‘అన్నగారు వస్తారు’ మూవీ రివ్యూ
x

‘అన్నగారు వస్తారు’ మూవీ రివ్యూ

ఐడియా అదిరింది… సినిమా తడబడింది?


ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో MGR చనిపోయిన రోజే రామారావు(కార్తీ) పుడతాడు. దాంతో ఆయన అంశంతో తన మనవడు పుట్టాడని తాత తాతయ్య(రాజ్ కిరణ్) మురిసిపోతూంటాడు. ఆ తాతగారు అప్పట్లో MGR కి వీరాభిమాని. ఇప్పటికీ ఆయన భక్తుడుగా ఉంటూండా. ఎప్పుడూ ఆయన్నే తలుస్తూ తన మనవడుని కూడా MGR లాగే చేయాలనకుంటాడు. తెర మీద MGR పాత్రలను తన మనవడుకి ఆపాదిస్తూంటాడు. అయితే ఓ వయస్సు వచ్చేసరికి రామారావుకు ఇవి నచ్చవు.

కానీ తన తాత మీద ప్రేమతో ఆయన దగ్గర మాత్రం MGR కు ప్రతిరూపంలాగే నటిస్తూంటాడు. ఆ క్రమంలో అతనో పోలీస్ ఆఫీసర్ అవుతాడు. బయిట ప్రపంచానికి అతనో అవినీతి నింపుకున్న ఆఫీసర్. కానీ తన తాత కు మాత్రం నీతి, నిజాయితే లక్ష్యంగా బ్రతుకుతున్నవాడు. ఓ సారి తన అవినీతితో లంచం తీసుకుని సస్పెండ్ అవుతాడు. ఆ విషయం తాతయ్యకు తెలియకుండా జాగ్రత్తపడతాడు.

ఇదిలా ఉంటే అదే సిటీలో పెద్ద బిజినెస్ మెన్ భక్తవత్సలం(సత్యరాజ్) ఉంటాడు. అయనో విలన్. ఆయన ఎన్నో అక్రమాలు చేసి పైకి వచ్చి ఉంటాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూంటాడు. ఆ క్రమంలోనే జనాలకు, పర్యావరణానికి హాని తలపెట్టే ఓ ప్రాజెక్టు మొదలుపెడతాడు. అందుకు సీఎం పర్మిషన్ కోసం లంచంగా విదేశీయులతో కలిసి కొన్ని వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతాడు. మరో ప్రక్క ఈ ప్రాజెక్టుని జనాలు వ్యతిరేకిస్తుంటారు. వాళ్లకు సపోర్ట్ గా పసుపు ముఖం అనే టీమ్ ఒకటి పనిచేస్తూంటుంది. దాన్ని భక్త వత్సలం అణిచేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే రామారావుకు భక్తవత్సలం పరిచయం అవుతాడు. ఆయన కోసం , ఆయన ఇచ్చే డబ్బుకు ఆశ పడి పసుపు ముఖం అనే టీమ్ ని పట్టుకునేందుకు ప్లాన్స్ వేస్తూంటాడు.

ఈలోగా తన మనవడు అవినీతి పరుడు అని, లంచగొండి అని, MGR సిద్దాంతాలకు వ్యతిరేకి అని తెలుసుకున్న తాతయ్య..తట్టుకోలేక మనస్తాపంతో చనిపోతాడు. అప్పుడు MGR ..ఈ మనవడులో ప్రవేశిస్తాడు. ఆ విషయం రామారావుకు తెలియదు. తనకు తెలియకుండానే MGR లా రెచ్చిపోయి అవినీతి పరుల భరతం పడుతూంటాడు. అప్పుడు ఏమైంది. భక్త వత్సలం ప్రాజెక్టు చివరకు ఏ మలుపు తిరిగింది. ఈ కథలో హీరోయిన్ కృతిశెట్టి పాత్ర ఏమిటి, అసలు MGR నిజంగానే రామారావులోకి ప్రవేశించాడా..అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

సినిమా ఇండస్ట్రీలో ఒక చిత్రమైన విషయం ఉంది. ప్రత్యేకమైన స్టైల్ ఉన్న దర్శకులు మెయిన్‌స్ట్రీమ్ మసాలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తే చాలా సార్లు తడబడుతుంటారు. బొక్క బోర్లా పడుతూంటారు. ఎందుకంటే మసాలా సినిమా ఒక ఫార్ములా మీద నడుస్తుంది. స్టైల్ ఉన్న దర్శకుడుకి అది వ్యతిరేక దిశ. తమిళ దర్శకుడు నలన్ కుమారసామి తీసిన అన్నగారు వస్తారు (వా వాతియార్) కూడా అలాంటి సినిమాల జాబితాలోకి వస్తుంది.

‘సూధు కవ్వుం’ సినిమాతో తన ప్రత్యేకమైన క్విర్కీ హ్యూమర్, వింత పాత్రలు, అబ్సర్డ్ పరిస్థితులతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నలన్… ఈసారి మాత్రం పూర్తిగా మాస్ మసాలా జోన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో హీరోగా కార్తీ నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అలాగే కథలో ఉన్న ఐడియా నిజంగా ఆసక్తికరం. ఒక వైపు సాధారణ జీవితం గడిపే రామారావు. మరోవైపు అతనిపై పడిన ఎంజీఆర్ నీడ. కథలో అసలైన ట్విస్ట్ ఇదే. ఒక సాధారణ మనిషి, ఒక లెజెండ్ ప్రతిరూపంగా జీవించాల్సి వస్తే ఏమవుతుంది?అనేది.

ఈ ఐడియా నిజంగా మంచి కథకు బలమైన పునాది. ఫాంటసీ టచ్ కూడా ఆసక్తికరమే. ఒక లెజెండ్ ప్రభావం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే కోణం కథలో కనిపిస్తుంది. అయితే అది అనుకున్నంత ఇంట్రస్టింగ్ గా నడపలేకపోవటం ఇబ్బంది పెట్టింది. కొన్ని సీన్స్ లో నిజంగానే ఒక ఆసక్తికరమైన ఫీలింగ్ వస్తుంది. “ఎంజీఆర్ ఈ రోజుల్లో ఉంటే ఒక దర్శకుడు ఆయనను ఎలా చూపించేవాడు?” అనే ఊహ కూడా కథలో కనిపిస్తుంది. కానీ సమస్య ట్రీట్‌మెంట్‌లోనే ఉంది. అంటే ఈ సినిమాలో అసలు సమస్య కథలో కాదు… దాన్ని చెప్పిన విధానంలో ఉంది.

ఈ సినిమాలో మాత్రం దర్శకుడు తన స్టైల్‌ను చాలా వరకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో కథను పూర్తిగా మాస్ మసాలా ఫార్ములా వైపు తీసుకెళ్లాడు. అలాగే కొన్ని అంశాలు ఫార్ములా కోసం మాత్రమే పెట్టినట్టు అనిపిస్తాయి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం పాటలు. మాస్ ఫీల్ కోసం ఫైట్లు. హీరోయిజం చూపించడానికి కొన్ని సెట్‌పీసులు. అవి కథలో సహజంగా రావడం కంటే ఫార్ములా కోసం పెట్టినట్టు అనిపిస్తాయి. దాంతో కథలో ఉండాల్సిన సరదా కూడా తగ్గిపోయింది. దానికి తోడు పాత్రల ప్రయాణం కూడా బలంగా కనిపించదు. రామారావు పాత్రలో ఒక భావోద్వేగ ప్రయాణం ఉండాలి. ఎంజీఆర్ ప్రభావంలో జీవించడం. తర్వాత దాన్ని ప్రశ్నించడం. చివరికి తన వ్యక్తిత్వాన్ని కనుగొనడం. ఇలా చేస్తే చాలా బలమైన కథ అవుతుంది. కానీ సినిమాలో ఈ ప్రయాణం స్పష్టంగా కనిపించదు.

నటీనటుల్లో ..కార్తీ బాగా చేసారు, కృతి శెట్టి నామమాత్రం.సత్యరాజ్ రెగ్యులర్ విలనీ. నిజలగల్ రవి, శిల్ప మంజునాథ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్, GM ఆనంద్.. వంటి వాళ్లు మిగతా పాత్రల్లో అలా అలా చేసుకుంటూ వెళ్లారు.

టెక్నికల్ గా...

సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా MGR సీన్స్ వచ్చినప్పుడు పాత పాటలు, మ్యూజిక్‌తో అలరించారు. కార్తీని MGR లుక్‌లో చూపించడానికి మేకప్, కాస్ట్యూమ్స్ టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. పాటలు యావరేజ్‌గా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే..

మంచి ఐడియాతో మొదలైన సినిమా… కానీ ఫార్ములా మసాలాలో చిక్కుకుపోయింది. దర్శకుడి తన సొంత టోన్‌ను కొనసాగించి ఉంటే ఇది మరింత ప్రత్యేకమైన సినిమా అయ్యేదేమో అనిపిస్తుంది.అలాగే 1987లోనే మరణించిన తమిళ్ స్టార్ హీరో, ముఖ్యమంత్రిగా చేసిన MGR ఫ్యాన్స్ కోసం ఈ సినిమా తీసినట్టు ఉంది.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో ఉంది

Read More
Next Story