ఇప్పటికీ ఖరీదైన పాట ఇదే...
x

ఇప్పటికీ ఖరీదైన పాట ఇదే...

సినిమాకు పాట అయువు పట్టు. అందుకే పాటల చిత్రీకరణ మీద డబ్బు వెదజల్లుతారు. ఖర్చుకు వెనకాడరు. దీనికి సాక్ష్యం ‘ప్యార్ కియాతో డర్నా క్యా హై’బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన " మొఘల్ ఏ ఆజం"(1960) సినిమా గురించి తెలియని వాళ్ళు ఉండరు. సినిమా మొత్తం ఒక ఎత్తు. "ప్యార్ కియా తో డర్నా క్యా" అనే పాట ఒక ఎత్తు. ప్రేమిస్తే భయమెందుకు? అని అర్థం వచ్చే ఈ పాట, 1960లో కోటిన్నర రూపాయల బడ్జెట్ తో తీసిన అత్యంత ఖరీదైన సినిమాలోని ఖరీదైన పాట ఇది. మూడు నుంచి ఐదు లక్షల్లో ఓ సినిమా తీసే కాలంలో ఒక్క పాటకు దాదాపు 15 లక్షల దాకా (ఇప్పటి లెక్క ప్రకారం 22 కోట్లు) ఖర్చు పెట్టడం విశేషం.

ఈ పాట ఫైనాన్షియర్లకు వెన్నులో వణుకు పుట్టించింది కూడా. కారణం దీనికి ఖర్చుపెట్టిన డబ్బు మాత్రమే కాదు, ఈ పాట చిత్రీకరణ కు తీసుకున్న సమయం కూడా. దానికి కారణం పర్ఫెక్షన్ అంటే పడి చచ్చే దర్శకుడు కె.అసిఫ్ అని పరిశ్రమలో పిలిచే కరీం అసిఫ్. 150 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 35 అడుగుల ఎత్తు తో ఒక హాలు సెట్ ను ను ఈ పాట కోసం నిర్మించారు. దీనికి స్ఫూర్తి లాహోర్లోని "శీష్ మహల్" అనే అద్దాల భవంతి . వేల సంఖ్యలో బెల్జియం అద్దాలను పైకప్పుకి అమర్చడం కోసం ఫిరోజాబాద్ లో అద్దాలను ఆ విధంగా అమర్చడంలో ప్రావీణ్యం కలిగిన చాలామంది కళాకారులు ఎంతో శ్రమించి పని పూర్తి చేశారు. దీనికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.అప్పట్లో ప్రముఖ గీత రచయిత షకిల్ బదాయుని ఈ పాటని రాసి ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్ కు చూపిస్తే అది ఆయనకి నచ్చలేదు. మళ్ళీ ఇంకోసారి రాయమన్నాడు. అది నచ్చలేదు.105 సార్లు దాన్ని తిరగరాశారు. చివరికి నౌషాద్ ఇంట్లో కూర్చొని ఒక రోజంతా చర్చ చేసిన తర్వాత, ఒక పాట ఆయనకి నచ్చింది. అది కూడా నౌషాద్ కు ఉత్తర ప్రదేశ్ లోని ఒక జానపద గీతం "ప్రేమ్ కియా... క్యా చోరీకి కియా క్యా" గుర్తుకు రావడం వల్ల. చివరిగా బతుకు జీవుడా అని షకిల్ బదాయుని పాటను గజల్ గా మార్చి రాశాడు. ఆ తర్వాత రికార్డింగ్ జరిగింది

అంతకన్నా ముందు ఇంకో కథ ఉంది. ఈ సినిమా నిర్మాత కె.అసిఫ్ ఓ సూట్ కేస్ నిండా డబ్బులు తీసుకొచ్చి నౌషాద్ కి ఇచ్చి " ఒక గొప్ప పాట ఇవ్వు " అని చెప్పాడట. దాంతో నౌషాద్ కు కోపం వచ్చి
అ డబ్బులను కిటికీలోనుంచి విసిరేశాడు.చివరిక్ ఆయన భార్య సర్ది చెప్పటం, నిర్మాత ఆసిఫ్ క్షమాపణ చెప్పటంతో నౌషాద్ మెత్తబడి సంగీతం సమకూర్చటం జరిగింది.

ఈ పాటలో ఇంకొక విశేషం ఉంది. బడే గులాం అలీ ఖాన్, ఈ పాటకు ముందు వచ్చే ఇంట్రడక్షన్ లో పాడడం జరిగింది. అయితే ముందు గులాం అలీ ఖాన్ అలా పడడానికి నిరాకరించాడు. ఆసిఫ్ కరీం బతిమలాడగా చివరకు ఒప్పుకున్నాడు కానీ ఆ పాటకు 25 వేల(ఇప్పటి లెక్కలో 25 లక్షలు) రూపాయలు ఇవ్వమని అడిగాడు. లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ లాంటి గాయకులు 300 నుండి 500 వరకు పారితోషికం తీసుకుంటున్న కాలంలో, అంత భారీ స్థాయిలో బడే గులాం అలీ ఖాన్ డిమాండ్ చేసినప్పటికీ ఆసిఫ్ ఆ మొత్తం చెల్లించాడు. తర్వాత బడే గులాం అలీ ఖాన్ సినిమాలో ఇంకో పాట కూడా పాడాడు.

"యమన్" రాగంలో స్వరపరిచి లతా మంగేష్కర్ పాడిన ఈ పాట చరిత్ర లో చిరస్థాయిగా నిలబడిపోయింది అన్నది అందరికీ తెలుసు.లతా మంగేష్కర్ ఉర్దూ ఉచ్చారణ కోసం శిక్షణ తీసుకున్న తర్వాత పాడిన మొదటి పాట అది.

లతా మంగేష్కర్ ఈ పాట పాడేటప్పుడు కొంత భాగం బాత్రూంలో పాడిందని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే లతా మంగేష్కర్ అది నిజం కాదని తర్వాత చెప్పింది. అయితే అప్పట్లో పాటలో "ఎకో"(ప్రతిధ్వని) ఎఫెక్ట్ కోసం కష్టపడాల్సి వచ్చేది. అప్పటికి ఇంకా సౌండ్ ఇంజనీర్లు ఈ ప్రక్రియను సాంకేతికంగా అభివృద్ధి చేయలేదు. అందుకే లతా మంగేష్కర్ పాటలు కొంత భాగాన్ని ఒక రూమ్ లో పాడి, మరికొంత భాగాన్ని హాల్లో పాడుతూ చివరికి రికార్డింగ్ రూంలో పాట ముగించింది. దాంతో ఈ పాట అజరామరమైన పాటగా మారింది.

" ఈ పాట పాడినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని లతా మంగేష్కర్ చెప్పడం విశేషం.

చిత్రీకరణకు రెండు సంవత్సరాలు పట్టినప్పటికీ ఈ పాట చరిత్ర సృష్టించింది. కేవలం ఈ పాట కోసమే పదేపదే సినిమా చూసిన వారు కూడా ఉన్నారు. BBC ఏషియన్ నెట్వర్క్ శ్రోతలు(ఓటింగ్ ద్వారా) ఎన్నుకున్న 20 అత్యుత్తమ బాలీవుడ్ పాటల్లో ఇది చోటు చేసుకుంది.


Read More
Next Story