‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
x

‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ

ఎప్పుడూ వినూత్న పాత్రల్లో కనిపించే కమల్ హాసన్.. 28 ఏళ్ల తర్వాత మరోసారి ‘సేనాపతి’గా కనిపిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ సీక్వెల్ ఎలా ఉందంటే..


ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో(ముఖ్యంగా దక్షిణాదిలో) సీక్వెల్ కాలం నడుస్తోంది. అంతేకాకుండా సినిమాలు తయారు కావడానికి చాలా సమయం తీసుకుంటున్నాయి. గతంలో వచ్చిన బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, ఆర్.ఆర్.ఆర్, సలార్(రెండో భాగం ఇంకా రాలేదు) లాంటివి ప్రేక్షకులను ఎదురుచూసేలాగా చేశాయి. గత నెలలో విడుదలైన కల్కి కూడా చాలా కాలం పట్టింది. ఈ కోవలోనే ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ భారతీయుడు2 ని 2017 లో ప్రకటించి, 2019లో షూటింగ్ మొదలుపెట్టి, చివరకు జూలై నెల రెండో శుక్రవారం(12.7.24) విడుదల చేశాడు. అన్ని సినిమాల లాగే ఇది కూడా టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకులను వరించింది.

చాలా ఆలస్యంగా వచ్చిన సీక్వెల్

భారతీయుడు బాగా విజయవంతమైన సినిమా. కానీ 28 సంవత్సరాల తర్వాత దాని సీక్వెల్ వచ్చింది. ఈ సినిమా మీద ప్రేక్షకులతో పాటు, దక్షిణాది సినిమా పరిశ్రమ మొత్తం దృష్టి సారించింది. పైగా ఈ మధ్యనే వచ్చిన కల్కి సినిమాలో, కమలహాసన్ "కలి" గా నెగిటివ్ పాత్రలో కనిపించడంతో, ఈ సినిమాపై ప్రేక్షకులకి ఆసక్తి కలిగింది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా కథ మొదటి సినిమాకు కొనసాగింపుగా ఉంది.

చిత్ర అరవింద్(సిద్ధార్థ), అతని ముగ్గురు స్నేహితులు బార్కింగ్ డాగ్స్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం నడుపుతుంటారు. సమాజంలో జరిగే అన్యాయాలను, వారు వీడియోలు తీసి బార్కింగ్ డాగ్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ క్రమంలో వారు కొంత విఫలమవుతారు. దాంతో భారతీయుడు మళ్ళీ ఇండియాకు రావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, దేశవ్యాప్తంగా చాలామంది కూడా అదే పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా పెట్టడం వల్ల, ఇండియన్ మళ్లీ ఇండియాకి రావడం, కొంతమంది బిజినెస్ మాన్‌లను చంపడం జరుగుతుంది. సిద్ధార్థ అతని స్నేహితులు కూడా, మార్పు అనేది తమనుంచే మొదలుకావాలని, వాళ్ళ తల్లిదండ్రుల మీద నిఘా పెట్టి, వారు కూడా అవినీతికి పాల్పడుతున్నారని తెలుసుకొని, వారిని పోలీసులకు పట్టిస్తారు. అయితే సిద్ధార్థ జీవితంలో జరిగిన ఒక అనూహ్య సంఘటన వల్ల వారు ఇండియన్‌ని భారతదేశం నుంచి వెళ్ళిపోమని చెప్తారు. అలాగే చాలామంది ప్రజలు కూడా ఇండియన్ మీద ద్వేషం పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో చివరికి ఏం జరిగింది అన్నది స్థూలంగా భారతీయుడు 2 కథ.

కొంత కనిపించిన శంకర్, కమల్ మ్యాజిక్

సాధారణంగా ఒక సీక్వెల్ ని మొదటి సినిమాతో పోల్చుకుంటారు ప్రేక్షకులు. అలా పోల్చుకున్న ప్రేక్షకులకు ఇది కొంత వరకు నిరాశపరిచే అవకాశం ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి సినిమా ప్రేక్షకులకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఆ స్థాయి కనెక్షన్ ఉండదు. మొదటి సినిమాలో కమల్ హాసన్ నటన ఓ స్థాయిలో ఉంటుంది. సీక్వెల్లో ఆ స్థాయి నటన కనపడదు. 28 సంవత్సరాల కాలం యొక్క ఫలితం అది. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అభిమానులను అలరిస్తుంది.

ఈ సినిమాకు బలం ఇద్దరే. ఒకరు దర్శకుడు శంకర్, మంచి నటుడు కమల్ హాసన్. అయితే మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ఇద్దరు కూడా కొంత బలహీనంగా కనపడతారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాను మూడు గంటలపాటు పెట్టాడు . ఒక అరగంట సినిమా కట్ చేసి ఉంటే మరింత బలంగా ఉండేది. అలాగే కమలహాసన్ మొదటి సినిమాతో పోల్చుకుంటే 28 ఏళ్ల తేడా ఉండడం వల్ల, కొంత బలహీనంగానే అనిపిస్తాడు. అయినప్పటికీ సినిమా మొత్తం గా చూస్తే ఇద్దరు సినిమాకి బలమై, సినిమాను చూడదగ్గదిగా, అభిమానులను ఆకట్టుకునేలా తీయడంలో చాలా వరకు విజయవంతమయ్యారు.

ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే శంకర్ రెండో సగంలో ఆ లోపాన్ని సరిదిద్దుకొని సినిమాను కొంత వేగంగా నడిపి ప్రేక్షకులను మళ్లీ సినిమాలో లీనం అయ్యేలా చేస్తాడు. శంకర్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎవరికి అపనమ్మకం లేదు.

ప్రారంభం అదిరింది కానీ...

మొదటగా చెప్పాల్సింది దర్శకుడు శంకర్ గురించి. సినిమా కొంచెం బలహీనమైంది అనిపించినప్పుడు మళ్లీ దాన్ని బలంగా తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే సిగరెట్టు మద్యం గురించి వేసినట్లు "corruption causes cancer, corruption kills" అని వేయడం శంకర్ మార్కు మ్యాజిక్. ఇంకా Election is not a change, election is an exchange( ఎన్నికలు మార్పు కాదు, మార్పిడి మాత్రమే) అని వేయడం కూడా క్రియేటివ్ గా ఉంది. ఇది ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది.

మొదటి సీన్ లో రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తున్న మరొక వ్యక్తి ఆ పని చేస్తున్న వ్యక్తిని ఇలా చేయడం తప్పు కదా అని అడుగుతాడు. ఆ వ్యక్తి పట్టించుకోకపోతే మోటర్ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి రోడ్డు మీద వర్షం నీళ్లు ఉన్న గుంతలోకి మోటార్ సైకిల్ ని పోనిచ్చి, గోడ దగ్గర మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి మీద పడేలా చేస్తాడు. సినిమా మీద ఎన్నో అంచనాలు పెరిగిపోతాయి. అయితే సినిమా తర్వాత అంచనాలకు అనుగుణంగా ఉండదు

రాణించిన సిద్ధార్థ, ఎస్ జె సూర్య

ఇక కమల్ హాసన్ లాంటి నటుడు గురించి చెప్పేదేముంది. ఇది కమల్ హాసన్ సినిమా. కమలహాసన్ తనదైన మేనరిజంతో, నటనతో సినిమాకు మూల స్తంభం అవుతాడు. కొన్ని సన్నివేశాల్లో, కేవలం కమలహాసన్ మాత్రమే ఇది చేయగలుగుతాడు అనేలా నటించాడు. ఇదే సినిమాకు ప్రధానమైన బలం. ఇతర నటీనటుల్లో సిద్ధార్థ బాగానే చేశాడు. ప్రియా భవాని శంకర్ కూడా పర్వాలేదు అనిపించింది. సముద్రఖని ఈ మధ్య నటుడిగా సినిమాల్లో మంచి నటన కనబరుస్తున్నాడు. ఇందులో కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సకల కళా వల్లభ పాత్రలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య, తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటాడు. నెగిటివ్ పాత్రలో మెప్పించే బాబి సింహ ఈ సినిమాలో సిబిఐ అధికారిగా పర్వాలేదనిపించాడు. కామెడీతో ఎప్పుడు మెప్పించే వివేక్ కామెడీ మార్కు ఈ సినిమాలో కనిపించలేదు. చిన్న పాత్రలో బ్రహ్మానందం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.ఇక వివిధ భాషల నటులు కొంతమంది ఉన్నారు. హిందీ నటుడు గుల్షన్ గ్రోవర్ ఉన్న కాసేపు పరవాలేదు అనిపించాడు.

కనువిందు చేసే ఫోటోగ్రఫీ, విజువల్స్

ఈ సినిమాకు సంగీతం కొంచెం బలహీనమే. ఎందుకో మరి ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ కు బదులు, అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకున్నాడు దర్శకుడు శంకర్. అయితే సినిమాకు మరొక బలం రవివర్మన్ ఫోటోగ్రఫీ. ప్రేక్షకులకు కన్నులమిందే. గ్రాఫిక్స్ తక్కువ, ఒరిజినల్ ఎక్కువ ఉన్న సన్నివేశాలు నిజంగా వెండితెరపై ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ముఖ్యంగా ఒకటి రెండు పాటల్లో స్క్రీన్ మొత్తం వర్ణమయం అవుతుంది. ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ సినిమాలో ప్రస్తావించదగ్గ మరో అంశం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కమల్ హాసన్ ఫైట్స్ సన్నివేశం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ఇక ఒంటి చక్రం సైకిల్ మీద తీసిన ఛేజింగ్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్. అయితే అవి ఎక్కువ సేపు ఉండడం ఒక మైనస్ పాయింట్.

చివర్లో ఆకట్టుకునే 20 నిమిషాల క్లైమాక్స్

ఈ సినిమాకు ఇంకో బలం ఏంటంటే రెండో సగంలో చివరి 20 నిమిషాలు తోపాటు క్లైమాక్స్ కూడా, మొదటి సగంలోని లోపాలని ప్రేక్షకులు మరిచిపోయేలా చేస్తుంది. . అది శంకర్, కమలహాసన్ మ్యాజిక్. ప్రేక్షకులు సినిమాలో పూర్తిగా లీనమై ఎంజాయ్ చేస్తారు.

చివర్లో భారీతీయుడు 3 కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, చూపిస్తూ ప్రేక్షకుల కు ఆసక్తి కలిగించడం శంకర్ మార్క్ టెక్నిక్. నిజానికి భారతీయుడు 3 సినిమా మళ్లీ తీయడం లేదు. భారతీయుడు2 సినిమా మొత్తం నిడివి ఆరు గంటలు ఉండడంతో, మూడు గంటల సినిమాని భారతీయుడు 3 గా విడుదల చేయబోతున్నాడు శంకర్. భారతీయుడు చిత్రీకరించే సమయంలో ఎక్కువ నిడివి వచ్చినప్పటికీ, మొత్తం శంకర్ కు నచ్చడం వల్ల, దాన్ని మూడు గంటలకు కుదించడం సాధ్యం కాకపోవడంతో, రెండు భాగాలు చేసి మొదటి భాగం ఇప్పుడు విడుదల చేసి, మరో మూడు గంటల పాటు నడిచే రెండో భాగాన్ని భారతీయుడు 3 గా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అన్ని సీక్వెల్స్ కు ఉన్న సమస్యలు దీనికి ఉన్నప్పటికీ, శంకర్ మ్యాజిక్, కమల్ హాసన్ నటన కలిపి ఈ సినిమాని చూడదగ్గ సినిమాగా మలిచాయి. చాలాకాలం ప్రేక్షకులను వేచి చూసేలా చేసినప్పటికీ ఈ సినిమా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

నటీనటులు: కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్,ఎస్.జె.సూర్య,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియ భవాని శంకర్, నెడుముడి వేణు,వివేక్,కాళిదాస్ జయరామ్,గుల్షన్ గ్రోవర్,సముద్రకని,బాబీ సింహా, బ్రహ్మానందం

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్. శంకర్

డైలాగ్స్ : హనుమాన్ చౌదరి,

సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్

నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్

విడుదల: 12 జూలై 2024

Read More
Next Story