
'బ్యాండ్ మేళం' మూవీ రివ్యూ
నవ్విస్తుందా… లేక నిద్రపుచ్చుతుందా??
గిరి (హర్ష్ రోషన్) కి తన మరదలు రాజి (శ్రీదేవి అప్పరాల) అంటే ప్రాణం. దానికి తోడు చిన్నప్పుడే వీళ్ల పెళ్లి ఫిక్స్ అని రెండు వైపుల కుటుంబాలు అనుకుంటాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది సినిమా కథ ఎందుకు అవుతుంది. కాల క్రమేణా అమ్మాయి కుటుంబంకు కలిసొచ్చింది. డబ్బులొచ్చాయి. ఆ పిల్లకు చదవు అబ్బింది. మరి మన గిరి బాబు పరిస్దితి చూస్తే టెన్త్ ఫెయిల్డ్. వాళ్ల నాన్న ఏమో ఆస్ది మొత్తం దానాలు, ధర్మాలు అంటూ అవగొట్టే పోగ్రాం పెట్టుకుని, దాన్ని విజయవంతంగా ముగించాడు.
కట్ చేస్తే.. గిరి టెన్త్ క్లాస్ పాస్ అవ్వడానికే నానా తిప్పలు పడుతుంటాడు, కానీ రాజి మాత్రం ఇంజనీరింగ్ చదువుతూ నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళిపోయింది. వాళ్ల నాన్న (సాయి కుమార్) బాగా రిచ్ అయిపోయి, గిరి ఫ్యామిలీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. కానీ మన గిరి మాత్రం "రాజి నాదే" అంటూ ఫుల్ పొసెసివ్ గా తిరుగుతున్నాడు. చదువు అబ్బకపోయినా, తాగడం, తన బ్యాండ్ మేళం గ్యాంగ్‌తో కలిసి చిల్లరగా తిరగడం ఇతని మెయిన్ హాబీగా పెట్టుకున్నాడు!
మరో ప్రక్క రాజికి గిరి అంటే ఇష్టం ఉన్నా, అతని బేవార్స్ తనం చూసి చిరాకు పడుతుంటుంది. "ముందు నీ సప్లీలు క్లియర్ చెయ్, నీకున్న మ్యూజిక్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకో" అని గిరిని తిట్టి దార్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది.కానీ పని అవ్వలేదు. ఏదో కాలక్షేపానికి ఊర్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్లలో బ్యాండ్ కొట్టే గిరి గ్యాంగ్, లైఫ్ ని అసలు సీరియస్ గా తీసుకోదు. ఇదిలా ఉంటే రాజి క్లాస్ మేట్ ఆమెకు లైన్ వేస్తుంటే, గిరి లో అసూయ మొదలవుతుంది. ఈ క్రమంలో ఆ పొసెసివ్ నెస్ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లింది? రాజి,గిరి ఒకటయ్యారా, ఇంజనీరింగ్ చదివే రాజి.. తన లైఫ్ లో సెటిల్ అయిన వాడిని చేసుకుంటుందా లేక తన మేనబావ మ్యూజిక్ పిచ్చిని అర్థం చేసుకుంటుందా? అనేదే ఈ సినిమా మెయిన్ క్లైమాక్స్.
ఎనాలసిస్
ఈ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉందీ అంటే …అది టైటిల్ మాత్రమే. ఇప్పటికే ఇలాంటి కథలు బోలెడు చూసేసాం. అప్పట్లో రాజ్ తరుణ్ కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలతోటే ఉయ్యాల - జంపాల అంటూ ఊపేసాడు. అప్పుడు సక్సెస్ అయ్యింది కదా ఇప్పుడు ఎందుకు కాదు అనుకున్నారేమో ... ఇప్పుడు కాలానికి అప్డేట్ చేసి ఇవ్వాల్సిన కథను కేవలం టైటిల్ మార్చి ఇచ్చేసారు కోన వెంకట్ అండ్ టీమ్. దాంతో చాలా సీన్స్ “ఇది మనం ఎప్పుడో చూసేసాం కదా?” అనిపిస్తునే ఉంటాయి. దాన్ని నోస్ట్రాలజీ అనుకుంటే ఇబ్బందిలేదు. నస అనుకుంటేనే అసలు సమస్య అంతా.
సినిమా ఓపెనింగ్ లోనే పాత కాలపు చైల్డ్ హుడ్ పోర్షన్ ఒకటి పెట్టి పుణ్యకాలం కాస్తా గడిపేశారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో బిల్డప్, ఆ బ్యాండ్ మేళం గ్యాంగ్ చేసే రచ్చతో ఎలాగోలా ఇంటర్వెల్ వరకు మేనేజ్ చేశారు. ఇంటర్వెల్ లో ఏదో 'బాహుబలి' రేంజ్ ట్విస్ట్ ఉంటుందనుకుంటే, సెకండ్ హాఫ్ లో కథ పట్టాలు తప్పి ఏ గల్లీలోకి వెళ్ళిందో డైరెక్టర్ కైనా తెలుసో లేదో!
సెకండాఫ్ లో .. ఒకే పాటను లూప్‌లో పెట్టినట్టు..యూట్యూబ్‌లో ఆటోప్లేలో అదే వీడియో మళ్లీ ప్లే అవుతున్నట్లు సీన్స్ వెళ్తూంటాయి. చివర్లో ఒక్కసారిగా పాత్రలు మారిపోతాయి. ఎందుకు? పెద్ద రీజన్ ఏమీ లేదు. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేశాం కాబట్టి, త్వరగా ముగించాలి కాబట్టి. “కథ పాతదైనా పర్లేదు…కానీ నాకు కొత్తగా చెప్పు!”అనే ప్రేక్షకులకు ఈ సినిమా నాకు అంత సీన్ లేదని చేతులు ఎత్తేస్తుంది. ఉన్నంతలో ఎమోషన్ పండించాలని ట్రై చేశారు. పాతదే కానీ ఆ సీన్స్ ఫరవాలేదనిపిస్తాయి. ఉన్నంతలో రిలీఫ్ ఏమిటీ అంటే అక్కడక్కడా కామెడీ మాత్రం పండింది.
టెక్నికల్ గా
సాధారణంగా మ్యూజిక్ బ్యాండ్ చుట్టూ తిరిగే కథ అంటే.. పాటలు ప్రాణం పోయాలి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్ దద్దరిల్లిపోవాలి. కానీ 'బ్యాండ్ మేళం' విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ అంతా చప్పగా, విన్న కాసేపటికే మర్చిపోయేలా ఉంది. ఒక్క పాట మాత్రం వినడానికి బాగుంది, దాన్ని బిజిఎమ్ (BGM) గా వాడటం కొంత వరకు మేలే చేసింది కానీ, ఓవరాల్ గా ఆల్బమ్ మాత్రం నిరాశపరిచింది.
ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమాను రేసీగా నడపాలనే తాపత్రయం కనిపిస్తోంది కానీ, ఆ గబగబా కట్స్ వల్ల అసలైన ఎమోషన్ మిస్సయ్యింది. కీ మూమెంట్స్ దగ్గర ఎమోషన్స్ రిజిస్టర్ కాకుండానే కథను పరిగెత్తించారు.
రైటింగ్ లో అక్కడక్కడా ప్రాసలు, ప్రాస కోసం వాడిన పంచ్‌లు నవ్విస్తాయి కానీ, అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. విజువల్ గా చూస్తే, ఈ సెటప్ కి సినిమాను ఇంకాస్త రిచ్ గా, కలర్ ఫుల్ గా చూపించే అవకాశం ఉన్నా.. ఎందుకో టెక్నికల్ టీమ్ ఆ విషయంలో చేతులెత్తేసినట్టు అనిపిస్తోంది. కొన్ని ఫ్రేమ్స్ నీట్ గా ఉన్నా, ఓవరాల్ అవుట్‌పుట్ మాత్రం యావరేజ్ గానే ఉంది.
నటీనటుల్లో ..
శ్రీదేవి అప్పరాల్ల ఉన్నంతలో పరవాలేదనిపించినా, హర్ష్ రోషన్ మాత్రం ఓవర్ యాక్షన్ చేసి విసిగించాడు. ఇద్దరు లీడ్స్ తమ పాత చార్మ్‌ను రిపీట్ చేయలేకపోయారు, ముఖ్యంగా హీరో లౌడ్ పెర్ఫార్మెన్స్ వల్ల డ్రామా కాస్తా అదేదో అయ్యింది.
ఫైనల్ థాట్
టైటిల్‌లో ఉన్నంత సౌండ్ మేటర్‌లో లేదు, సినిమా చూసాక థియేటర్ బయటికి వచ్చేటప్పుడు “బాగోలేదు” అనిపించదు… కానీ “బాగుంది” అని కూడా అనిపించదు. అదే మ్యాజిక్కు.

