వివాదాస్పద ‘మహారాజ్’తో ఆమీర్ ఖాన్ కొడుకు ‘నెట్ ఫ్లిక్స్’ డెబ్యూ
x

వివాదాస్పద ‘మహారాజ్’తో ఆమీర్ ఖాన్ కొడుకు ‘నెట్ ఫ్లిక్స్’ డెబ్యూ

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ వివాదాలకు దూరంగా ఉంటుంటాడు. అయితే ఎంత తప్పుకున్నా కొన్ని సార్లు వివాదం ఆయన చుట్టూనే తిరుగుతూంటుంది.


సాధారణంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ వివాదాలకు దూరంగా ఉంటుంటాడు. అయితే ఎంత తప్పుకున్నా కొన్ని సార్లు వివాదం ఆయన చుట్టూనే తిరుగుతూంటుంది. ముఖ్యంగా భారత్ వదిలిపెట్టి పోదామా అంటూ తన భార్య కిరణ్ అడిగిందని అమీర్ ఖాన్ అసహనంపై మాట్లాడుతూ అన్నప్పటి నుంచి వివాదాలు ఆయన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన తన కుమారుడు డెబ్యూ మూవీ ద్వారా మరో వివాదాన్ని ఆహ్వానిస్తున్నట్లే అనిపిస్తోందని బాలీవుడ్ మీడియా అంటోంది.

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేశాడు. ఎప్పుడో కోవిడ్ టైమ్ లో మొదలైన ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కు వచ్చింది. ఆ సినిమా టైటిల్ మహరాజ్. ఈ పీరియడ్ డ్రామాకు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీని నిర్మించింది. ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

జునైద్ ఖాన్ నటించిన ఈ మహారాజ్ మూవీ రిలీజ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా, వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నెట్ ప్లిక్స్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ... "ఓ శక్తివంతమైన వ్యక్తి, ఓ భయం లేని జర్నలిస్ట్ మధ్య నిజం కోసం జరిగె పోరాటం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మహరాజ్ జూన్ 14న రిలీజ్ కాబోతోంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా కథ గురించి కూడా చెప్పుకొచ్చింది.

ఇంతకీ మహారాజ్ మూవీ స్టోరీ లైన్

మహారాజ్ మూవీ ఓ పీరియడ్ డ్రామా . 19వ శతాబ్దంలో జరిగిన కథ. మేకర్స్ చెప్పిన సారాంశం ప్రకారం.. "1862లో భారత్ లో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే ఉన్న సమయం.. అప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏడాది వయసు మాత్రమే.. 1857 సిపాయిల తిరుగుబాటు మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటంలో ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చొన్నాడు. ఆ నిజమైన స్టోరీ ఇప్పుడు 160 ఏళ్ల తర్వాత మహరాజ్ రూపంలో వెలుగులోకి వస్తోంది" అని మూవీ గురించి మేకర్స్ చెప్పారు.

ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే... కర్సన్‌దాస్ మూల్జీ. ఆయనో జర్నలిస్ట్, సంఘ సంస్కర్త. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ లో విద్యార్థి. అణగారిన వర్గాల తరఫున తన గళం వినిపించిన వ్యక్తి. చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటాల్లో ఒకటిగా భావించే 1862లోని మహరాజ్ లైబెల్ కేస్ ద్వారా ఈ కర్సన్‌దాస్ పేరుగాంచారు.

కర్సందాస్ అనే అప్పటి కాలం జర్నలిస్ట్ వితంతు పునర్వివాహం కోసం వాదిస్తూ ఆర్టికల్స్ రాస్తూంటాడు. ఈ ఆర్టికల్స్ తో సామాజికంగా, కుటుంబపరంగా అతనికి ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా అధైర్య పడకుండా తన రచనా వ్యాసంగంతో తను అభిప్రాయాలను రాయటం కొనసాగించాడు. ఈ క్రమంలోనే 1855లో కొంతమంది తనలాంటి ఆలోచనలు ఉన్న ధనిక స్నేహితుల సాయింతో స్వంత పత్రిక అయిన సత్యప్రకాష్‌ను ప్రారంభించాడు.

అక్కడ నుంచి కాలం చెల్లిన సంప్రదాయాలు డైరక్ట్ ఎటాక్ చేసేవారు. స్వయంగా వైష్ణవుడు అయిన కర్సందాస్ వైష్ణవ పూజారుల అకృత్యాలను, మహిళా భక్తులపై వారి దోపిడీతో సహా బహిర్గతం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అప్పటి ప్రముఖ వైష్ణవ పూజారి జీవన్‌లాల్జీ మహారాజ్‌ కుచెందిన కొన్ని అనైతిక విషయాలను తన పత్రికలో ప్రస్తావించాడు. దాంతో ఆయన అనుచరులను కోల్పోవడం ప్రారంభమైంది. జీవన్‌లాల్ మహారాజ్ బొంబాయి నుండి పారిపోయాడు. అయినా కర్శందాస్ వదలలేదు.

వితంతు పునర్వివాహాన్ని గ్రంధాలు అనుమతిస్తున్నాయా లేదా అనే దానిపై బహిరంగ చర్చకు జదునాథ్ మహారాజ్‌ను సవాలు చేయడంతో పరిస్థితి మారిపోయింది. మహారాజ్ తెలివిగా చర్చను గ్రంధాల యొక్క దైవిక మూలాన్ని ప్రశ్నించడానికి చర్చను మార్చారు, చర్చను పరిష్కరించలేదు. 21 సెప్టెంబర్ 1961 నాటి సత్యప్రకాష్‌లో రాసిన వ్యాసం, వైష్ణవ పూజాలు మహిళా భక్తులతో లైంగిక సంబంధాలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ, అత్యంత తీవ్రమైన దెబ్బ కొట్టింది.

దాంతో మహారాజ్.. కర్సందాస్ మరియు పేపర్ ప్రచురణకర్త నానాభాయ్ రాణినాపై రూ. 50,000 విలువ చేసే దావా వేశారు. తన భాటియా శిష్యులలో ఎవరైనా కోర్టులో సాక్ష్యం చెబితే తనకు ఇబ్బంది కలుగుతుందనే భయంతో, మహారాజ్ బొంబాయిలోని భాటియా సమాజం మొత్తాన్ని సమావేశపరిచి, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారిని బహిష్కరించాలని ఆదేశించాడు. ఈ సమావేశం గురించి తెలుసుకున్న కర్సందాస్ భాటియా కుట్ర కేసులో తొమ్మిది మంది భాటియా నాయకులపై కుట్ర పన్నారని ఆరోపించారు - ఇది పరువునష్టం కేసు . ఆ తర్వాత ఆ కేసు ఏమైందనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది.

ఇక ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో రాకముందే వివాదాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ సినిమా హిందువులకు వ్యతిరేకం అని పిలుపు ఇస్తోంది. కావాలనే అమీర్ ఖాన్ ఇలాంటి హిందూ వ్యతిరేక సినిమా తీసారని అంటోంది. చరిత్రను వక్రీకరించే సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయని ఇలాంటి సినిమాకు పెట్టుబడి పెట్టి స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ప్లిక్స్ ని బహిష్కరించాలి అంటున్నారు. ‘Boycott Netflix.’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

గతంలో ఆమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రంలో హిందూ దేవతలు, మతగురువులను అవహేళన చేశారంటూ గుర్తు చేస్తున్నారు. అప్పట్లో దేశంలో సినిమా ఆడుతున్న పలు ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్‌లు చేతబట్టి 'పీకే' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టించారు. భజరంగ్‌దళ్‌, రాష్ట్రీయ హిందూ ఆందోళన్‌ తదితర హిందూమత సంస్థలు 'పీకే' చిత్ర ప్రదర్శనలను నిషేధించాలంటూ డిమాండ్‌ చేసారు. మళ్లీ అలాంటి పరిస్దితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ సిట్యువేషన్ ఏ స్దాయికి వెళ్తుంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. అమీర్ ఖాన్ కావాలని వివాదం కొని తెచ్చికొన్నట్లు అవుతోంది కొందరు అంటూంటే , కావాలనే వివాదాస్పద చిత్రంతో తన కుమారుడు లాంచింగ్ పెట్టడం ఓ స్ట్రాటజీ అని , అందరి దృష్టిలో పడటానికి ఇంతకు మించిన మార్గం లేదంటున్నారు.

Read More
Next Story