
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' ఓటిటి మూవీ రివ్యూ!
బాధితురాలు ఓడిపోయిందా? సమాజమే నిందితుడా?
ఓ చీకటి పడిన సాయంత్రం…
సొంత ఊర్లోని జాతరకు వచ్చి స్నేహితుల్ని బస్ ఎక్కించి పంపించేసే వస్తూంటుంది జానకీ విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్). సాప్ట్ వేర్ ఉద్యోగిని అయిన ఆమెకు తన సెల్ ఫోన్ ని అంతకు ముందు ఆగిన 'బేకరీ'లో మరిచిపోయిన విషయం గుర్తుకు వస్తుంది. దాంతో ఆ బేకరికి తిరిగి వెళ్తుంది. అయితే ఆ ఫోన్ కోసం బేకరికి వెళ్లిన సమయంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడతారు.
దాంతో ఏం చెయ్యాలో అర్దం కాని స్దితిలో ఆవేదనతో ఉన్న జానికి న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతుంది. కానీ ఆమె ఎదురుగా నిలబడింది లీగల్ ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించుకున్న అడ్వకేట్ డేవిడ్ (సురేశ్ గోపి). తన తెలివితేటలు, లాజికల్ ప్రశ్నలతో కేసును పూర్తిగా తారు మారు చేసి, మలుపు తిప్పగలగడం ఆయన ప్రత్యేకత. జానకి అనుభవించిన వేదన డేవిడ్ ..ఒక్కో ప్రశ్నతో చిన్నబోతుంది.
డేవిడ్ తన క్లైంట్లను రక్షించుకుంటాడు. నిస్సహాయితతో జానకి చాలా బాధపడుతుంది. అది చూసిన డేవిడ్ కి, తాను ఎక్కడో పొరపాటు చేశాననే ఆలోచన మొదలవుతుంది. డేవిడ్ మనసులోని మానవత్వం అతన్ని ఆలోచనలో పడేస్తుంది. “నేను కాపాడింది న్యాయన్నా? లేక అన్యాయన్నా?” అన్న గిల్ట్ ఆయనను వెంటాడుతుంది. అదే కథి మలుపు తిప్పుతుంది. అప్పుడు అతను ఏం చేసాడు? ఆ నిర్ణయం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? చివరికి జానకి చేసిన విజ్ఞప్తి—“నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వం చూసుకోవాలి” అన్న మాటకు కోర్టు ఏమి సమాధానం ఇస్తుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఎనాలసిస్
“ఒక కేసు కోర్టులో ఆగిపోదు… అది సమాజపు అద్దంలో ప్రతిబింబమవుతుంది” ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత మనకు మన మనస్సులో రావాల్సిన మొదటి ఆలోచన ఇదే. కానీ అలాంటిదేమీ అనిపించదు. లైంగిక దాడి, తండ్రి మరణం, న్యాయం కోసం పోరాటం… ఇవి ఒక వ్యక్తిగత కథలా అనిపించినా, నిజానికి ఇది ఒక సామాజిక సమస్య.
కోర్ట్ రూమ్‌లో లాయర్ డేవిడ్ (సురేశ్ గోపి) మాటల్లో ఉన్న లాజిక్, ఆధారాలను చూపిస్తే వేసే ప్రశ్నలు — ఇవన్నీ జానకిని కాకుండా, మనల్ని కూడా కుదిపేస్తాయి. “నిజం” అనేది కోర్టులో నిలబడటానికి సరిపోదు, దానికి ఆధారాల ఆమోదం కావాలి. ఇక్కడే సినిమా తన సెంటర్ పాయింట్‌ను తాకుతుంది: న్యాయం అంటే నిజానికు పట్టం గట్టడమా? లేక లీగల్ ప్రూఫ్ ఉన్నవారికి పట్టం గట్టడమా? అనే ప్రశ్న వేస్తుంది.
అలాగే డేవిడ్ పాత్రలోని మలుపు సినిమాకి వెన్నెముక. ఆయన పాజిటివ్ నుండి నెగటివ్ దిశగా మారడం, మళ్లీ తన మనస్సాక్షి ముందు నిలబడటం — ఇది కేవలం ఒక లాయర్ ట్రాజెక్టరీ కాదు. ఇది ప్రతి ప్రొఫెషనల్ ఎదుర్కొనే ఆత్మసంఘర్షణ. “డ్యూటీ వర్సెస్ కన్షెన్స్” అన్న తాత్విక ప్రశ్నను సురేశ్ గోపి శక్తివంతంగా మలిచారు.
కానీ సమస్య ఇక్కడే. స్క్రీన్‌ప్లే పటుత్వం లోపించింది. కోర్ట్ డ్రామా అంటే ప్రతి మలుపు మనల్ని సీటు అంచున కూర్చోబెట్టాలి. కానీ ఇక్కడ అనవసర సన్నివేశాలు, స్లో నేరేషన్ ఆ ఎఫెక్ట్‌ను తగ్గించాయి. మూడు వైపుల కథనమని చెప్పినా, అది ఎక్కడికక్కడ తేలిపోవడం వల్ల “న్యాయం కోసం గెలుపు” అనే ఎమోషనల్ ఎర్న్ తక్కువైపోయింది. అయితే చివర్లో న్యాయం కేవలం గెలవడమే కాదు; అది బాధితుడి గాయాన్ని సమాజం ఎలా మోస్తుందన్న ప్రశ్న అనేది కొంతవరకూ జస్టిఫై చేస్తుంది.
ఫైనల్ థాట్:
ఒక మనిషి వేదన, ఒక మహిళ గౌరవం, ఒక తండ్రి కోల్పోవడం — ఇవన్నీ న్యాయపరమైన “ఎవిడెన్స్” లేనంత వరకు సత్యం కాదా?
Janaki v vs State of Kerala గొప్ప కోర్ట్ డ్రామా కాదు. కానీ ఇది ఒక ముఖ్యమైన డిబేట్‌ను తెరపైకి తెచ్చింది. న్యాయం, లీగల్ సిస్టమ్, సొసైటీ సైలెన్స్ మధ్య పోరాటాన్ని చూపించడానికి ప్రయత్నించింది. స్క్రీన్ ప్లే మరింత టెన్షన్‌తో మలిచివుంటే, ఇది Court (Marathi) లేదా Pink (Hindi) స్థాయి ఇంపాక్ట్ ఇచ్చేది.
చూడచ్చా
చాలా మలయాళ సినిమాలకున్న “కన్విక్షన్” ఇక్కడ కనిపించదు. అయినప్పటికీ, కోర్ట్ సీన్స్ , అనుపమ నటన సినిమాను ఒకసారి చూడదగ్గ స్థాయిలో ఉంచుతాయి.
ఎక్కడ చూడచ్చు
జీ 5 లో తెలుగులో ఉందీ సినిమా