దేశమంతా ‘భారతీయుడు 2' హాట్ టాపిక్, ఎందుకు?
సుజాత లేకపోవటమే డైరక్టర్ శంకర్ ఫెయిల్యూర్స్ కు కారణమా? ఎవరీ సుజాత
శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 భారీ ఎక్సపెక్టేషన్స్ తో ఈ శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడు (ఇండియన్)కి సీక్వెల్ కథ. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కింది. అయితే ఈ సినిమా కు తమిళ,తెలుగు, హిందీలలో ఎక్కడా పాజిటివ్ రివ్యూ అనేది రాలేదు. మౌత్ టాక్ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు ఇది శంకర్ తీసిన సినిమాయేనా..ఇంత అవకతవక కథతో తెరకెక్కించటమేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో శంకర్ కు సుజాత లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ విషయం శంకర్ కూడా ఒప్పుకున్నాడు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో ఈ చిత్రం మొదటి భాగాన్ని రచయిత సుజాత రాసారని అయితే దురదృష్టవశాత్తు 2008లో ఆయన మరణించడంతో సీక్వెల్ లో మిస్సయ్యారని వెల్లడించాడు.
వాస్తవానికి రచయిత సుజాత రంగరాజన్ మరణించిన నాటి నుంచి శంకర్ సరైన హిట్ ఒకటి కొట్టలేదు. 2012 లో శంకర్ దగ్గర విజయ్ డేట్స్ ఉన్నాయి. కథ లేదు. అప్పటిదాకా రీమేక్స్ జోలికి వెళ్ళని ఆయన హిందీ 'త్రీ ఇడియెట్స్' ని 'స్నేహితుడు' గా రీమేక్ చేశాడు . ఇది ఫ్లాపయ్యింది. ఆ తర్వాత విక్రమ్ తో ప్రతిష్టాత్మకంగా 'ఐ' తీశాడు. ఆ ప్రయత్నం కూడా డిజాస్టర్‌గా మారింది. డైరక్ట్ సినిమాలతో పని అవ్వటం లేదని శంకర్ సీక్వెల్స్ పై పడ్డాడు. 2018 లో రజనీకాంత్ 'రోబో' కి సీక్వెల్‌గా '2.0' తీశాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా కమర్షియల్ గా అనుకున్న స్దాయిలో పే చెయ్యలేకపోయింది. ఇక 2019 లో కమల్ హాసన్‌తో కలిసి 'భారతీయుడు' సీక్వెల్ 'ఇండియన్ 2' ప్రారంభించాడు. ఇది అనేక సమస్యలతో, వివాదాలతో ఎట్టకేలకు పూర్తి అయ్యి రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కూడా కష్టమే అని తేల్చేస్తున్నారు. అయితే శంకర్ టెక్నికల్ గా, భారీగా సినిమాని ప్రెజెంట్ చేయగలడు. కానీ కథ దగ్గరే ఆయన విఫలమవుతున్నారనేది నిజం. అందుకు ఆయన రైట్ హ్యాండ్ లాంటి సుజాత లేకపోవటమే అంటున్నారు.
ఎవరీ సుజాత రంగరాజన్?
సుజాత రంగరాజన్ ..IIT మద్రాస్ నుంచి వచ్చిన ఓ ఎలక్ట్రానిక్ ఇంజినీర్. ఆయన BEL లో రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ వింగ్ కు జనరల్ మేనేజర్ గా చేసారు. అలాగే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. EVM మీద అనుమానాలు అందరూ వ్యక్తం చేసినప్పుడు చాలా కష్టపడి ఆ మెషిన్స్ ఎంత కరెక్ట్ గా ఎఫిషిన్సిగా పనిచేస్తాయో చూపించి ఒప్పించారు.
ఇదంతా ఒకెత్తు అయితే ఆయన హాబీ పుస్తకాలు రాయటం. తమిళ ప్రముఖ రచయితలలో ఒకరు ఆయన . ఆయన సరళమైన శైలి చాలా మందిని ఆకట్టుకుని అభిమానులు ఉన్నారు. కొత్త జానర్స్, ఐడియాలతో తమిల సాహిత్యంలో ఆయన చాలా ప్రయోగాలు చేసారు. ఆయన మొదటి కథ 1953లో శివాజి మ్యాగజైన్ లో పబ్లిష్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన దాదాపు 80 నవలలు, 150 చిన్న కథలు, 10 సైన్స్ పుస్తకాలు, 10 నాటకాలు, అనేక కవితలు, లెక్కలేనన్ని ఆర్టికల్స్ రాసారు. తమిళంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత తానే అయ్యాడు.
సినిమాల్లో వస్తే ... 1993 లో 'జంటిల్ మన్' నుంచీ రచయిత సుజాతా రంగరాజనే శంకర్ సినిమాలకి రైటింగ్ సైడ్ మొత్తం చూసుకునేవారు. శంకర్ సక్సెస్ లలో మేజర్ షేర్ ఆయనదే. జంటిల్ మన్ నుంచీ రోబో వరకూ రచయిత సుజాతతో కలిసి పెద్ద హిట్స్ కొట్టారు. సుజాత క్రియేటివ్ ఇన్ పుట్సే శంకర్ సినిమాలకి బలం అని అందరికీ తెలుసు. రజనీకాంత్ నటించిన 'గాయత్రి', 'ప్రియ` వంటి సినిమాలు సుజాత నవలల బేస్ చేసుకునే వచ్చాయి. అలాగే అప్పట్లో కమల్ హాసన్ చేసిన సూపర్‌కాప్ థ్రిల్లర్ 'విక్రమ్' కథ సుజాతదే. అలాగే సుజాత ఆ తర్వాత మణి రత్నంతో 'రోజా`, 'దొంగా దొంగా' 'అమృత' సినిమాలకి పనిచేసారు. ఆయన స్క్రిప్టుకు పనిచేస్తే మాగ్జిమం హిట్టే అన్న పేరు ఉంది.
అలా శంకర్ తో సుజాతకు సింక్ అయ్యినట్లు ఆ తర్వాత ఎంతమంది రైటర్స్ వచ్చినా సెట్ కాలేదనే చెప్పాలి. శంకర్ మొదటి నుంచి స్క్రిప్టుకు ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు. ఆయనే మార్కెట్ లో మొదట స్టోరీ డవలప్మెంట్ విభాగం అంటూ ఎనౌన్స్ చేసారు. ఆయన తన టీమ్ రచయిలతో డిస్కస్ చేసి కథలు డవలప్ చేస్తూంటారు. శంకర్ టీమ్ లో బాలాజీ శక్తివేలు, శింబు దేవన్, వసంత బాలన్ వంటి ఉద్దండులైన రచయితలు ఉన్నారు. వాళ్లని తనే దర్శకులుగా పరచయం చేస్తూ సినిమాలు కూడా చేసారు. అయితే సుజాత ఉండగా...ఆ కథలో ఏ లోపాలు ఉన్నాయి. ఏ ఎలిమెంట్స్ ఇంకా అవసరమవుతాయి. బిగినా్, మిడిల్,ఎండ్ వంటి విషయాలు స్క్రిప్టు కన్సల్టెంట్ గా చూసేవారు. అలాంటి క్రియేటివ్ ఇన్ ఫుట్స్ లేకపోవటం శంకర్ సినిమాలకు మైనస్ గా మారింది. సుజాత రంగరాజన్ 2008లో మరణించారు.
గేమ్ ఛేంజర్
ఇక శంకర్ నెక్ట్స్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఈ సినిమాకు కథ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారు. కోవిడ్ టైమ్ లో ఈ కథను చెప్పి శంకర్ తో ఒప్పించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా బాగా పే చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సుజాత లేని లోటు ఈ సినిమాలో కనపడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం.