కొడుకులో చూసుకోవాలనుకుంటాడు. తన భార్యను కోల్పోయిన తర్వాత, తన సర్వస్వాన్ని కొడుకు కోసం ధారపోస్తాడు.
విక్కీలో అద్భుతమైన బైక్ రేసింగ్ టాలెంట్ ఉందని గుర్తించిన సునీల్, అతన్ని ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలని కలలు కంటాడు. ఈ క్రమంలో ఆ తండ్రి తన కొడుకును ఒక 'మెషీన్'లా మార్చేస్తాడు. సోషల్ లైఫ్ లేదు. కేవలం ట్రాక్ మాత్రమే ప్రపంచం గా చూడాలంటాడు.
విక్కీకి తండ్రి అంటే గౌరవం ఉన్నా, నిరంతరం ఆయన పెట్టే ఒత్తిడి వల్ల వారి మధ్య ఒక తెలియని మానసిక దూరం పెరుగుతుంది. విక్కీ ఇండియా లెవల్ పోటీల్లో విన్నర్‌గా నిలిచి, ఇంటర్నేషనల్ రేసులకు సిద్ధమవుతున్న తరుణంలో అతనికి అనన్య (మాళవిక నాయర్) పరిచయమవుతుంది. ఆమె ఒక ఫ్రీ-స్పిరిటెడ్ పర్శన్. విక్కీలో ఉన్న ఒత్తిడిని గమనించి, అతనికి 'లైఫ్' అంటే ఏంటో చూపిస్తుంది.
విక్కీ ఆమెతో ప్రేమలో పడతాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్పాన్సర్లను సెట్ చేసి, కొడుకును గ్లోబల్ రేసర్ చేయాలని సునీల్ తపిస్తుంటే.. విక్కీ మాత్రం తన తండ్రి కఠినమైన రూల్స్ నుండి బయటపడి, తన ప్రేమికురాలికే ప్రాధాన్యత ఇస్తాడు.
ఇది తెలియని సునీల్ మాత్రం విక్కీని ఒక ఇంటర్నేషనల్ స్పాన్సర్‌షిప్ డీల్‌లో లాక్ చేస్తాడు. అయితే ఓ విషయంలో విభేధించి...ఒక కీలకమైన ఇంటర్నేషనల్ రేస్ ముందు, ఒక చిన్న నోట్ రాసి పెట్టి తండ్రిని, రేసింగ్‌ను వదిలేసి వెళ్లిపోతాడు. అనన్యను పెళ్లి చేసుకుంటాడు.
కొన్నేళ్ల తర్వాత.. విక్కీ ఇప్పుడు ఒక కార్టింగ్ జోన్ నడుపుతూ , తన కొడుకు ఇషాన్ తో,భార్యతో కలిసి సింపుల్ లైఫ్ గడుపుతుంటాడు. కానీ లోపల ఆ 'స్పీడ్' తాలూకు ఆకలి అలాగే ఉంటుంది. కొడుకుతో తనకున్న బంధాన్ని గమనించినప్పుడు అతనికి ఒక విషయం అర్దం అవుతుంది. తన తండ్రి అప్పట్లో చేసింది తన స్వార్థం కోసం కాదు, ఆ రేసింగ్ స్పాన్సర్‌షిప్ వస్తేనే తన కొడుకుకు 'లైఫ్' సెట్ అవుతుందనే ఒక తండ్రి తాపత్రయంతో అని విక్కీకి అర్థమవుతుంది.
తండ్రి మనస్సు ఏంటో అర్దం అయ్యాక, తన తండ్రికి తాను చేసిన అన్యాయం గుర్తుకు వచ్చి మళ్లీ కలవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏమైంది. విక్కీ తన తండ్రిని కలిసాడా. అసలు తండ్రి,కొడుకు ల మధ్య వచ్చిన విభేధాలు ఏమిటి... తిరిగి బైక్ రేసర్ గా తన జీవితం మొదలెట్టాడా...చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగు సినిమాకు ఈ స్పోర్ట్స్ జోనర్ కథలు కొత్తవని చెప్పలేం కానీ ఎప్పుడో కానీ టచ్ చేసేవి అయితే కాదు. ఎందుకంటే ఈ తరహా స్క్రిప్టు ఓ రకంగా ప్రయోగం లాంటివి. ఎక్కువగా ఓ ఫార్మెట్ లో , రొటీన్ గానే సాగుతాయి. దాంతో ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. దాన్ని దాటటం చాలా కష్టమైన పని. ఈ సినిమాలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. పూర్తి స్పోర్ట్స్ వైపు వెళ్తే డ్రామా దెబ్బతింటుందని, తండ్రి ,కొడుకుల ఎమోషన్ తో లాక్ చేసి గెలిచే ప్రయత్నం చేసాడు డైరక్టర్.
గతంలో ఇదే దర్శకుడు 'లూజర్' (వెబ్ సిరీస్), 'మా నాన్న సూపర్ హీరో' చేసారు. ఆ మునుపటి వర్క్స్‌లోని అంశాలను కలిపి, పూర్తిగా భిన్నమైన నేపథ్యం తీసుకుని ఈ కథను రూపొందించే ప్రయత్నం చేసారు. అంటే ఇక్కడ మనకు 'లూజర్' సిరీస్ లాంటి స్పోర్ట్స్ జానర్, దర్శకుడి గత చిత్రం 'మా నాన్న సూపర్ హీరో' తరహాలో తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కనిపిస్తాయి. ఇక్కడ అన్ని అంశాలు బాగానే కలిశాయి కానీ, అవి పూర్తిగా ఫార్ములా పద్ధతిలో సాగడం వల్ల ఒక రకంగా సినిమాకు మైనస్ అయ్యిందనే చెప్పాలి. దానికి తోడు హీరో బైక్ రేసింగ్ మానేయడం వెనుక ఉన్న కారణం అంత గొప్పగా లేకపోవటం ఇబ్బంది పెడుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒక స్పోర్ట్స్ కథలో ఉండాల్సిన ఉత్సాహభరిత క్షణాలు లేకపోవడం పెద్ద ఇబ్బంది. ‘జెర్సీ’.. ‘ఎఫ్-1’ చిత్రాల్లో మాదిరి ఎమోషనల్ గా హై ఇచ్చే మూమెంట్స్ లేవు.
ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పాలంటే కథలో ఉత్కంఠ ఉంది, కానీ దానికి తగిన తీవ్రత లేదు. భావోద్వేగం ఉంది, కానీ అది హృదయానికి గట్టిగా తాకదు. ఎమోషన్ ని, స్పోర్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఓ రకంగా సర్కస్ చేసింది స్క్రిప్టు. ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే బాగానే ఉన్నా, మొత్తం కథలో అవి ఎక్కడా పీక్స్ తీసుకెళ్లేంత ఉత్సాహాన్ని ఇవ్వవు. హీరోయిన్ వైపు నుంచి కథ ను పెద్దగా మాట్లాడుకునేలా ఏమీ లేదు.
టెక్నికల్ గా...
విజువల్స్ పరంగా తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ మూవీ అనే చెప్పాలి. కెమెరా వర్క్ అదిరిపోయింది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే సాగింది. పాటలు సోసోగా ఉన్నాయి. జాగోరే పాట జస్ట్ ఓకే అనిపిస్తుంది. యువి క్రియేషన్స్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని ప్రెజెంట్ చేసింది. కథ పరంగా వైవిధ్యం చూపకపోయినా, సినిమా మేకింగ్ పరంగా చాలా చోట్ల మెరుపులు చూపించాడు దర్శకుడు. రేసుల నేపథ్యంలో సినిమాలో వచ్చే ఎపిసోడ్లనూ చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా క్లైమాక్స్ రేస్ ఎపిసోడ్ సినిమాకు అతి పెద్ద ఎట్రాక్షన్.
ఎవరెలా చేసారు
శర్వానంద్ బైకర్ పాత్రకు ప్రాణం పెట్టి చేసాడు. నిజ జీవితంలోనూ బైకర్ అయ్యింటాడు అనిపిస్తుంది. తండ్రిగా రాజశేఖర్ సిన్సియర్ గా అవుట్ ఫుట్ ఇచ్చారు. హీరోయన్ గా మాళవిక నాయర్ అలా నడిచిపోయింది. ఇక అన్వర్ పాత్రలో చేసిన ఆర్టిస్ట్ బాగా చేసారు. బ్రహ్మాజీ.. తులసి వంటివారు తమకు అలవాటైన నటనను మరోసారి చేసారు.
ఫైనల్ థాట్
స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిస్. డైరక్టర్, అతని టీమ్ నిజాయితీ పడ్డ శ్రమను గుర్తించటానికి అయినా ఈ సినిమా చూడచ్చు.

