
బాలకృష్ణ అభిమానులకు శుభవార్త, అఖండ-2 విడుదలకు లైన్ క్లియర్?
‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది
బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. ‘అఖండ 2’ (Akhanda 2) విడుదలకు ఆటంకాలు తొలగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన దాని ప్రకారం అఖండ-2 సినిమాకి ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయాయి. డిసెంబర్ 12న ‘అఖండ 2’ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
‘ఈ ఏడాదిలో ‘హరిహరవీరమల్లు’, ‘అఖండ 2’ విడుదల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. నిర్మాతలకు గతంలో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఇవి తలెత్తాయి. ‘హరిహర వీరమల్లు’ ఇష్యూ క్లియర్ కాగానే విడుదలైంది. ఇప్పుడు ‘అఖండ 2’ ఇష్యూ కూడా క్లియర్ అయింది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అందరూ దీనికోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తారు’’ అని అన్నారు.
‘‘సినిమా విడుదలలో జాప్యం తాత్కాలికమే. ఆలస్యమైనంత మాత్రాన దాని ప్రభావం ఏమీ ఉండదు. దానికి వచ్చే ఓపెనింగ్స్ దానికి ఉంటాయి. కాకపోతే ముందు చెప్పిన తేదీకే విడుదలైతే ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉంటారు కాబట్టి రెవెన్యూ విషయంలో కొంచెం వ్యత్యాసం ఉంటుందంతే. రూ.3 నుంచి రూ.4 కోట్లు తేడా రావొచ్చంతే. పెద్ద సినిమాలు బాగున్నా, బాలేకపోయినా వాటికి వచ్చే రెవెన్యూ మొదటి మూడు రోజుల్లోనే వచ్చేస్తుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు వార్తలు జోరందుకోవడంతో.. పలు ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ ‘అఖండ 2’ విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. 12వ తేదీన విడుదల కావొచ్చునని భావిస్తున్నా నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు.
Next Story

