దీక్షిత్ శెట్టి బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి మూవీ రివ్యూ
x

దీక్షిత్ శెట్టి 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' మూవీ రివ్యూ

ప్లాన్ అదిరింది కానీ.. సీన్ రివర్స్ !


అది ఎలక్షన్స్ టైమ్ ...కర్ణాటకలో ఎటు చూసినా రాజకీయ నాయకుల కార్లు బ్లాక్ మనీతో నిండి రోడ్లపై తిరుగుతున్నాయి. ఆ గందరగోళంలో పోలీస్ లు అంతా బిజీగా ఉంటారు కాబట్టి తన వైపు దృష్టి పడదని కనక అలియాస్ 'టైగర్' (దీక్షిత్ శెట్టి) అనే కుర్రాడు ఒక దొంగతనం ప్లాన్ వేస్తాడు. తనలాంటి మరో ఐదుగురు స్నేహితులని పోగు చేస్తాడు. అయితే పెద్ద బ్యాంక్ లలో రిస్క్ ఎక్కువ ఉంటుందని ఓ విలేజ్ లోని ఓ చిన్న 'భాగ్యలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు' ని ఎంచుకుంటారు.

ఆ తర్వాత బెలూన్లు అమ్ముకునే వాడి దగ్గర కొన్న ప్లాస్టిక్ జంతువుల ముసుగులు, అద్దెకు తెచ్చిన పాత తుపాకులుతో రంగం సిద్దం చేస్తారు. అనుకున్నట్లుగానే ఒక ఉదయం ఆ ముఠా హంగామా చేస్తూ బ్యాంకులోకి చొరబడుతారు. లోపల సిబ్బందిని, కష్టమర్స్ ని భయపెడతారు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ పడుతుంది. కష్టపడి,భయపెట్టి మరీ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నది కేవలం 66,999 రూపాయలు మాత్రమే కనపడతాయి.

పూర్తి నిరాశతో వేరే దారి లేక బ్యాంక్ నుంచి బయట పడదామనుకుంటే, ఆ పాత బ్యాంకు ఫ్రంట్ డోర్ జామ్ అయిపోతుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ వెళ్లటంతో సైరన్ తో పోలీసులు బ్యాంకును చుట్టుముడతారు. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలనే ఆత్రుతతో బ్యాంక్ అంతా కలయతిరుగుతూంటే... అక్కడ ఓ అండర్ గ్రౌండ్ కనపడుతుంది. అందులో స్థానిక రాజకీయ నాయకులు దాచిన బ్లాక్ మనీ, వారి చీకటి రహస్యాలకి చెందిన కొన్ని ఫైల్స్ ఉంటాయి.

ఎలక్షన్స్ టైమ్ లో ఆ రహస్యాలు బయటపడితే కొందరి భవిష్యత్తు నాశనమవుతుంది. దొంగల మొహాల్లో ఆనందం..అయితే ఆ డబ్బుతో వాళ్లు ఎలా బయిటపడాలనేది ఓ పెద్ద ప్రశ్న. మరో ప్రక్క బయట ఉన్న పోలీసులు వారిని పట్టుకోవాలని చూస్తుంటే, లోపల ఉన్న రాజకీయ నాయకుల రహస్యాలు వారిని మరో ప్రమాదంలోకి నెట్టే పరిస్దితులు ఏర్పడతాయి. అప్పుడు ఏమైంది..టైగర్ ఆ డబ్బుని బయిటకు తీసుకు వెళ్లగలిగారా...పోలీసుల వ్యూహాల నుండి తన ముఠాను ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏం సాధించారు అనేది ముగింపు.

విశ్లేషణ:

ఈ సినిమా ఒక హైస్ట్ జానర్ సినిమా గా మాత్రమే కాకుండా ఎన్నికల వేడి, బ్లాక్ మనీ, చిన్న ఊరి రాజకీయాలు ఇవన్నీ కలుపుతూ సోషల్ సాటైర్ థ్రిల్లర్ గా చేయాలనేది దర్శకుడు ఆలోచన కావచ్చు. కానీ ఆ అవకాశం స్క్రీన్‌ప్లే ఇవ్వలేదు.

ఎలక్షన్స్ టైమ్‌లో పోలీసులు బిజీగా ఉంటారు కాబట్టి చిన్న కో–ఆపరేటివ్ బ్యాంక్ దోచేద్దామనే ఆలోచన చాలా షార్ప్ .అలాగే అక్కడ 66,999 రూపాయలే దొరికే ట్విస్ట్, అండర్‌గ్రౌండ్‌లో రాజకీయ నాయకుల రహస్యాలు – ఇవన్నీ హై కాన్సెప్ట్ ఐడియాలే. కానీ సమస్య ఏమిటంటే ఈ ఐడియాలు ఏవీ కథని ముందుకు నడిపే డ్రామాటిక్ ఫోర్స్ గా మారలేదు. అవి కేవలం ప్లాట్ పాయింట్స్‌గా మాత్రమే మిగిలాయి. అంటే అవి జరిగిన తర్వాత కథలో చెప్పుకో దగ్గ మార్పు ,డ్రామా మొదలు కాలేదు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు అత్యవసరమైన టైమ్ ప్రెషర్ లేదు. కథ… ఒకే చోట నిలిచిపోయి,డైలాగులతో నడుస్తూంటుంది.

ఆ డైలాగులు కూడా కొన్ని చోట్ల నవ్వించటానికి ప్రయత్నిస్తాయి. కానీ వాటి వల్ల కథలో కదలికా రాదు. అలాగే ఆ దొంగలు పట్టుబడిపోతారేమో అని ఎక్కడా అనిపించదు. బ్యాంక్ బయిట పోలీస్ ల టెన్షన్ ఉంటుంది కానీ అది మనకు నమ్మకం కలిగించదు. ఎక్కువగా ఒకే లొకేషన్ లో కథ జరుగుతుంది. ఆ లొకేషన్ బ్యాంక్. కానీ అది ఒక సాధారణ ప్రభుత్వ ఆఫీస్‌లా కనిపిస్తుంది. కథలో ప్రధానమైన ట్విస్ట్ అయిన లాకర్ రూమ్‌కి మిస్టరీ లేదు. అండర్‌గ్రౌండ్ రివీల్ విజువల్ షాక్ ఇవ్వదు.

ఇక ఎలక్షన్స్ టైమ్‌లో రాజకీయ నాయకుల రహస్యాలు బయటపడితే…ఇది కథని పూర్తిగా వేరే లెవెల్కి తీసుకెళ్లగల పాయింట్. కానీ స్క్రిప్ట్ ఆ క్లారిటీ ఇవ్వదు. ఆ రహస్యాల వల్ల ఎలాంటి రియల్ థ్రెట్ చూపించదు. రాజకీయ శక్తి ఎంత ప్రమాదకరమో ఫీల్ అయ్యేలా చేయదు. చివరకు కూడా ఆ రహస్యాలు ఏమిటి..దాని వల్ల ఇబ్బంది పడే రాజకీయనాయకులు ఎవరనేది చెప్పరు. అలాంటప్పుడు ఎందుకు అలాంటి ఎత్తుగడ తీసుకున్నారా అనిపిస్తుంది. ఇలాంటివే సినిమా మొత్తం.

టెక్నికల్ గా...

సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగానే పట్టుకుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో సహాయపడింది. కావాల్సిన చోట మ్యాజిక్ చెయ్యలేకపోయింది. ఇక మ్యూజిక్ టెన్షన్‌ను లేపలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉంది. మిగతా విభాగాలు చిన్న సినిమాను చుట్టేసిన ఫీల్ తీసుకురావటంలో సహాయపడ్డాయి. ఏదైమైనా స్క్రిప్ట్ బలహీనంగా ఉన్నప్పుడు టెక్నికల్ టీమ్ ఎంత బాగా చేసినా దాని ఇంపాక్ట్ పరిమితమే.

చూడచ్చా

కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు. కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. పగలబడి నవ్వించదు. అలాగని టెన్షన్ తో మనని ఆసక్తిగా చూసేలా చెయ్యదు. సోసోగా ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story