![టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్ టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/512066-whatsapp-image-2025-02-11-at-45316-pm.webp)
టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్
నోరు జారటం...ఆ తర్వాత క్షమాపణ చెప్పడం
తెలుగు పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైందని పిస్తోంది. స్టేజీపై ఉత్సాహంగా మాట్లాడుతూ..మధ్యలో నోరు జారటం..ఆ తర్వాత అది ట్రోలింగ్ అవుతూంటే బాధపడుతూ...కొద్ది రోజులకు నాలుక కరుచుకుని ..క్షమాపణ చెప్పడం. ఇది ఇప్పుడు అల్లు అరవింద్ నుంచి విశ్వక్సేన్ దాకా కనిపిస్తుంది. అంతకు ముందు చాలా ఇలాంటివి జరిగిన రీసెంట్ గా జరిగిన రెండు ఈవెంట్స్ లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీటి వలన ఆ ఈవెంట్స్ కు, సినిమాలకు జనాల్లో క్రేజ్ రావచ్చు ఏమో కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.
అరవింద్ సైతం
మొదటిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)విషయానికి వస్తే...ఆయన మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి అల్లు అరవింద్ ఓ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. "ఈ మధ్య దిల్ రాజు చరిత్ర సృష్టించాడు.. అంటే ఒక సినిమా (గేమ్ ఛేంజర్)ని ఇలా కిందకి దించి.. మరో సినిమాని (సంక్రాంతికి వస్తున్నాం) ఎక్కడికో తీసుకెళ్లి.. మళ్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ని ఆహ్వానించి ఇలా రకరకాలు చేశాడు ఒక వారంలో" అంటూ అరవింద్ అన్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయి ట్రోలింగ్ కూడా చేశారు. తాజాగా ఈ కామెంట్‌పై వివరణ ఇచ్చారు అరవింద్. మెగా ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పారు.
రామ్ చరణ్ ని అనలేదు
రామ్‌చరణ్ (Ram Charan)ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో నేను రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారు. కానీ నేను దిల్ రాజుగారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను అని చెప్పుకొచ్చారు.
అరవింద్ మాట్లాడుతూ.... దిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ ట్యాక్సులు అన్నీ అనుభవించారన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీలైపోయి నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. తను నాకు కొడుకు లాంటోడు. నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ అనలేదు. మీ మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరారు.
విశ్వక్సేన్ వంతు...
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్. 'ఫలక్ నామా దాస్', 'ఈ నగరానికి ఏమైంది', 'పాగల్' వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే సాధారణంగా ఈ యంగ్ హీరో సినిమా విడుదల ముందు ఏదో ఒక వివాదం, ఆ సినిమా గురించి ఏదో ఒక హాట్ టాపిక్ జరుగుతూండటం జరుగుతూ వస్తోంది. కొన్నిసార్లు ప్రీ రిలీజ్ వేడుకలో కాస్త వివాదాస్పదంగా మాట్లాడటం, అది వైరల్ కావడం ఏదో ఒక రకంగా విష్వక్ సినిమా విడుదల ముందు వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇవన్నీ విష్వక్‌సేన్ పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్స్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగి,విశ్వక్ క్షమాపణ చెప్పారు.
తాజాగా విష్వక్‌సేన్ నటించిన 'లైలా' చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల జరిగింది. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో 'లైలా' చిత్ర నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన వివాదాస్పద కామెంట్స్ వైసీపీ రాజకీయ నాయకులను బాధపెట్టింది. ఇక వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో 'బాయ్‌కాట్ లైలా' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు మొదలుపెట్టారు. ఇతర సోషల్ మీడియాలో కూడా పృథ్వీపై కామెంట్స్ మొదలయ్యాయి.
అబ్బబ్బే ఫృథ్వీరాజ్ మాటలతో మాకు సంబందం లేదు
అయితే అది వివాదం స్థాయి దాటి డ్యామేజ్ స్థాయికి వెళ్లింది. ఇది గమనించిన విశ్వక్సేన్ సీన్ లోకి వచ్చారు. జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి హీరో విష్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి కలిసి ప్రెస్‌మీట్ పెట్టి పృథ్వీరాజ్ కామెంట్స్ పట్ల క్షమాపణలు తెలియజేశారు.
తమకు తెలియకుండానే ఇలా జరిగిందని, దయచేసి ఎంతో కష్టపడి తీసిన సినిమాను బాయ్‌కాట్ చేయడం సమంజసం కాదని, ఒక్కరు చేసిన తప్పుకు సినిమా టీమ్ అందరినీ శిక్షించకూడదని తమ ఆవేదన తెలియజేశారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌కు పృథ్వీరాజ్‌ను కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తే బాగుండేదని వైసీపీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి, ఇంతటితో ఈ 'లైలా బాయ్‌కాట్' వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.
ఏదైమైనా మచ్చుకు ఇవి రెండు మాత్రమే. ఇలాంటివి తెలుగు పరిశ్రమలో ఈ మద్యన తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. మాట అనేసి ఆ తర్వాత క్షమాపణ చెప్పడం వలన ఒరిగేది ఏముంది అంటున్నారు.