అదా శర్మ బస్తర్ మూవీ రివ్యూ!
x

అదా శర్మ 'బస్తర్' మూవీ రివ్యూ!

‘ది కేరళ స్టోరీ’ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి చేసిన ప్రయత్నం ‘బస్తర్ - ది నక్సల్ స్టోరీ’


కొన్ని కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తాయి. అలాంటిదే ‘ది కేరళ స్టోరీ’ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి చేసిన ప్రయత్నం ‘బస్తర్ - ది నక్సల్ స్టోరీ’. అయితే ఈ టీమ్ అనగానే ఇది ఓ ప్రచార సినిమా అని జనం అనుకుంటారేమో అనే డౌట్ వచ్చినట్లుంది. అలాంటిదేమీ కాదని ముందే ప్రకటించారు. కానీ అలా ప్రకటిస్తేనే అసలు సమస్య. ఏమి లేనిదే ఎందుకు ఇలా చెప్పుకుంటారనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. అలా ఈ సినిమా ఎన్నికల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంతో తీసిన ప్రచార చిత్రమనే అని మనకు చూసాక కన్ఫర్మ్ గా అర్థమవుతుంది. సర్లే ఇంతకీ ఈ చిత్రంలో విషయం ఏమిటి...మామూలు జనం చూసేదేనా అనేది పరిశీలిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా గత కొంతకాలంగా ఓటిటిలో అందుబాటులో ఉంటోంది మరి.

కథేంటంటే...

కోర్టులో ఓ కేసుతో సినిమా మొదలవుతుంది. ఇద్దరు లాయర్లు హోరా హోరిగా వాదిస్తూంటారు. ఐపీఎస్ నీరజా భార్గవ (ఆదా శర్మ) అమాయక గిరిజనుల్ని ఎన్ కౌంటర్ చేసి చంపిందని ఆరోపణ. కాసేపటికి ఈ కోర్టు సీన్ ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ గ్రామంలో ఓపెన్ అవుతుంది. 2010లో కథ జరుగుతుంది. అక్కడ నక్సలైట్స్‌దే రాజ్యం. ఎవరైనా ఎదురుతిరిగితే నక్సలైట్ల నాయకుడు కామ్రేడ్ లంకారెడ్డి (విజయ్ కృష్ణ) వాళ్ల అంతు చూస్తూంటాడు. అలాగే ప్రతీ ఇంటి నుంచి ఒక్కరైనా నక్సలైట్స్‌లో కలవాలనే రూల్‌ని అమలు చేస్తూంటాడు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదపై కొందరి నాయకులు కన్ను ఉంటుంది. వారు నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూంటారు.

పోలీస్ కదలికలను వారికి చేరవేస్తూంటారు. ఆ ప్రాంతాన్ని పొరపాటున కూడా డవలప్ కానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూంటారు. ఈ క్రమంలో నీరజా భార్గవ అనే పోలీస్ అధికారి ..నక్సలైట్స్‌ని ఏరిపారేయాలనుకుంటుంది. కానీ ఆమె అక్కడి గిరజనులను నక్సలైట్స్ పేరుతో ఎనకౌంటర్స్ చేసిందని కోర్టులో కేసు వేస్తారు. ఆమెకు సపోర్ట్‌గా స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ (సుబ్రతా దత్తా) ఉంటారు. ఈ విషయం తెలిసిన నక్సలైట్స్ అతన్ని ద్రోహిగా ప్రకటించి, నరికి చంపేస్తారు.

కళ్ళముందే భర్త దారుణ హత్యకి గురికావడంతో చలించిన రత్న, ఈ హంతకుల్నివదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమెకి తగిన ధైర్యం నూరిపోసి తన స్క్వాడ్‌లో పోలీసుద్యోగం ఇప్పిస్తుంది నీరజ. మరో ప్రక్క లంకారెడ్డి జీవితాశయం ఒకటే- ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయడం. అందుకోసం ఓ సారి జవాన్ల శిబిరంపై దాడి చేసి 76 మందిని పొట్టన పెట్టుకుంటాడు. అప్పుడు నీరజ ఎలా స్పందించింది.. చివరకు ఏమైంది..అనేది మిగతా కథ.

ఎలా ఉంది

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం సుక్మాలో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటన ఆధారంగా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం తెరకెక్కించారు. అయితే ఎంతసేపూ నక్సలైట్స్, వాళ్లకు సహకరించేవాళ్లు విలన్స్, వాళ్లు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. మధ్యలో గిరిజనులు నలిగిపోతున్నారనే విషయం చూపెట్టాలనే తాపత్రయం డైరక్టర్‌లో కనపడింది. అయితే అసలు నక్సలిజం ఎందుకు డెవలప్ అయ్యింది. ఈ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, మాంగనీస్ వంటి సహజ వనరులను ఎవరు ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని అడ్డుకోవటానికి నక్సలైట్స్ ఏం చేస్తున్నారు అనే విషయం దాచి పెట్టి కథ నడిపారు. దాంతో కథ ఏక పక్షంగా నడుస్తున్నట్లు అర్థమవుతుంది.

దర్శక, నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారో, ఏ విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నారో అనేది మాత్రమే చూస్తాం. లోతుగా మన మనస్సుని అటు వైపు వెళ్లనివ్వకుండా ప్రయత్నం చేశారు. ఎంతసేపూ నక్సలైట్లను దేశ వ్యతిరేకులుగా, అభివృద్ధికి ఆటంకాలుగా చూపించటమే సరిపోయింది. అలాగే కొందరు ప్రొఫెసర్లు, కార్యకర్తలు.. యూనివర్సటీ విద్యార్థులు, స్టూడెంట్స్‌కు నక్సలిజనాన్ని నూరిపోసినట్టు సీన్లు కూడా ఉన్నాయి. అయితే వారికేం కలిసి వస్తుందనేది మాత్రం చెప్పలేకపోయారు. దాంతో ఇది ప్రచారం చిత్రమే అని అర్థమవుతుంది.

ఎవరెలా చేశారు

అదా శర్మ సినిమా ఎలా ఉన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగిలిన వారంతా పాత్ర పరిధిలో మెప్పించారు. టెక్నికల్ గా మంచి స్ట్రాండర్డ్స్ ఉన్నాయి. రగుల్ ధర్మన్ కెమెరా వర్క్ బాగుంది. అడవిలో సీన్స్ బాగా చిత్రీకరించారు. భిషక్ జ్యోతి బ్యాగ్రౌండ్ స్కోర్ .., దేవ్ రావ్ జాదవ్ ఎడిటింగ్ ఓకే.

చూడచ్చా

సినిమాలో విపరీతమైన హింస ఉంది. తలలు నరకడం.. మెడలు కోయడం, పసి పిల్లలను మంటల్లోకి విసిరేయటం వంటివి టైట్ క్లోజప్‌లో చూపించారు. ఇక పసిపిల్లలను మంటల్లోకి విసిరేయడం వంటివి చూడటం కాస్త ఇబ్బందే. మరో విషయం మనం రిలేట్ అవటానికి నక్సలిజం సమస్య మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో అంతరించింది.

ఎక్కడ చూడచ్చు

జీ 5 లో తెలుగులో ఉంది.

Read More
Next Story