
ఎన్టీఆర్ మొదటి చిత్రం నుంచీ చివరిది వరకు… బి. సరోజాదేవి సినీ ప్రయాణం
బి. సరోజాదేవి – తెలుగు సినిమా చందమామకు శ్రద్ధాంజలి
తెలుగు తెరపై ఒకప్పుడు ఆమె నవ్వితే ప్రక్షకులు నవ్వుతారు, ఆమె కన్నీరు పెడితే ప్రేక్షకుల హృదయం ఉద్వేగంతో పులకరిస్తుంది. అలాంటి అనుభూతుల చిత్రరూపమే బైరప్ప సరోజాదేవి, దక్షిణాది సినిమా లోకంలో శోభాయమానమైన ఒక జీవిత సౌందర్య మూర్తి. ఆమె మరణంతో భారతీయ చలనచిత్రంలో ఒక శకం ముగిసినట్టయింది.
చిన్ననాటి చింతన – నాట్యాన్ని నుంచి నటనకు
1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన బైరప్ప సరోజాదేవి, తన చిన్ననాటి నుంచే నాట్యకళల్లో ఆరితేరారు. తండ్రి ప్రోత్సాహంతో కూచిపూడి, భారతనాట్యం వంటి కళలలో మెళకువలు అభ్యసించారు. కన్నడ చిత్రం “మహాకవి కాళిదాస” ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె, అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో స్టార్ హోదాకు ఎదిగారు.
తెలుగు తెరపై నాటి నాటకీయ దివ్యంగా
తెలుగు సినీ ప్రియులకు ఆమెను మరచిపోలేరు. ఎన్.టి.ఆర్. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన పాండురంగ మహాత్మ్యం చిత్రంతో ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ చిత్రం తర్వాత, సరోజాదేవి తెలుగు సినిమాల్లో పుష్కలంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర సృష్టించారు.
ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్. వంటి దక్షిణాది దిగ్గజ నటులతో ఆమె నటించిన చిత్రాలు ఎంతో గొప్ప విజయాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ చిత్రాలతోనే సరోజాదేవి తెలుగునాట ఓ వెలుగు వెలిగింది.
యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సీతారామకళ్యాణం’లో మండోదరి పాత్రలో నటించి మెప్పించారామె. ఆ తరువాత రామారావుతో “జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, దాగుడుమూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండీగౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూరకర్ణ” చిత్రాలలో నటించారు.
ఇక ఏయన్నార్ తో “పెళ్ళి కానుక, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, రహస్యం, అమరశిల్పి జక్కన్న” వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా ‘పెళ్ళికానుక’ నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది.
ఎన్.టి.ఆర్ తో ఆమె ప్రత్యేకత
ఎన్.టి.ఆర్. తొలిసారి దర్శకత్వం వహించిన సీతారామకళ్యాణంలో మండోదరి పాత్రలో నటించిన ఆమె, తెరపై రామాయణ గాథకు కొత్త అందాన్ని అందించింది.
ఆయన తో ఎన్నో చిత్రాలలో ఆమె నాయికగా, రాణిగా, మాతృమూర్తిగా కనిపించారు. విశేషం ఏమిటంటే, ఎన్.టి.ఆర్ దర్శకుడుగా చేసిన మొదటి చిత్రం సీతారామకళ్యాణం నుంచీ, ఆయన చివరి దర్శకత్వ చిత్రం సమ్రాట్ అశోక వరకూ ఆమె అతనితో పనిచేశారు.
దక్షిణాన సౌందర్యంగా – ఉత్తరాదిన సంస్కృతిగా
తమిళ చిత్రాల్లో ఎం.జి.ఆర్., శివాజీ గణేశన్ లాంటి మహానటులతో ఆమె చేసిన సినిమాలు ఆమెను తమిళంలోనూ లెజెండ్‌గా నిలిపాయి. హిందీ చిత్రపరిశ్రమలో కూడా ఆమె అడుగుపెట్టి విజయాల్ని సాధించారు. వైజయంతీమాల పోలికలతో ఆమెను హిందీ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు. వారిద్దరినీ అక్కాచెల్లెళ్ళుగా భావించారు . దక్షిణ భారత సినీ నటీమణులందరిలోనూ ఉత్తరాదిలో ప్రసిద్ధి పొందిన అరుదైన తారగా నిలిచారు.
గౌరవాలు – ఆమె ప్రతిష్ఠకు చిరునామాలు
1969లో పద్మశ్రీ
1992లో పద్మభూషణ్
2009లో ఎన్.టి.ఆర్. నేషనల్ అవార్డు
ఈ పురస్కారాలు ఆమె చలన చిత్ర కౌశల్యానికి మాత్రమే కాదు, ఆమె సంస్కృతిక భాషల అనుబంధానికి గుర్తింపులుగా నిలిచాయి.
ఓ ముగింపు కాదు – ఓ చిరస్మరణ
సరోజాదేవి మరణం ద్వారా మనం ఓ తారని కోల్పోయినా, ఆమె సినిమాలు కాలాన్ని అధిగమించిన భావాలుగా మన ముందుంటాయి. ఆమె తెలుగు పలుకు ముద్దుగా, నటన మేధస్సుగా, వ్యక్తిత్వం విన్నూత్నంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
సరోజాదేవి ఒక నటి మాత్రమే కాదు. ఆమె భాషల మధ్య స్నేహానికి ప్రతిరూపం, సాంస్కృతిక విలువలకి వేదిక, చైతన్యానికి చిహ్నం.
తెరపై ఆమె నవ్వులు, ఆమె చిలిపి మాటలు, ఆమె ముద్దు మురిపాలు – ప్రతీ తరం ఏదో ఒక సమయంలో గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.