కష్టాలలో కన్నడ సినిమా -ఆశలన్నీ ‘కాంతార-చాప్టర్ 1’ పైనే!
x

కష్టాలలో కన్నడ సినిమా -ఆశలన్నీ ‘కాంతార-చాప్టర్ 1’ పైనే!

వివాదాల్లో ఉన్నా ,కాంతార-చాప్టర్ 1 క్రేజ్ తగ్గలేదు!



శాండల్ వుడ్ గా పిలువబడే కర్ణాటక సినీ పరిశ్రమని తరచూ గాంధీ నగర్ టైటానిక్ గా వర్ణిస్తూ ఉంటారు.ఆ పోలిక అతిశయోక్తి మాత్రం కాదు. ఆ బెంగుళూరు ప్రాంతంలో కిక్కిరిసినట్టు ఉండే స్టూడియోలు,థియేటర్లు,ప్రొడక్షన్ ఆఫీసుల వల్ల ఆ పోలిక సరైనదే అనిపిస్తుంది. 2024 లో మొత్తం 227 కన్నడ సినిమాలు విడుదలైతే,అందులో ఎనిమిది మాత్రమే బాక్సాఫీసు కలక్షన్లు వసూలు చేసాయి. అంటే మొత్తం మీద చూస్తే, కేవలం మూడు శాతం సినిమాలే సక్సెస్ అయ్యాయి,దీని వల్ల మిగిలిన నిర్మాతలకు 520 కోట్ల నష్టం వచ్చిందని అంచనా. 2025 మొదటి త్రైమాసికంలో, కొత్తగా 170 సినిమాలు విడుదలైతే,దానికి తగ్గ లాభాలు మాత్రం రాలేదు.

ఈ కష్టాల్లో ఒక భరోసాగా నిలిచింది మాత్రం ‘సూ ఫ్రం సో’ సినిమా. దీనికి రాజ్ బి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు, ఈ సినిమాని తన లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బేనర్ కింద నిర్మించారు. ఇది కేవలం కన్నడ హిట్ సినిమాగా మాత్రమే కాకుండా,2025 లోనే ఎవరూ ఊహించని అతి పెద్ద విజయంగా నిలిచింది. కానీ సినిమా చూస్తే మాత్రం ,ప్రేక్షకులను అంతగా కట్టిపడేసేలా ఈ సినిమాలో ఏముంది అర్థం కానీ విషయమే.

సినిమా సక్సెస్ ఫార్ములాను కనుక్కోవడం అంత తేలికైన విషయమేమి కాదు. ‘సూ ఫ్రం సో’ సినిమా వంద కోట్ల మార్కును దాటి ;ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లు వసూలు చేసిందని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ శుక్రవారం అంటే ఈ సెప్టెంబర్ 19 న దాదాపు పది కొత్త సినిమాలు థియేటర్ లో విడుదలవుతున్నాయి. ఇప్పుడు అక్కడి నిర్మాతలు,దర్శకులు ఈ సినిమాల్లో ఏదైనా అలాంటి అద్భుతం చేస్తుందేమో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

కాంతార :చాప్టర్ 1 మీదే ఆశలు :

ఒక పక్క కన్నడ సినిమాల సక్సెస్ రేట్ పడిపోతూ ఉన్నా,వందల సంఖ్యలో నటులు,నిర్మాతలు,టెక్నిషియన్లు కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. దీనికి కారణం ఎప్పుడో ఒకసారి తమ కొత్త ఐడియాలకి,ఆలోచనలకి ఒక గుర్తింపు వస్తుందన్న ఆశే. ఇప్పుడు వరుసగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాల మీదే ఇండస్ట్రీ దృష్టి అంతా ఉంది. రిషబ్ శెట్టి ‘కాంతార :చాప్టర్ 1’, యష్ ‘టాగ్జిక్’, దర్శన్ ‘డెవిల్ -ద హిరో’,సుదీప్ 'బిల్లా రంగా బాద్ షా', గణేష్ -రాం అరవింద్ ల ‘యువర్స్ సిన్సియర్లీ రాం’, ప్రేమ ధృవ్ సార్జా ‘కెడి’, అర్జున్ జన్యా ‘45’, విజయ్ కుమార్ ‘రచ్చయ్య’, ధనంజయ ‘జింగో’,ఉపేంద్ర ‘బుద్ధివంత-2’, దినకర్ తోగుదీపా ‘రాయల్’ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నా ,’కాంతార:చాప్టర్ 1’ మీదే భారీ అంచనాలు ఉన్నాయి. 2022 లో వచ్చిన కాంతార ఘన విజయమే దానికి కారణం.

కర్నాటక తీర ప్రాంత సంప్రదాయాలైన భూత కోల,కంబాల లాంటి వాటిని చాలా సహజంగా చిత్రీకరించడం వల్ల ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఒక ఆకర్షనీయమైన జానపద కథతో ,మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, సంస్కృతిని ,ప్రకృతిని సంరక్షించుకోవాలన్న అంశాల వల్ల ఈ సినిమా మొత్తం భారతదేశాన్ని మరి ముఖ్యగా పడమర భారతాన్ని ఒక ఊపు ఊపేసి, బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. సెప్టెంబర్ 30,2022 లో విడుదలైన ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచి రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డే ఇప్పుడు దీనికి ప్రిక్వెల్ తీయడానికి కారణమైంది.

కాంతారలో ఉన్న ఇంకో ముఖ్యమైన విషయం అక్కడి తెగల వారి పట్ల ఉండే కుల వివక్షను చూపించడం. రిషబ్ శెట్టి సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొన్ని సాంప్రదాయాలను ఎక్కువ గ్లామరైజ్ చేయడం వల్ల, సామాజిక సమస్యలు తెలిపోయాయని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఈ క్రమంలోనే ఈ సినిమాని సంస్కృతి-సామాజిక సమస్యల మేళవింపుగా వచ్చిన ‘జల్లికట్టు’, ‘కర్ణన్’ వంటి సినిమాలతో పోల్చేలా చేసింది.





ఈ చిత్రం “వరాహ రూపం” పాటపై కూడా వివాదానికి గురైంది. కేరళకు చెందిన ‘థైక్కుడం బ్రిడ్జ్ ‘అనే సంగీత బృందం, తమ “నవరసం” గీతాన్ని కాపీ చేశారని ఆరోపించింది. దీని తరువాత న్యాయపరమైన పోరాటం మొదలైంది. కోర్టు ఆంక్షలు, పలు నిషేధాజ్ఞలు, ప్రతివాద పిటిషన్లు ; చివరికి వివాదం పరిష్కారమైంది. ఈ కేసు భారతీయ సంగీత హక్కుల చట్టం, విభిన్న రాష్ట్రాల న్యాయ పరిధి సమస్యల క్లిష్టతను వెలుగులోకి తెచ్చింది.ఇదిలా ఉండగా, కాంతార: చాప్టర్ 1 ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటోంది. సంస్కృతి, వారసత్వం, మతం పేరిట విషపూరిత భావజాలం, జాతీయవాద అంశాలను సాధారణంగా చూపించిందనే ఆరోపణలు వచ్చాయి. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్నకొద్దీ ఈ చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

‘ కాంతార’ ఆదివాసీ సాంప్రదాయానికి న్యాయం చేసిందా?

‘కాంతార’ మరో వివాదాన్ని రేకెత్తించింది. ఈ సినిమా ఆదివాసీ సంప్రదాయాలను ప్రధాన హిందూ మతంతో కలిపి చూపి, హిందుత్వ అజెండాను ముందుకు తీసుకువెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై నటుడు–ఆందోళనకారుడు చేతన్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన బజరంగ్ దళ్ నాయకుడు శివకుమార్ ఫిర్యాదు చేయడంతో, బెంగళూరు పోలీసులు చేతన్‌పై ఐపిసి కింద కేసు నమోదు చేశారు.చేతన్ తన వైఖరిని స్పష్టంగా చెబుతూ, “భూతకోలా హిందూ సంప్రదాయంలో భాగం కాదు, అది ఆదివాసీ ప్రజల సంప్రదాయం. తర్వాత భారతదేశానికి వచ్చిన ఆర్యులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు” అని అన్నారు.

అయితే, దర్శకుడు రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో ప్రతివాదిస్తూ, “భూతకోలా హిందూ సంస్కృతి, ఆచారాలలో భాగం. నేను హిందువు. నా మతం, ఆచారాలపై ఎవరూ ప్రశ్నించలేరు. మేము చూపింది హిందూ ధర్మంలోనే ఉంది” అని పేర్కొన్నారు.దీనికి ప్రతిగా చేతన్ ఈ రచయితతో మాట్లాడుతూ, “మా పంబడ/నాలికే/పరవా సంప్రదాయాలు వేద–బ్రాహ్మణిక హిందూ మతానికి ముందే ఉన్న బహుజన సంప్రదాయాలు. మేము కోరేది ఏమిటంటే, మూలనివాసి (ఆదివాసీ) సంస్కృతులను తెరమీదా, బయటా నిజాయితీగా చూపించాలి” అని స్పష్టం చేశారు.

ఈ చిత్రాన్ని రాజకీయ వామ పక్షాలు స్వాగతించాయి. ఈ సినిమా దేశవ్యాప్త విజయానికి కారణం పాన్-ఇండియన్ హిందూ గుర్తింపు , స్థానిక ఆధ్యాత్మికతల ప్రతిబింబమేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ విశేషాలున్నప్పటికీ, దేశమంతటా హిందూ ప్రేక్షకులు ఆ భావాలతో అనుసంధానమయ్యారని ఆ వర్గం వాదిస్తోంది. అయితే విమర్శకులు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘భూతకోలా ప్రదర్శన’ను సంస్కృత శ్లోకం “వరాహ రూపం”కి అనుసంధానం చేయడం సమస్యాత్మకమని వాదించారు. విష్ణువు మూడవ అవతారాన్ని సూచించే ఈ గీతాన్ని వాడటం ద్వారా ఆదివాసీ ఆచారాలను హిందుత్వ ఏకరీకరణ శక్తులు స్వాధీనం చేసుకున్నట్లైందని వారి వాదన.కొంతమంది విశ్లేషకులు మరింత ముందుకెళ్లి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను హిందుత్వ ప్రధాన వర్గాలు తమలో కలుపుకోవడమే కాంతార మొదటి భాగం అసాధారణ విజయానికి అసలు కారణమని తేల్చేసారు.

బ్రిటిష్ పాలన అనంతర తీరసంస్కృతికి ప్రతిబింబం:

‘కాంతార’ 54వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోని ఇండియన్ పాన రమా విభాగంలో ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో దర్శకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు దక్కగా, ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా గౌరవించబడింది.

బెంగళూరులో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రిషబ్‌ను కలసి, ఆయన నటన, దర్శకత్వాన్ని ప్రశంసించారు. రిషబ్ ఆ భేటీ ఫొటోను తరువాత సోషల్ మీడియాలో పంచుకుని, ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పది ప్రతిష్ఠాత్మక కన్నడ చిత్రాల్లో కాంతార: చాప్టర్ 1 ప్రత్యేక హైప్ సృష్టించింది. పోస్టర్లు, అరుదైన అప్‌డేట్లు మాత్రమే విడుదల చేస్తూ, చిత్ర బృందం ఉద్దేశపూర్వకంగా కథ, వివరాలను గోప్యంగా ఉంచుతోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రిక్వెల్‌ను దాదాపు ₹125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ఇది దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.మొదటి భాగం సాధించిన అద్భుత విజయానంతరం, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. బడ్జెట్ మొదటి చిత్రంతో పోలిస్తే సుమారు 681 శాతం పెరిగిందని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా లేదు.

కాంతార: చాప్టర్ 1 భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది. ఈ ప్రిక్వెల్‌ బహుభాషల్లో థియేట్రికల్ రిలీజ్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే హక్కులను సొంతం చేసుకుంది. సినిమా కన్నడతో పాటు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీషులో స్ట్రీమింగ్ కానుంది.

నిర్మాణ బృందం తెలిపిన వివరాల ప్రకారం, కథ ‘భూత కొల’ ఆచారం మూలాలు, భూమి సంరక్షకుల పురాణాలు చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం బనవాసి కడంబ వంశం నేపథ్యంలో సాగనుంది.

నటీనటుల్లో రిషబ్ శెట్టి నాగ సన్యాసి పాత్రలో కనిపించనున్నారు. జయరాం, రాకేష్ పూజారి, రుక్మిణి వసంత్ (కనకవతి పాత్రలో), గుల్షన్ దేవయ్య (కులశేఖర పాత్రలో) కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం బి. అజనీష్ లోకనాథ్ అందించగా, సినిమాటోగ్రఫీ అర్వింద్ ఎస్. కాశ్యప్‌ది. కథను రిషబ్ శెట్టి సహా నలుగురు రచించారు. విజువల్ ఎఫెక్ట్స్, వేషాల రూపకల్పనకు ప్రత్యేక బృందాలు పనిచేశాయి.

మొదటి లుక్ పోస్టర్, టీజర్ 2023 నవంబర్ 23న విడుదలయ్యాయి. హొంబాలే ఫిల్మ్స్ సహవ్యవస్థాపకుడు చలువే గౌడ మాట్లాడుతూ, “కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కన్నడ సినిమాలను జాతీయ వేదికపై నిలబెట్టాయి. కొత్త ప్రాజెక్టులు కూడా అదే దిశలో ముందుకు సాగుతున్నాయి” అన్నారు.నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, “13 ఏళ్ల హొంబాలే ప్రొడక్షన్ హౌస్ బహుభాషా సినిమాలను నిర్మిస్తోంది. రాజకుమార, కేజీఎఫ్ సిరీస్, కాంతార, సలార్ వంటి విజయవంతమైన సినిమాలు మా ఖాతాలో ఉన్నాయి. విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే మా లక్ష్యం” అని ఫెడరల్ తో అన్నారు.

బహుభాషల్లో ‘కాంతార’ ప్రిక్వెల్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ చిత్రాన్ని ఉత్తర భారతం, నేపాల్ ప్రాంతాల్లో ఏఏ ఫిల్మ్స్ విడుదల చేయనున్నట్లు తాజా పరిణామాలు ధృవీకరించాయి. దీని వలన హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని థియేటర్లలో చూడొచ్చు.

నిర్మాణ బృందం తెలిపిన వివరాల ప్రకారం, కాంతార : చాప్టర్ 1 భూత కొల ఆచారం మూలాలను, మనుషులు–ప్రకృతి–దైవ సంరక్షకుల అనుబంధం ఎలా ఏర్పడిందనే అంశాన్ని ఆవిష్కరించనుంది. ఇదే 2022లో విడుదలైన చిత్రానికి పునాదిగా నిలుస్తుందని చెబుతున్నారు.

కర్ణాటక చలనచిత్ర పాత్రికర్తర పరిషత్‌లో జరిగిన చర్చలో దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ: “కాంతార :చాప్టర్ 1 అనేది సీక్వెల్ కాదు, అది ప్రిక్వెల్. మీరు చూసింది నిజానికి రెండో భాగం. మొదటి భాగం త్వరలో రానుంది. ఈ ఆలోచన నాకు కాంతార షూటింగ్ జరుగుతుండగానే వచ్చింది, ఎందుకంటే కథకు చరిత్రలో మరింత లోతు ఉంది” అని వివరించారు.కథనం పవిత్ర భూములపై జరిగిన సంఘర్షణలను, అడవితో, దేవతలతో, పూర్వీకుల ఆత్మలతో మనుషుల సంబంధం ఎలా మారిందో చూపనుంది. పురాణం, యాక్షన్ మిళితం చేస్తూ విశ్వాసం, ప్రకృతి, ప్రాంతీయ జానపదం వంటి అంశాల చుట్టూ ఉంటుంది. ప్రత్యేకంగా దైవాలు, భూత కొల ఆచారాల చుట్టూ కథ కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రిక్వెల్ ఒక మూలగాథ (ఆరిజిన్ స్టోరీ)గా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక సంరక్షకులు ఎలా అవతరించారు, భూమి, గుర్తింపుపై జరిగిన ప్రాచీన పోరాటాలు సమాజాన్ని ఎలా మలిచాయనే విషయాలను ప్రతిబింబించనుంది.

భారీ ఇండోర్ సెట్‌పై చిత్రీకరణ – రికార్డు స్థాయి శ్రమ

కాంతార: చాప్టర్ 1 చిత్రీకరణ 2023 నవంబర్‌లో కర్ణాటకలోని కుందాపుర తీరప్రాంతంలో ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక భారీ ఇండోర్ సెట్ నిర్మించారు. 2024 జూన్‌లో మీడియాతో మాట్లాడిన దర్శకుడు–నటుడు రిషబ్ శెట్టి, “తీర కర్ణాటక చరిత్ర, సంస్కృతిపై లోతైన పరిశోధన చేసిన తర్వాత స్క్రిప్ట్ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. పాత్రకు సరిపడేలా ఒక దశలో 10 కిలోలు పెరిగాను, తర్వాత 8 కిలోలు తగ్గించాను” అని చెప్పారు.

సుమారు 250 రోజులపాటు సాగిన కఠినమైన షెడ్యూల్ అనంతరం చిత్రీకరణ పూర్తయింది. రిషబ్ శెట్టి ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కలరిపయట్టు, కత్తి యుద్ధం వంటి శిక్షణలు పొందారు.

సినిమా ఎక్కువ భాగం తీర కర్ణాటక అడవులలో చిత్రీకరించబడింది. దాదాపు 80 శాతం సన్నివేశాలు అడవులలోనే తెరకెక్కించారు. కఠిన భూభాగం, తరచూ ఆలస్యాలు, ప్రమాదాలు బృందాన్ని ఇబ్బంది పెట్టాయి. బుష్ క్రాష్, అగ్ని ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, పడవ మునిగిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పటికీ పెద్ద నష్టాలు జరగలేదు.

చిత్రంలోని ప్రధాన ఆకర్షణ – జాతీయ, అంతర్జాతీయ నిపుణులు రూపొందించిన ఒక భారీ యుద్ధ సన్నివేశం. ఇందులో 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులు, మొత్తం 3,000 మంది నటీనటులు పాల్గొన్నారు. కర్ణాటక పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేసిన 25 ఎకరాల సెట్లో 50 రోజులులలో ఈ సన్నివేశాన్ని పూర్తిచేశారు.

దక్షిణ భారతంలో అత్యంత ఎదురుచూసే విడుదలల్లో కాంతార: చాప్టర్ 1 ఒకటి. ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో రిషబ్ శెట్టి ఎలాంటి రాజీపడడం లేదు. సినిమా నిర్మాణానికి సంబంధించి (బీహైండ్-ది-సీన్స్) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురాణ ఆధారిత కథనం, ప్రబలమైన నటన, వైవిధ్యమైన సంగీతం ; ఇవన్నీ ఎంతో గ్రాండ్ విజువల్స్ తో ఉన్నాయి. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ ప్రిక్వెల్, ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా నిలుస్తుందని, భారతీయ సినిమాటిక్ కథనాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

* * *



Read More
Next Story