కాపురంలో కల్లోలం ‘ఎనాటమీ అఫ్ ఎ ఫాల్’ మూవీ రివ్యూ
x

కాపురంలో కల్లోలం ‘ఎనాటమీ అఫ్ ఎ ఫాల్’ మూవీ రివ్యూ

కాపురంలో కల్లోలానికి ఎవరు కారణం? ఈ కల్లోలానికి వ్యవస్థలు,సమాజం ఎలా ఆజ్యం పోస్తాయే చూపే వెండితెర విన్యాసం ‘ఎనాటమీ అఫ్ ఎ ఫాల్’ చిత్రం. సి. రామ్ రివ్యూ



సి.రామ్


సామాజిక, వ్యక్తిగత, మానసిక కారణాలు ఏవైనా, భర్తలు భార్యలను చంపడం కాలం నుండి భార్యలు భర్తలను అంతమొందిస్తున్న నేటి వరకు ఎన్నో సంఘటనలు చూసాం, చదివాం, విన్నాం. కష్టమైన, అతి విపరీత పరిస్థితులలో విచక్షణ కోల్పోవడం మనిషి లక్షణం.ఆ ప్రభావాలే ఈ దారుణాలకు దారితీస్తాయిని నా నమ్మకం.

ఈ ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటి అని నన్నడిగితే 'ఇద్దరు కలిసి ఉండడం' అని సమాధానమిస్తాను.అది వ్యక్తిగతమైనా, వ్యాపారమైనా' అని నేను నమ్మే ఓ సూక్తి.

అలాగని ఒంటరిగా ఉండడం దీనికి విరుగుడైతే కాదని కూడా నమ్ముతాను. ఇది ముఖ్యంగా భార్యాభర్తలకు అద్దినట్టు సరిపోతుంది. కష్టాలకు కేంద్రం గుర్తింపు లోపం నుండి భావ అంతరాల వరకు ఏవైనా కావొచ్చు. అందుకే, చిట్టచివరిగా జరిగే ఆ ఆఖరి ఘటన, ఇద్దరి మధ్య పరిష్కారం కాకుండా ఉన్న కొన్ని వందల సందర్భాల కూడిక అని చెప్పదల్చుకొన్నాను. ఆ సారం అంత సుళువుగా అర్ధం కాదు.

ఆ చివరకు జరిగే ఘోరం పేరుకుపోతున్న అప్పు లాంటిది, తీర్చుకోక పోతే ఖర్చై పోతామని నమ్మిస్తుంది, చెయ్యకూడని పని చేయిస్తుంది. ఆ పిదప జీవితాంతం ఆ చర్యకు ఓ తిరుగులేని శిక్ష విధించుకునేలా చేస్తుంది. గృహ హింస,హత్య ,గొడవలకు గెలుపొటములు ఎవరివో తెలియదు కానీ, బాధితులు మాత్రం పిల్లలు. ఉత్సుకత మాత్రం మీడియా, సమాజానిదే.

ఇంతకీ ఎందుకీ ఉపోద్గాతం అని అనుకొంటున్నారా, మీకు 2003లో వచ్చిన ‘ఎనాటమీ’ (Anatomy of a Fall) ఇంగ్లీష్-ఫ్రెంచి సినిమా గూర్చి నేను పొందిన అనుభూతిని నాలో చెలరేగిన ఆలోచనలు ఇలా ఇక్కడ పంచుకొంటున్నాను.






కథలోకెడితే, అప్పటికే కొంచం బెడిసికొట్టిన సంబంధాల మధ్య జీవిస్తున్న ఓ భార్య భర్తల కాపురంలో - ఎవరు లేని సంధర్భంలో ఏమి జరిగిందో తెలియదు-మూడంతస్తుల నుండి జారీ పడి జరిగిన ఓ భర్త మరణం దీనికి కేంద్రం. సందర్భానుసారంగా దొరికిన ఆధారాలు అన్ని భార్యనే ముద్దాయిగా చూపుతాయి.అసలు కన్నా కొసరు ఎక్కువ రుచి అన్నట్టు ఈ సంఘటన మీద కుటుంబం వారి కన్నా, మీడియా, పోలీసు, కోర్టులు చేసే గోల కుటుంబ సభ్యుల గోడుకు ఆజ్యం పోస్తుంది. గజిబిజిని పెంచుతుంది.

అసలే అంతంత మాత్రాన ఉన్న భార్యాభర్తల సంబంధం, తల్లికి కుమారుడికి అంతు పట్టని భావోద్వేగాల మధ్య నలిగిపోవడం ఓ వైపైతే, నానా ఆలోచనలు రేకెత్తిస్తూ చుట్టూ ఉన్న వ్యవస్థలు వారిని విపరీతంగా వేధిస్తాయి. ఈ విసుగే ఈ సినిమాకు మూలం, దీని బలం. దర్శకురాలు జనెట్ ట్రయిట్ (Justine Triet) ప్రతిభకు పట్టం.ఓ సంధర్భంలో లాయరు కూడా అనుమానిస్తున్నాడేమో అనిపించడం, తన పై ఆరోపించిన నేరాన్ని కొడుకుతో జరిగే సంభాషణలు కట్టి పడేస్తాయి. అసలు ఎలా ముగుస్తుంది రా దేవుడా అనిపించే సినిమా ,ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి.

పోలీసులు ఇది ఆత్మహత్యా, సహజ మరణమా,లేక హత్యా అని ఓ పక్క.పరిశోధన పేరుతొ రుజువులు, అనుమానాల, సిద్దాంతాలు అనే వాటి మధ్య సాగుతూ ఓ కొత్త కథకు ,కారణాలకు ముడి వేసే వైనం మనకే విసుగెత్తిస్తాయి అంటే, ఆలోచించాలి ఆ తల్లి కొడుకుల స్థితిని. అంతే కాకూండా ,గతంలో భార్యకు కొన్ని శారీరిక సంబంధాలు ఉండడం,భర్తకు కొన్ని మానసిక ,వృత్తి పరంగా కొన్ని సమస్యలు ఉండడం, వీరిద్దరి పని వలన జరిగిన ఓ సంఘటనలో కొడుక్కి జరిగిన ఓ ప్రమాదంలో పాక్షికంగా చూపు తగ్గడం ఇలా మరిన్ని విషయాలను ఈ కేసు భూతద్దంలో చూడ్డం జరుగుతుంది.

ఇది మానవ సంబంధాల విషయాలకు చెందినది,కావున వీరి ఇద్దరి జీవితాల్లో అనుమానాలు రేకేతించేలా ఉండే పలు సంఘటలను,విషయాలను ప్రస్తావనకు తెచ్చి, వారి వాదోపవాదాలతో ఆ కుటుంబ మానసిక ధైర్యాన్ని కోర్టులు ఎలా ఛిద్రం చేస్తాయి అనేది చాల అద్భుతంగా ఆవిష్కరించారు డైరెక్టర్. ఆ సంఘటనలకు ఏవో అంతులేని ఊహలు, కధనాలు, కథలు అల్లుకొంటూ మరో వైపు మనల్ని నీరుగారుస్తుంటాయి.

అప్పుడెప్పుడో భార్యాభర్తల మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఏరికోరి వెదికి పట్టుకొని, తోటి స్నేహితులు, సైకాలాజిస్ట్, డాక్టర్ల, సహోద్యుగులు, జ్యూరీల వాంగ్మూలాలు ,అభిప్రాయాలూ సేకరించి, స్వీకరించి, పరిశీలించి గానీ ఓ నిర్ణయానికి రాలేకపోతారు. అలాంటి కేసులకు పడే శిక్ష కన్నా, ఈ పరిశీలన పరిశోధన పేరుతొ పడే శిక్ష చాల భయంకరమైనది, భరించలేనివి.

చివరిగా, మీడియా చేసే హంగామా చెప్పనలివి కాదు. ముందు మేమేంటే మేమే తెలుసుకొని చెపుతున్నామని,ప్రజల అభిప్రాయ సేకరణ అని ఇలా ఎన్నో ప్రయత్నాలతో మన ఓపికను పరీక్షిస్తుంది.

ఆ శిక్ష నుండి ఆ కుటుంబం బయట పడడానికి జరిగే శ్రమ బహు క్లిష్టమైనది. ముఖ్యంగా ఈ కథను స్త్రీ చుట్టూ, స్త్రీ పై అనుమానాలతో సాగే అతి సున్నితమైన కథనం. అందుకే ఉత్తమ స్క్రీన్ ప్లే కు ఆస్కార్ అవార్డు వరించింది. భార్య భర్తల అలవాట్లు, కొన్ని ఆడియో, వీడియో రికార్డింగ్లు అత్యుత్సాహం సృష్టించడం, తల్లి కొడుకుల మధ్య గుండెలు పిండేసే కొన్ని సన్నివేశాలు, వ్యవస్థలు తమ పటిమను నిరూపించుకొనేందుకు చేసే ప్రయత్నాలు, పారదర్శకతను నిరూపించుకునేందుకు పెట్టే పరీక్షలు, ఆంక్షలు మనల్ని కలవరపెడుతాయి.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఏందంటే, మనిషికి తన పై తనకు స్వీయ నమ్మకం ఉండటం యెంత అవసరమో తెలియజేస్తుంది. పై చెప్పిన అన్ని విషయాలు ఆయా వ్యవస్థల సహజ నైజం,వాటిని తప్పుబడుతూ కూచుంటే, ఇక బొందితో నరకమే అని తెలియజేస్తుంది ఈ సినిమా.

ఆఖరిగా కొన్ని సినిమాల సంగీతం వెంటాడే గుణం ఉంటాయి.ఇందులోని సంగీతం ఆద్యంతం అదే భావన కలిగిస్తుంది.ఈ సంగీతం కాపురాల్లో ఉండే ఘర్షణకు, బంధాల్లో ఉండే దుర్వినియోగతకు,గృహ హింసకు స్ఫురణకు వచ్చే విధంగా అల్లే ఓ మానసిక చికిత్స ఈ సంగీతం. సినిమా చుసిన తరువాత కూడా, ఆ ట్యూన్ నేను రోజు వింటున్నానంటే, ఆ ప్రభావం నన్ను ఆవరించుకొందనే చెప్పాలి.నిశ్శబ్దం కూడా ఆ సంగీతంలో గొప్పగా రూపుదిద్దుకోవడం చాలా అరుదుగా దొరికే అనుభూతి.

Anatomy of a fall, ఓ నిశ్శబ్ద వెండితెర శిక్ష. నిజాయితీ, నమ్మకాలు ఉన్నాయంటేనే వాటిని ఓడించడానికి అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయని గుర్తించాలి. వాటి కోల్పోయామంటే అంతే సంగతులు లోకుల కాకుల పాలే జీవితాలు.




Read More
Next Story