కాదేది ట్రోలింగ్ కు అతీతం, పెద్ద సినిమాలకు ఓటిటి రిలీజ్ భయం
x

కాదేది ట్రోలింగ్ కు అతీతం, పెద్ద సినిమాలకు ఓటిటి రిలీజ్ భయం

ఓటిటిలో సినిమా ఎప్పుడు వస్తుందా ఓ వర్గం ప్రేక్షకులు ఎదురుచూస్తూంటారనేది నిజం. అయితే పెద్ద హీరోలు, దర్శకులు మాత్రం ఓటిటి రిలీజ్ అంటే ఒణుకుతున్నారు.


ఓటిటిలో సినిమా ఎప్పుడు వస్తుందా ఓ వర్గం ప్రేక్షకులు ఎదురుచూస్తూంటారనేది నిజం. అయితే పెద్ద హీరోలు, దర్శకులు మాత్రం ఓటిటి రిలీజ్ అంటే ఒణుకుతున్నారు. థియేటర్ లో రిలీజై ఫ్లాఫ్ లేదా హిట్ అయిన సినిమాలకు ఓటిటిలలో జనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తుంటే దడ పుట్టేలా ఉంటుంది. థియేటర్ లో బాగున్న సినిమాని సైతం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతీ చిన్న సీన్, ఫ్రేమ్, ఎమోషన్‌ను నిశితంగా పరిశీలించి లోపాలు వెతికి మరీ కామెంట్స్ చేస్తున్నారు. కల్కి,భారతీయుడు 2 కు ఇప్పుడు అదే పరిస్దితి ఎదురైంది.

వాస్తవానికి ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టై వెయ్యి కోట్లు పైగా తెచ్చిపెట్టింది. నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. గత రెండు నెలలుగా జనం కల్కి సినిమా గురించే మాట్లాడుకున్నారు. తెగ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఓటిటిల్లోకి వచ్చింది. జనాలు ఒకటికి రెండు సార్లు ప్రతీ షాట్ అపి మరీ చూస్తున్నారు. అక్కడితో ఆగకుండా దాన్ని విశ్లేషించటం మొదలెట్టారు. అప్పుడు థియేటర్లలో మెచ్చుకుని సూపర్ హిట్ చేసిన జనమే ... ఇప్పుడు ఓటీటీలో కల్కి సినిమాను ట్రోల్ చేయటం మొదలెట్టారు. నార్త్ బ్యాచ్ అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు.

కథ లేదని కొందరు, ప్రబాస్ సినిమాలో ఏమి చేయలేదని మరికొందరు, ఫస్టాఫ్ బాగా బోర్ గా ఉందని ఇలా వరస పెట్టి రివ్యూలు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనిస్ట్రాలో పోస్ట్ చేసేస్తున్నారు. థియేటర్ లో నచ్చిన సినిమా ఓటిటిలలో ఎందుకు ఎక్కడటం లేదనేదే మేకర్స్ కే కాదు అభిమానులకు అర్దం కావటం లేదు. గతంలో ప్రభాస్ సినిమా సలార్ కు ఇదే పరిస్దితి ఎదురైంది. ఏమీ లేని సినిమాని హైప్ చేసారంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు కల్కికి అదే పరిస్దితి ఎదురౌతోంది.

నార్త్ బ్యాచ్ వాళ్లు అయితే కల్కి సినిమాలో ప్రభాస్ క్లిప్స్ కట్ చేసి ఇదేం కామెడీ అంటూ వైరల్ చేస్తున్నారు. అర్షద్ వర్శి అభిమానులు అయితే ఇక ప్రభాస్ హెయిర్ స్టయిల్, గడ్డంపై దారుణంగా కామెంట్స్ మొదలెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ సినిమా పరిస్దితి. ఇక థియేటర్ లో డిజాస్టర్ అయిన భారతీయుడు 2 సినిమా గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. దారుణమైన ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది.

భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్ వింత వింత గెటప్పుల్లో కనిపించాడు. థియేటర్లో చూసినప్పుడు అసలు ఈ సినిమాను ఎందుకు ఇలా తీశాడని అంతా తలపట్టుకున్నారు. ఒకప్పుడు క్లాసిక్‌గా నిలిచిన చిత్రానికి సీక్వెల్ తీసి పరువు పోగొట్టుకున్నారంటూ అంతా ట్రోలింగ్ చేశారు. కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఇలాంటి ప్రొడక్ట్ రావడంతో అంతా నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో ట్రోలింగ్ తీవ్రమైంది.

ఎంతో గొప్పగా అనిపించాల్సిన కమల్ హాసన్ నటన, గెటప్స్‌ ఇలా ఉన్నాయేంటని కామెడీ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఓటిటీ రిజల్ట్ ఏమిటీ అంటే ఇండియన్ 2 అనేది ఓ పరమ నాసిరకమైన ప్రొడక్ట్‌గా జనాలు తేల్చి పడేయటమే. కమల్ హాసన్ తెరపై విలన్లను చంపే తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో వీడియోలు కట్ చేసి మరీ వదులుతున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా మెప్పించేలా తెరకెక్కించలేకపోయాడు శంకర్. ఓటీటీలో అలా సినిమా రావడం ఆలస్యం.. ఇలా డీటైల్డ్‌గా సినిమాను పోస్ట్ మార్టం చేయటం మొదలెట్టేసారు నెటిజన్లు.

మరీ ముఖ్యంగా సిద్దార్థ్ సీన్లను, కమల్ హాసన్ విలన్లను చంపే సీన్లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంటూ సిద్దార్థ్ చెప్పే సిల్లీ సీన్, డైలాగ్‌ను చూసి జనాలు కామెడీ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.

ఇంతకు ముందు భోళా శంకర్ కు మాత్రమే కాకుండా సూపర్ హిట్ వాల్తేరు వీరయ్య కు సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు వచ్చాయి. ఇప్పుడు ఆగస్ట్ 15 కు రిలీజైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రెండు త్వరలో ఓటిటిలో రిలీజ్ అవుతాయి. అవీ ఇలాగే ట్రోలింగ్ కు గురి అవుతాయనే సందేహం ఉంది. సినిమా పోయిందని అసలే బాధపడుతూంటే మరో ప్రక్క ఓటిటిలో రిలీజ్ అయ్యినప్పుడు ఇలాంటి ట్రోలింగ్ తో పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. అలాగే హిట్ సినిమాకు సైతం ట్రోలింగ్ వస్తూండటంతో ...ఆ ఆనందం ఆవిరైపోతోంది. అలాగని సోషల్ మీడియాలో ఫలానా పోస్ట్ పెట్టద్దు, ఫలానా సినిమాపై కామెంట్ చేయద్దు అని అనలేరు.

ఇక ఇలా ట్రోలింగ్ తో సీక్వెల్స్ ఉంటే కనుక వాటి మీద క్రేజ్ కూడా తగ్గుతుంది. ఆ హీరోలు లేదా నిర్మాతల తదుపరి సినిమాల బిజినెస్ ల మీద ఇంపాక్ట్ ఉంటుందని ట్రేడ్ అంటోంది. ఏదైమైనా కేవలం థియేటర్ జనాలను మెప్పించటం మాత్రమే కాదు ..ఓటిటి జనాలను కూడా మెప్పించేలా స్క్రిప్టు, మేకింగ్ చేయాల్సిన పరిస్దితి క్రియేట్ అవుతోందనేది నిజం.

మొత్తమ్మీద ఓటీటీలోకి వచ్చిన సినిమాలను ఎంజాయ్ చేయడం మానేసి, అచ్చంగా ఇలా ట్రోలింగ్ చేయడం కోసమే చూడాలనుకోవటం , వాడుకోవడం బాధాకరం.

Read More
Next Story