మీకీవిషయం తెలుసా? ANR ఒకప్పుడు పాపులర్ తమిళ్ స్టార్...
అక్కినేని నాగేశ్వర రావు తొలిరోజుల్లో తమిళంలో చాలా పేరున్న నటుడు. ఆయన చిత్రాలు, పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ కథేంటి?
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం. 1951 లో “ఒర్ ఇరవు” అంటే ఒక రాత్రి అనే సినిమా తీసింది. ఈ సినిమా కథ కి మూలం అదే పేరుతో నీలకంఠన్, సి ఎన్. అన్నాదురై ఇద్దరు కలసి రాసిన ఒకనాటకం. అన్నాదురై తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఈ చిత్రం లో భారతి దాసన్ రాసిన “తున్బం నెర్గయిల్..” అనే గీతం ఇప్పటికీ మేటి పాత పాటయే. ఈ పాటని అక్కినేని నాగేశ్వర రావు, బి సరోజల మీద చిత్రీకరించారు. ఆ చిత్రం ద్వారా తరతరాల తమిళు ల అభిమానాన్నిచూరగొన్నారు. ఈ చిత్రం లో “కన్నీ” “కన్నీ” అనే అయన ఉచ్చారణకు పడిపోయారంట జనం.
ఈ చిత్రం ఏయన్నార్ కి మొదటి తమిళ డైరెక్ట్ చిత్రం అనొచ్చు. దీనికి ముందు ఎఎన్నార్, అంజలీ దేవితో నటించిన “మాయలమారి” తెలుగు చిత్రాన్ని “మాయక్కారి” గా తమిళం లో కూడా తెరకెక్కించారు. అది ద్విభాషా చిత్రం.
దీని తరువాత 1953 లో అంజలీ దేవి భర్త ఆదినారాయణల అంజలీ పిక్చర్సు బ్యానర్ కింద “పరదేసి” అనే తెలుగు చిత్రం వచ్చింది. దీనిని “పూంగొథై” గా తమిళం లో కూడా ఒకేసారి చిత్రీకరించారు. ఇది కూడా ద్విభాషా చిత్రం. దీని తరువాత అక్కినేని నాగేశ్వర రావు ని మహా నటుడిగా నిలబెట్టిన దేవదాసు విడుదలయింది. తెలుగు చిత్రం లోని నటీనటుల్లో కొంతమందిని మార్చి ఈ చిత్రాన్ని తెలుగు తమిళంలో కూడా నాగేశ్వరరావుతోనే ఒక సారి తీశారు.
తెలుగు చిత్రం 1953 జూన్ 26 న విడుదలయితే, తమిళ చిత్రం అదే సంవత్సరం సెప్టెంబరు 11 న విడుదలయింది. ఆ చిత్రం ద్వారానే అక్కినేని నాగేశ్వర రావు తమిళంలో కూడా ఒక రొమాంటిక్ హీరో గా, ట్రాజెడీ కింగ్ గా స్థిరపడ్డాడు.
తమిళ దేవదాసు లోని “ఉలగై మాయం “ అంటే జగమే మాయా, “ఓ పార్వతీ” పాటలు ఇంకా తమిళ ప్రేక్షకులని వెంటాడుతూనే ఉన్నాయి.
తెలుగు సంతతికి చెందిన కలిగిన చిత్తమూర్ విజయ రాఘవులు తమిళంలో మంచి నాటక రచయిత. ఆయన శ్రీధర్ పేరుతో రచనలు చేసేవారు. ఈ శ్రీధర్ రాసిన “అమరదీపం”, “ఉత్తమ పుత్రియన్” సినిమాలు విజయవంతం కావడంతో ఆయన దర్శకుడిగా మారి “కల్యాణ పరిసు” అనే తమిళ చిత్రం తీశారు.
1959 లో విడుదలయిన కల్యాణ పరిసు లో జెమినీ గణేశన్, బి సరోజా దేవి ప్రధాన భూమికలు పోషించారు. బి సరోజు కు మేనేజర్ లో పాత్రలో ఏఎన్ ఆర్ నటించారు. ఇదొక సపోర్టింగ్ పాత్ర మాత్రమే.
తరువాత అదే చిత్రాన్ని తెలుగులో అక్కినేనినే హీరో గా పెట్టి ప్రేమకానుక గా తీసాడు. ఈ సినిమా ఆచార్య ఆత్రేయ మాటలూ, పాటలతో. పెళ్లికానుక సూపర్ హిట్టయింది. కల్యాణ పరిసులో జెమినీ గణేశన్ పోషించిన భాస్కర్ పాత్రకు పెళ్లికానుకలో అక్కినేని నాగేశ్వర రావును ఎంచుకున్నారు. బి సరోజ మేనేజర్ గా ఏయన్నార్ పొషించిన రఘు పాత్రను తెలుగులో జగ్గయ్య పోషించాడు. రెండు సినిమాల్లోనూ వాసంతిగా బి సరోజదేవే నటించింది.
పెళ్లికానుక సూపర్ డూపర్ హిట్ అయింది. కథా పరంగా, నటన పరంగా ప్రత్యేకించి పాటల పరంగా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఏ.యం.రాజా స్వరపరిచిన “ఆడే పాడే పసి వాడా”, “కన్నులతో పలుకరించు..” , “పులకించని మది పులకించు” పాటలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచే వున్నాయి.
1959 లో అంజలీ పిక్చర్స్ నుంచి మరొక తమిళ చిత్రం కలైవానన్ అనే తమిళచిత్రం వచ్చింది. ఇందులో కూడా ఎఎన్ ఆర్, అంజలీ దేవీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తెలుగు లో జయభేరిగా వచ్చింది. తమిళ చిత్రాన్ని చూసి నాటి సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ తెగ ముచ్చట పడిపోయి, నాగేశ్వరరావు పాత్రలో తనను పెట్టి మళ్లీ సినిమా తీయాలని దర్శకుడు టివిఎస్ శాస్త్రిని అడిగారట. ఏఎన్నార్ తనకు మంచి స్నేహితుడు కావడంతో దానికి శాస్త్రి అంగీకరించలేదు. అయితే, ఎంజి ఆర్ ఆసినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నారు. సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఎంజిఆర్ కొనడం వల్ల నష్టాలు రాలేదని చెబుతారు.
తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నా ఎంజిఆర్, శివాజీ, జెమిణీ గణేశన్ ఎస్.ఎస్ రాజేంద్రన్ వంటి వారు పాపులర్ కావడంతో ఏఎన్నార్ అక్కడ నిలదొక్కుకోలేక పోయారు.
దీనికి ప్రధాన కారణం ఏఎన్నార్ తమిళ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడమే స్టార్ నుంచి సూపర్ స్టార్ కాలేకపోయారని చెబుతారు. దానితో హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాల్లో దృష్టిపెట్టారు. ఆయన హైదరాబాద్ రావడం తెలుగు సినిమా హైదరాబాద్ కు తరలిరావడానికి బాట వేసింది.