నటుడు ఆర్ నారాయణమూర్తికి అస్వస్థత
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకి గురయ్యారు.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకి గురయ్యారు. ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అయితే ఆయన అనారోగ్యానికి కారణమేంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆయనకి ఏమైందో అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా: ఆర్ నారాయణ మూర్తి
తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులను ఉద్దేశించి ఆర్.నారాయణమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను. నేను కోలుకున్న తర్వాత నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శ...
ఆర్. నారాయణ మూర్తి గారి ఆరోగ్య పరిస్థితి పై నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని మంత్రికి వెల్లడించారు. వైద్య పరమైన టెస్టులను చేస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే ప్రజానటుడికి మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ డైరెక్టర్ ను కోరారు.
నటుడు... దర్శకుడు... నిర్మాత...
నారాయణమూర్తి నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, నారాయణమూర్తి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. అమ్మ రెడ్డి చిట్టెమ్మ, నాన్న రెడ్డి చిన్నయ్య నాయడు. వీరిది అతి సాధారణ రైతు కుటుంబం. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్, నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని నారాయణమూర్తి చెబుతూ ఉంటారు.
హీరో అవ్వాలనే ఆసక్తితో సినిమా ప్రయత్నాల్లో భాగంగా మొదట్లో సహాయక పాత్రల్లో నటించారు. దాసరి నారాయణరావు పరిచయం ఆయన కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. దాసరి ఈయనకి రమేష్ బాబు హీరోగా తీస్తున్న నీడ చిత్రంలోప్రాధాన్యత ఉన్న వేషాన్నిచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నారు. ఆ తరువాత దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశారు.
నారాయణమూర్తి దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తీసిన అర్ధరాత్రి స్వతంత్రం సినిమా విజయవంతమై చరిత్ర సృష్టించింది. ఆయన తీసిన అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగుచుక్కలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన విప్లవాత్మక సినిమాలు తీసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండేవారు.