
ఆశా భోస్లేకు ముంబైలో తుది వీడ్కోలు..
పుష్పాంజలి ఘటించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..
భారత సంగీత ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల పాటు తన గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (Asha Bhosle)కు ముంబైలో నేడు తుది వీడ్కోలు పలుకనున్నారు. ఆమె అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కు(Shivaji Park)లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 92 ఏళ్ల భోస్లే ఆదివారం ముంబైలోని ఓ ఆసుప్రతిలో కన్నుమూశారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె పార్థివ దేహాన్ని లోయర్ పరేల్‌లోని నివాసానికి తరలించారు. అభిమానులు, ప్రముఖులు ఆమెకు నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఆదివారం సాయంత్రం ఆమె నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెల్వార్ (Ashish Shelar), ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి తన తల్లికి తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలకు అనుమతిస్తామని ఆశా భోస్లే కుమారుడు ఆనంద్ తెలిపారు. సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నామని చెప్పారు.
సంగీత రంగంలో అపార సేవలందించిన ఆశా భోస్లేకు పద్మవిభూషణ్, మహారాష్ట్రభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఒక యుగాన్ని కోల్పోయింది.

