నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
x

నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ

ఫన్ ఎక్కువ… కొత్తదనం తక్కువ!

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్దితి రాజు(నవీన్ పోలిశెట్టి)ది. తను జమీందారు మనవడు అయినా తన దాకా ఆస్తి ఏమీ రాకుండా తాతే మొత్తం తగలెట్టేయటంతో నానా పాట్లు పడుతూంటాడు. అయితే అదేమీ బయిటకు తెలియకుండా మేనేజ్ చేస్తూంటాడు. మింగటానికి మెతుకు లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు పైకి గొప్పలు చెప్పుకుంటూ లైఫ్ లాగుతూంటాడు. ఈ క్రమంలో కొన్ని అవమానాలు ఎదురౌతాయి. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో అతని బంధువుల్లో ఒకరు డబ్బున్న అమ్మాయిని చేసుకుని సెటిలయ్యారని తెలుస్తుంది. దాంతో తను కూడా అదే దారిలో వర్కవుట్ చేసి కోటీశ్వరుడు అయ్యిపోదామనుకుంటాడు. అక్కడ నుంచి ప్రయత్నాలు మొదలెడతాడు.

వెతగ్గా వెతగ్గా అతని కంట్లో జమిందారు భూపతిరాజు (రావు రమేష్) కూతురు చారులత (మీనాక్షి) పడుతుంది. చారు లతకు అందంతో పాటు కావాల్సినంత డబ్బు ఉందని తెలుస్తుంది. దాంతో ఎలాగైనా ఆమెను ప్రేమలో పడేసి పెళ్లాడేయాలి అని ఫిక్స్ అవుతాడు . అంతే “ఆపరేషన్ చారులత” మొదలెట్టి రకరకాల ప్లాన్స్ వేస్తాడు. చివరకు సక్సెస్ అయ్యి పెళ్లి దాకా తీసుకు వస్తాడు.

అలా చారులతను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే రాజుకి ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ పడుతుంది. ఆమె కుటుంబం గురించి, ఆస్దులు గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి..., అప్పుడు రాజు ఏం చేసాడు... పెళ్లి చేసుకొని రిచ్ పర్శన్ గా సెటిల్ అయ్యిపోదామనుకున్న రాజు.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

పాత స్టోరీ లైన్స్ కొద్దిపాటి మార్పులు చేర్పులతో మార్చి ,కొత్త పంచ్ లు, సీన్స్ తో మళ్లీ తీయటమే ఇప్పటి ట్రెండ్. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గతంలో ఓ పెద్ద సినిమాలో కామెడీ ట్రాక్ గా వచ్చిందే. హీరో, హీరోయిన్లిద్దరిదీ ఒకేలాంటి నేపథ్యం. ఇద్దరిదీ ఒకే లాంటిసమస్య. ఇద్దరూ నిజాన్ని దాచి, ఒకరిని మరొకరు ఏమార్చి పెళ్లి చేసుకోవటం..ఆ తర్వాత ఇద్దరికీ అసలు విషయం తెలియటం. అక్కడ నుంచి వేరే దారి లేక ఆ సమస్య నుంచి బయిటపడటానికి చేసే ప్రయత్నాలు. గతంలో ఇలాంటివి వచ్చాయి అనే విషయం మర్చిపోతే , లేకపోతే చూడకపోతే ఇది ఖచ్చితంగా కొత్తగానే అనిపిస్తుంది. అలాగే నాని పిల్ల జమీందారు చూడకపోతే ఇంకా బెస్ట్.

అప్పట్లో ఇవివి సత్యనారాయణగారు ఇలాంటి లైటర్ వీన్ కామెడీ సినిమాలు తీసేవారు. వాటినే అనుసరిస్తూ తీసినట్లున్నారు. ఈ సినిమా ప్రారంభం అయ్యిన మొదటి అరగంటలోనే “ఇది ఎక్కడో చూసిన కథే” అన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. పాత్రల సెటప్, జోక్స్ స్టైల్, సిట్యుయేషన్స్ అన్నీ ఎక్కడో ఇంతకు ముందు చూసినట్లు ఉంటాయి.

కథ కొత్తగా అనిపించకపోయినా, డైలాగ్ డెలివరీ, టైమింగ్ వల్ల గ్యాగ్స్ చాలా వరకూ వర్క్ అవుతాయి. ఇక్కడ టోన్ పరంగా “కొంచెం ఫ్రెష్ టచ్” కనిపిస్తుంది. అందుకే కథ, నేపథ్యం, కాన్సెప్ట్—అన్నీ ప్రెడిక్టబుల్ అయినా ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోర్ కాకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ “ఓకే” అనిపిస్తుంది కానీ “వావ్” అనిపించే స్థాయిలో కాదు. ఇక్కడుకి వచ్చేసరికి అర్దమవుతుంది. కథలో నిజమైన డ్రామాటిక్ స్టేక్స్ లేవు అని. సర్లే సెకండాఫ్ ఏదైనా కొత్త దిశలో వెళ్తుందేమో అన్న ఆశతో చూస్తాం.

సెకండాఫ్ మొత్తం కథా పరంగా యు టర్న్ తీసుకుని ఎన్నికల పోటీ, క్యాంపెయిన్ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడే సినిమా స్ట్రెంగ్త్ , వీక్‌నెస్ రెండూ బయటపడుతాయి. నవీన్ పోలిశెట్టి కామెడీ బ్లాక్స్ కొన్ని చోట్ల బాగా వర్క్ అవుతాయి—థియేటర్‌లో నవ్వు తెప్పించాయి. కానీ అదే సమయంలో చాలా సన్నివేశాలు “ఇది ఫార్ములా” అన్న భావనను కలిగిస్తాయి. రీల్స్, సోషల్ మీడియా, క్యాంపెయిన్ ఐడియాస్—అన్నీ కరెంట్ ట్రెండ్‌ల మీద ఆధారపడ్డాయి కానీ వాటిని కొత్తగా, సాటిరికల్‌గా మలిచినట్టు అనిపించదు. అందుకే గ్యాగ్స్ ఒక పాయింట్ తర్వాత రిపీట్ ఫీలింగ్ ఇస్తాయి. ఇక క్లైమాక్స్ తప్పనిసరి ముగింపులా అనిపిస్తుంది. హీరో నవీన్ పాత్ర లో మార్పు ఉన్నా బాగుండేదేమో. ఈ పాత్ర మొదట సరదాగా ఉంటుంది. మధ్యలో కూడా అలాగే ఉంటుంది. చివర్లో కూడా అదే టోన్‌లో ఉంటుంది.

ఎవరెలా చేసారు..

సాధారణంగా స్క్రిప్టు అద్బుతంగా ఉంటే దాన్ని మరింత గొప్పగా చేసి ఒప్పిస్తారు ఆర్టిస్ట్ లు. అయితే స్క్రిప్టే సాధారణం అయ్యినప్పుడు ఆ ఆర్టిస్ట్ లు గొప్ప వాళ్లు అయ్యి ఉండాలి. లేకపోతే ఏ సీన్ పండదు. ఇక్కడ నవీన్ పోలిశెట్టి తన శక్తితో వీక్ గా ఉన్న స్క్రిప్టుని అది కనిపించనీయకుండా చేస్తూ మోస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ఇది ప్యూర్ గా నవీన్ సినిమా. మీనాక్షి చౌదరి చక్కగా నటించింది. రావు రమేష్ ఇలాంటి పాత్రలు గతంలో చాలా చేసారు. చ‌మ్మ‌క్ చంద్ర‌, మ‌హేశ్‌, బుల్లిరాజు (మాస్ట‌ర్ రేవంత్) అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు.సపోర్టింగ్ క్యారెక్టర్లు స్క్రీన్‌పై ఉన్నా, బాగా చేస్తున్నా, కథలో, స్క్రీన్‌ప్లేలో వారికంటూ ప్రత్యేకత ఏమీ లేదు.

టెక్నికల్ గా ..

మిక్కీ జే మేయర్ సంగీతం ఓకే రేంజ్‌లో ఉంది. రెండు పాటలు తెరపై బాగానే కనిపించాయి. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ కూడా నెమ్మదిగా సాగే విలేజ్ ఎట్మాస్మియర్ ని చక్కగా చూపించింది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో కుదిరింది, కానీ సెకండాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది.

ఫైనల్ థాట్

అనగనగా ఒక రాజు ఒకసారి చూసి నవ్వుకునే సరదా సినిమా. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, ఫన్ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. కానీ కథలో కొత్తదనం, బలమైన ఎమోషన్ లేకపోవడంతో ఇది గుర్తుండిపోయే సినిమా మాత్రం కాదు. పండగ టైంలో టైం పాస్ కోసం చూడొచ్చు.

Read More
Next Story