మై డియర్ దొంగ (ఆహా) మూవీ రివ్యూ
x

'మై డియర్ దొంగ' (ఆహా) మూవీ రివ్యూ

నవ్వటం అంటే జనాలకు ఎప్పుడూ ఇష్టమే. ఇదొక కొత్త ఐడియా.


నవ్వటం అంటే జనాలకు ఎప్పుడూ ఇష్టమే. అందుకే కామెడీ సినిమాలు, వెబ్ సీరిస్ లుకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇక్కడ కండీషన్ ఏమిటంటే ఖచ్చితంగా ఆ కామెడీ సినిమాలు నిజంగానే నవ్వించాలి. అయితే నవ్వించటం ..నవ్వటం అంత ఈజి అయితే కాదు. కామెడీ సినిమాలకు స్ట్రాంగ్ ప్రిమేజ్, పూర్తిగా డవలప్ చేసిన పాత్రలు,ఫన్నీ వన్ లైనర్స్ అత్యవసరం. ముఖ్యంగా హ్యూమర్ సిట్యువేషన్స్,సిట్యువేషన్ కామెడీ ఉన్న సినిమాలు,గాగ్స్ ఉంటే ఆ సినిమాలు బాగా పండుతాయి. నిలబడతాయి. అవేమీ పెట్టుకోకుండా ఓ కమిడయన్ ని పెట్టుకుంటే..జనాలు చచ్చినట్లు వాళ్లే నవ్వుతారనుకుంటే ఎలా ...

కాబట్టి కమిడియన్ హీరోగా ఉన్న సినిమాలు కూడా నవ్వించేస్తాయని చెప్పలేం. అందుకు తాజా ఉదాహరణ 'మై డియర్ దొంగ'. ఈ దొంగ మన నవ్వులను ,ఓపికను దొంగలిస్తాడని ట్యాగ్ లైన్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. ఓటిటిలో ఉంది కదా ..డబ్బులు ఖర్చు పెట్టి మరీ థియేటర్ కు వెళ్లి చూడక్కర్లేదు అని ఈ సినిమాని టచ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంది..ఆ కథేంటో చూద్దాం.

సురేష్ (అభినవ్ గోమఠం) ఓ గమ్మత్తైన మంచి దొంగ. కేవలం తనకు గ్రాసరీ సరుకులు కోసమే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యునిటీస్ లో దొంగతనాలు చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు సుజాత (షాలినీ కొండేపూడి) అనే ఆమె ప్లాట్ కు దొంగతనానికి వచ్చి ఆమెకు దొరికిపోతాడు. ఇంతకీ సుజాత ఎవరు అంటే..ఆమె ఓ డేటింగ్ యాప్ లో కాపీ రైటర్. ఆమెకు ఆల్రెడీ ఓ లవర్ విశాల్ (నిఖిల్) ఉంటాడు. ఇంక సుజాత తండ్రి ఓ భాద్యతలు తీసుకోని వ్యక్తి. ఇంట్లో సామాను అమ్మేసి తాగుతూంటాడు. దాంతో నిరాశలో ఉన్న ఆమె తన లవర్ విశాల్ తన కష్ట,సుఖాలు,ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని ఆశిస్తుంది. అయితే అతను అవకాసం ఇవ్వడు. ఆమె ఆలోచనలను, జీవితాన్ని పెద్దగా పట్టించుకోడు. దాంతో సుజాత ఓ రకమైన ఆవేదనతో ఉంటుంది.

అలాంటి పరిస్దితుల్లోనే మన హీరో దొంగ గారు ఆ ప్లాట్ కు దొంగతనానికి రావటం జరుగుతుంది. తన బాధల ముందు ఇదెంత అనుకుందేమో మన హీరో దొంగతనాన్ని సుజాత పెద్ద సీరియస్ గా తీసుకోదు. అతనితో కబుర్లు పెడుతుంది. తన మనస్సు విప్పి మాట్లాడటానికి ఓ మనిషి దొరికాడు హ్యాపీ ఫీలవుతుంది. ఇద్దరూ కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూంటే... ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆ మాటల్లో ఆ దొంగ కూడా తనలాగే ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి అతనిపై సాఫ్ట్ కార్నర్ పెంచుకుంటుంది. ఇలా దొంగతో ఎపిసోడ్ నడుస్తూండగా ఆమె లవర్ విశాల్, రూమ్ మేట్ బుజ్జీ (దివ్య శ్రీపాద) అక్కడకి వస్తారు.

అప్పుడు ఆ దొంగని ఎలా పరిచయం చేయాలా అని ఆలోచించి.. తన చైల్డ్ హుడ్ ప్రెండ్ కార్తీక్ అని అబద్దం చెప్తుంది. అతనో మెకానికల్ ఇంజనీర్ అని చెప్తుంది. వాళ్లు పాపం నమ్మేస్తారు. అలా కొద్ది దూరం నడిచాక..విశాల్ షార్ప్ మైండ్ కు అతను దొంగ అనే విషయం తెలిసిపోతుంది. అలాగే తను ప్రేమిస్తున్న అమ్మాయితో చనువుగా ఉండటం కూడా తట్టుకోలేకపోతాడు. దాంతో పోలీస్ లకు పట్టిద్దామనుకుంటాడు. అప్పుడు ఏమైంది... చివరకు సుజాత ఏం నిర్ణయం తీసుకుందనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నిజానికి అభినవ్ గోమఠం ఉన్నాడని ఈ సినిమా మొదలెడతాం. కానీ ఆ తర్వాత అర్దమవుతుంది.. ఈ సినిమా నుంచి కామెడీ ఆశిస్తే అది మన అత్యాసే అని. ఓ ఫీల్ గుడ్ స్టోరీ చెప్దామని డైరక్టర్ మొదలెట్టి..అటు నుంచి ఎటో వెళ్లిపోతుంది. అలాగే సినిమాని బడ్జెట్ తక్కువలో తీయాలని ప్రయత్నం క్వాలిటీ ని చంపేసింది. ఈ సినిమాలో సుజాత పాత్రను పోషించిన శాలిని కొండేపూడి స్వంతంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. ప్రేమికులు ఒకరి కోసం ఒకరు తమ ఆలోచనలు .. అలవాట్లు .. అభిరుచులు మార్చుకోవడం కాదు, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి స్వేఛ్ఛ ఇవ్వడం అని చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది. ఆమే రాసుకోవటం వలనో ఏమో కానీ ఆ కథ ఆమె చుట్టూనే తిరిగింది. అభినవ్ గోమఠం కు ప్రయారిటీ ఇవ్వలేదు.

టెక్నికల్ గా ... అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మనోజ్ ఫొటోగ్రఫీ , సాయిమురళి ఎడిటింగ్ అన్ని జస్ట్ ఓకే అనిపిస్తాయి. స్క్రిప్టు బలంలేకపోవటం వలన మిగతావన్నీ తేలిపోయాయి. నటీనటుల్లో గోమఠానికి వంకపెట్టడానికి ఏమీ లేదు..మిగతావాళ్లలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఛల్తాహై

చూడచ్చా

అభినవ్ గోమఠం కామెడీ కోసం అయితే ఈ సినిమా చూడక్కర్లేదు. ఏదో సినిమా..కాలక్షేపం కోసం లైటర్ వీన్ లా నడిచినా ఫరవాలేదనుకుంటే ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ ఉంది

ఆహా ఓటీటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story