
భైరవం బాయ్‌కాట్: కొత్త ట్రెండ్ వెనుక రాజకీయాలూ, వ్యక్తిగతాలూ?
తాజాగా ఈ ట్రెండ్ కింద ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్రం “భైరవం”.
“Cinema is a mirror by which we often see ourselves.”
— Alejandro González Iñárritu
సినిమా అంటే కేవలం కథలే కాదు, మన సమాజం, మన భావాలు, మన రాజకీయాల ప్రతిబింబం కూడా. అయితే ఇటీవలి కాలంలో ఈ ‘సినిమా అద్దం’ కొంచెం తిప్పబడింది. ప్రేక్షకుల కోరికలు, అభిరుచులు మాత్రమే కాదు, కొన్ని రాజకీయ, సామాజిక, వ్యక్తిగత కారణాలు కూడా సినిమాలపై ప్రభావం చూపిస్తూ,బాయ్‌కాట్ అనే కొత్త సంక్షోభం తెచ్చాయి. బాలీవుడ్‌లో మొదలైన ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పుడు నెమ్మదిగానే , కానీ బలంగా తెలుగులో కూడా చోటు చేసుకుంటోంది. తాజాగా ఈ ట్రెండ్ కింద ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్రం “భైరవం”.
“భైరవం” – బాయ్‌కాట్ ట్రెండ్ వెనుక అసలు కారణం ఏంటి?
భైరవం చిత్రం ఈ నెల 30న థియేటర్స్ లోకి రాబోతున్న వేళ, ఈ సినిమా పట్ల ఓ కొత్త నెగిటివ్ ట్రెండ్ సోషల్ మీడియా వేదికగా ఎగిసిపడుతోంది. #BoycottBhairavam అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉన్న కథ 2011లో డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫేస్‌బుక్ అకౌంట్ లో వెలుగులోకి వచ్చిన ఒక పాత పోస్ట్ కి సంబంధించినది.
అందులో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పా’ సినిమా పోస్టర్ ను మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి చిత్రాలతో మార్ఫ్ చేసి ‘ఛా’ అనే టైటిల్ ఇచ్చారు. అది ఇప్పుడు ట్రెండ్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆ రచ్చ బాయ్ కాట్ ‘భైరవం’ వరకు వెళ్ళింది.
డైరక్టర్ క్లారిటీ, క్షమాపణ
ఈ విషయం పై భైరవం డైరెక్టర్ విజయ్ క్లారిటీ ఇచ్చారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసినప్పుడు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సాయిధరమ్ తేజ్ ను పరిచయం చేసి.. మంచి కథ ఉంటే అతనితో మూవీ చేయమని అడిగారు. నేను చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలు చూసి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటిది వాళ్లను నేనెందుకు దూరం చేసుకుంటాను.
2011లో నేను నా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టినట్టు ట్రోలింగ్ జరుగుతోంది. ఆ పోస్టు పెట్టింది నేను కాదు. బహుశా నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. కానీ నా ఫేస్ బుక్ ఐడీ కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు. మనస్ఫూర్తిగా చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి నా మీద, నా సినిమా మీద ట్రోలింగ్ ఆపండి’ అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కానీ మెగా ఫ్యాన్స్ శాంతించినట్టు కనిపించడం లేదు.
అయితే 2011లో హ్యాక్ అయితే ఇప్పటివరకు చూసుకోలేదా అంటూ చాలా మంది ఆ వివరణను చూసి ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ కు కోపం వచ్చింది?
మరో ప్రక్క ఏలూరు సాంగ్ లాంచ్ సందర్భంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక పొలిటికల్ పార్టీని హర్ట్ చేశాయి. ఏడాది కిందట “ధర్మాన్ని కాపాడ్డం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా ఏడాది కిందట మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడ్డం కోసం ఒకరొచ్చారు.” అంటూ విజయ్ కనకమేడల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
తన సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన పొలిటికల్ కామెంట్స్, భైవరంకు నెగెటివ్ గా మారాయి. బాయ్ కాట్ భైరవం అనే ట్రెండ్ కు ఇవి ఊతం ఇస్తున్నాయి.
హిట్ అత్యవసరం..ఇలాంటి టైమ్ లో ఇలా
ఇక ఈ భైరవం సినిమా టీమ్ లో చాలామందికి కీలకం. మంచు మనోజ్ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ ఛత్రపతి దెబ్బనుండి కోలుకోవడానికి ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. ఇక డైరెక్టర్ విజయ్ కనకమేడల గత చిత్రం ‘ఉగ్రం’ పెద్దగా ఆడలేదు. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాల్సిన పరిస్దితి.
మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో :
”సినిమాకి కులాలు ఉండవు. ఆధార్ కార్డులు, కులం చూసి హీరోని ప్రేమించరు. ఇదో ఫాల్స్ ట్రెండ్ లా అనిపిస్తోంది. కులం రాజకీయాల్లోకి చొచ్చుకు పోయింది. సినిమాల్లోకి కూడా వచ్చేసింది. దర్శకుడు విజయ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై ఇష్టంతోనే ఏలూరు ఈవెంట్ లో అలా మాట్లాడారు. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.
ఆయన మెగా హీరోలని దృష్టిలో ఉంచుకొని ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ చేశారని అంటున్నారు. అదెప్పుడో జరిగిన సంగతి. అది కూడా ఆయన చేశారా, లేదా? అనేది తెలీదు. పవన్ కల్యాణ్ వీరాభిమాని ఇలా ఎందుకు చేస్తాడనైనా ఆలోచించండి. ‘భైరవం’ కోసం అంతా చాలా కష్టపడ్డాం. మేం సినిమా వాళ్లం. పాలిటిక్స్ ని రుద్దుకోవడం మాకు ఇష్టం లేదు” అని స్పష్టం చేశారు.
రీమేక్ ...
మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సినిమా ఇది. తమిళ చిత్రం ‘గరుడన్’కి రీమేక్. అయితే కథలో చాలా మార్పులు చేశారని చెప్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైంది. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కంక్లూజన్
“Movies touch our hearts and awaken our vision, and change the way we see things.”
— Martin Scorsese
సినిమా కేవలం మనల్ని వినోదపరచడమే కాక, మన ఆలోచనల్ని, భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులపై మన దృష్టిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కానీ రాజకీయాలు, వ్యక్తిగత ఘర్షణలు వాటిని ప్రభావితం చేస్తే అది ఆ కళకు అన్యాయం చేసినట్లే. అదే సమయంలో సినిమాల్ని, రాజకీయాల్ని మిక్స్ చేయటం అందరి వల్లా కాదు..ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఇలాంటి సమస్యలే ముందుకు వస్తాయి.