‘నేనే నన్ను కోల్పోయా…’ రహ్మాన్ షాకింగ్ ఓపెన్-అప్!!
x

‘నేనే నన్ను కోల్పోయా…’ రహ్మాన్ షాకింగ్ ఓపెన్-అప్!!

జీవితంలో బాధాకర క్షణాలు!

సంగీత ప్రపంచంలో ప్రతీ కళాకారుడు కలలు కనే ప్రతి శిఖరాన్నీ ఏఆర్ రహ్మాన్ ఎప్పుడో తాకేశాడు. ఆస్కార్‌ నుంచి ఇంటర్నేషనల్ కోలాబరేషన్ల వరకు—వెనక్కి చూసుకునే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. తాజాగా రామ్ చరణ్ పెద్దీలోని “చికిరి చికిరి” సాంగ్ సైతం టాప్ చార్ట్స్ దుమ్ము రేపుతోంది.

కానీ…

తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో రహ్మాన్ చెప్పిన మాటలు అభిమానులను షాక్‌కి గురిచేశాయి. “పర్ఫెక్షన్ కోసం పరుగు తీస్తున్నప్పుడే నా వ్యక్తిగత మనశ్సాంతిని కోల్పోయానని అర్థమైంది” అంటూ ఆయన మొదటిసారి అంతర్గత బాధ బయటపెట్టారు.

“వైఫ్‌తో బయటకు వెళ్లినా… ఒక ఫోటో సర్! ఒక సెల్ఫీ అన్న డిమాండ్‌తో జీవితమే లాక్ అయిపోయింది”

రహ్మాన్ చెప్పినట్టుగా, ఫేమ్ వస్తే పబ్లిక్ అటెన్షన్ తప్పదని తెలుసు కానీ… “మనసుకు ఒక మూల కూడా మనదంటూ స్పేస్ ఇవ్వకుండా, ప్రతి క్షణం సెల్ఫీ కోసం అడ్డం పడటం అసలు ఊహించలేదు” అని ఆయన చెప్పిన మాటల్లో నొప్పి స్పష్టంగా వినిపించింది. మొదటి రోజు మధురంగా అనిపించిన ఆ అభిమాన ప్రేమ… కాలం గడిచేకొద్దీ బాధగా, ఒత్తిడిగా మారిందని రహ్మాన్ తన గుండె మాట చెప్పేశారు. ‘ఫ్యాన్స్ సెల్ఫీలు అడుగుతూ భోజనం చేయనివ్వరు. ప్రైవసీ లేకపోవడం బాధ కలిగిస్తుంది’ అంటున్నారు.

29 ఏళ్ల వైవాహిక బంధం… ఫేమ్ చేసిన గాయం?

భార్య సైరా బానుతో 29 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిన విషయం చెప్తూ.. “ఫేమ్ వల్ల ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ పెరిగింది. ప్రెజర్ పెద్ద పాత్ర పోషించింది” అని ఆయన తేలికగా,క్యాజువల్ గా చెప్పినట్లు అనిపించినా అది హృదయలోతుల్లోంచి వచ్చిందనేది నిజం.

రహ్మాన్‌కు అభిమానులంటే ప్రేమే… కానీ ఆయన మాటలోని బాధ మాత్రం నిజమైనది. “ఇండియన్ సెలబ్రిటీస్ కూడా వెస్ట్రన్ స్టార్స్‌లా పర్సనల్ బౌండరీలు సెట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది” అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే సూఫీయిజంను ఎందుకు స్వీకరించారో వెల్లడిస్తూ... "సూఫీయిజం మార్గంలో ఎవరినీ మతం మార్చుకోమని బలవంతం చేయరు. ఇది మీ హృదయపూర్వకంగా వచ్చినప్పుడే మీరు దీన్ని అనుసరిస్తారు. సూఫీ మార్గం ఆధ్యాత్మికంగా నా తల్లిని, నన్ను ఇద్దరినీ ముందుకు తీసుకెళ్లేలా చేసింది. ఇది మాకు ఉత్తమ మార్గం అని మేము భావించాము, అందుకే మేము సూఫీ - ఇస్లాంను స్వీకరించాము. మా చుట్టూ ఉన్న ఎవరికీ మతం మార్చుకోవడం గురించి పట్టించుకోలేదు. మేము సంగీత విద్వాంసులం. ఇది మాకు ఎక్కువ సామాజిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది" అని చెప్పారు.

అలాగే "నేను అన్ని మతాల అభిమానిని. నేను ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాల గురించి అధ్యయనం చేశా. మతం పేరుతో ఇతరులను చంపడం లేదా వారికి హాని కలిగించడం నాకు ఒక సమస్య అనిపిస్తుంది'' అని అన్నారు. ఇక ''నేను ప్రదర్శన ఇచ్చినప్పుడు... ఆ స్థలం ఒక పుణ్యక్షేత్రంలా అనిపిస్తుంది. మనమందరం ఐక్యతను ఆనందిస్తున్నాం. వివిధ మతాల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడేవారు అందరూ అక్కడకు వస్తారు" అని రెహమాన్ చెప్పారు.

సూఫీయిజం పట్ల తనకు ఆకర్షణ కలగడానికి గల కారణాన్ని చెప్తూ... "సూఫీయిజం అంటే చనిపోయే ముందే అంతర్గతంగా చనిపోవడం లాంటిది. కొన్ని తెరలు మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి బలవంతం చేస్తాయి. ఆ తెరలను తొలగించడానికి మీరు నాశనం కావాలి. కోరిక, లోభం, అసూయ లేదా నింద, ఇవన్నీ చనిపోవాలి. మీ అహం పోతుంది, అప్పుడు మీరు దేవునిలా పారదర్శకంగా మారతారు" అని రెహమాన్ తెలిపారు. మతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ... వాటిలో ఒక సారూప్యత ఉందని ఆయన అన్నారు.

రెహమాన్, తన చిన్నప్పటి కష్టాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘నేను పెరిగే క్రమంలో మా నాన్న, అమ్మమ్మ మరణాలు వంటి విషాదాలు చూశాను. తొమ్మిదేళ్ల వయసులోనే ప్రతి రోజు ట్రామా చూశాను’ అని భావోద్వేగంగా చెప్పారు.

‘నాన్న ఒకేసారి మూడు ఉద్యోగాలు చేసేవారు. రాత్రి రెండు గంటలవరకు పనిచేయడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అది ఆయన మరణానికి దారితీసింది. ఒకానొక సమయంలో ఇంటి అద్దె కట్టలేదని మమ్మల్ని వీధిలోకి తోసేశారు. అమ్మ ఎన్నో అవమానాలు, బాధలు తట్టుకుని మమ్మల్ని పెంచింది. ఆమే నాకు ఆదర్శం’ అంటూ తన తల్లి పడిన కష్టాలను పంచుకున్నారు. ‘స్కూల్​ ఫ్రెండ్స్​తో ఆడుకోవడం, కాలేజీ జీవితం వంటివి మిస్ అయ్యాను. సంగీతం నాకు సిన్సియారిటీ నేర్పించింది’ అని చెప్పుకొచ్చారు రెహమాన్.

ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అందులో 'చికిరి చికిరి' పాట బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రాబోతున్న 'తేరే ఇష్క్ మే' సినిమాకు మ్యూజిక్ అందించాడు. దీనికి అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది.

Read More
Next Story