టాలీవుడ్ లాస్ట్ అండ్ ఫౌండ్ 2025
x

టాలీవుడ్ 'లాస్ట్ అండ్ ఫౌండ్' 2025

వందల కోట్లు వచ్చాయి.. కానీ క్రెడిట్ పోయింది!


2025 సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక విచిత్రమైన మైలురాయిగా నిలిచిపోనుంది. వెయ్యి కోట్లు, రెండు వేల కోట్ల వసూళ్లు ఒకవైపు పలకరిస్తున్నా.. టాలీవుడ్ మేధావి వర్గం మరియు సినీ విశ్లేషకులను ఒక ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది.

అదే.. "మన దర్శకులకు ఈ ఏడాది ఏం మిగిల్చింది?" కొందరు భారీ విజయాలను అందుకున్నా తమ పాత రికార్డులను దాటలేకపోయారు, మరికొందరు భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డారు. 2025లో ఏమీ సాధించలేకపోయిన, లేదా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు.

ఓ రకంగా చెప్పాలంటే ...2025 టాలీవుడ్‌కు ఒక కష్టమైన గుణపాఠం నేర్పింది. కేవలం స్టార్స్ కే కాదు, మన అగ్ర దర్శకులకు కూడా ఈ ఏడాది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. భారీ బడ్జెట్‌లు, స్టార్ కాస్టింగ్, క్రేజీ సీక్వెల్స్‌.. ఇలా అన్నీ ఉన్నా, 'కంటెంట్' లో బలం లేకపోతే ప్రేక్షకులు ఎంతటి వారినైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారని ఈ ఏడాది నిరూపితమైంది.

కొందరు ఎంతో పెద్ద హోప్ తో బరిలోకి దిగి, క్రేజ్ క్రియేట్ చేసిన డైరెక్టర్లు బాక్సాఫీస్ వద్ద చతికిలబడితే, మరికొందరు యావరేజ్ మార్కులతో సరిపెట్టుకున్నారు. మొత్తానికి, 2025 ముగిసే సమయానికి తమ క్రేజ్‌ను పెంచుకోలేక, ఉన్న ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసుకున్న 10 మంది దర్శకుల గురించి చూద్దాం:

1. సందీప్ రాజ్ – మోగ్లీ (Mowgli)

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా 'కలర్ ఫోటో' తర్వాత సందీప్ రాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'మోగ్లీ'పై భారీ అంచనాలు ఉండేవి. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. బలహీనమైన రాత, ఆకట్టుకోని కథనం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాకు అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయారు. సందీప్ తన డైరెక్షన్, రైటింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2. బోయపాటి శ్రీను – అఖండ 2 (Akhanda 2)

'అఖండ' లాంటి భారీ హిట్ తర్వాత వచ్చిన సీక్వెల్ ఇది. కానీ, బోయపాటి పాత ఫార్ములా ఈసారి బెడిసికొట్టింది. విపరీతమైన యాక్షన్, అర్థం లేని స్పీచ్‌లు, నాసిరకం VFX, బలహీనమైన విలన్లు.. వెరసి 'అఖండ 2' ఒక విసుగు పుట్టించే సినిమాగా మిగిలిపోయింది. బోయపాటి తన మేకింగ్ స్టైల్‌ను అప్డేట్ చేసుకోకపోతే కష్టమే!

3. మహేష్ బాబు – ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka)

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి డీసెంట్ హిట్ తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రమోషన్లలో వైఫల్యం, ఆసక్తి లేని ప్లాట్ వల్ల ఆడియన్స్ థియేటర్లకు రాలేదు.

4. నీరజ కోన – తెలుసు కదా (Telusu Kada)

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. ఫెమినిజం, సెన్సిటివ్ ఇష్యూస్ గురించి చెప్పాలనుకున్న ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. పరిణతి లేని కథనం, గందరగోళమైన పాత్రల వల్ల ఈ సినిమా టాక్సిక్ (Toxic) గా అనిపించిందే తప్ప, అనుకున్న సందేశాన్ని ఇవ్వలేకపోయింది.

5. క్రిష్ జాగర్లమూడి – ఘాటి (Ghaati)

ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఇదొకటి. అనుష్క వంటి స్టార్ ఉన్నా, క్రిష్ ఒక రొటీన్ రివెంజ్ డ్రామాను అందించారు. కథలో ఎమోషన్ లేకపోవడం, కేవలం అరుపులు, గోలలతో సినిమాను లాగించడం వల్ల ప్రేక్షకులు దీనిని తిరస్కరించారు. క్రిష్ మార్క్ మ్యాజిక్ ఇందులో అస్సలు కనిపించలేదు.

6. గౌతమ్ తిన్ననూరి – కింగ్డమ్ (Kingdom)

'జెర్సీ' వంటి క్లాసిక్ ఇచ్చిన గౌతమ్ నుంచి వచ్చిన 'కింగ్డమ్' పెను నిరాశను మిగిల్చింది. సాగదీసిన కథనం, పస లేని ఎమోషన్స్, కొత్తదనం లేని రైటింగ్ వల్ల సినిమా బోర్ కొట్టించింది. జెర్సీ రేంజ్ ఎమోషన్ ను ఆశించిన ప్రేక్షకులకు ఇది ఒక సోల్-లెస్ (జీవం లేని) మూవీలా అనిపించింది.

7. ప్రవీణ్ కండ్రేగుల – శుభం & పరదా (Subham & Paradha)

ప్రవీణ్ ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చారు. 'శుభం'లో హ్యూమర్ ఉన్నా సాగదీసినట్టు అనిపించింది. ఇక 'పరదా'లో ఒక మంచి ప్రోగ్రెసివ్ ఐడియా ఉన్నా, దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యారు. ప్రవీణ్ లో టాలెంట్ ఉన్నా, కథను నడిపించడంలో పట్టు కోల్పోయారు.

8. శైలేష్ కొలను – హిట్: ది థర్డ్ కేస్ (HIT 3)

'సైంధవ్' ఫ్లాప్ తర్వాత శైలేష్ కు 'హిట్ 3' చాలా కీలకంగా మారింది. సినిమా కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా, దర్శకుడిగా శైలేష్ కు ఏమీ కలిసి రాలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో, ఎమోషనల్ వెయిట్ చూపించడంలో శైలేష్ తడబడ్డారు.

9. కళ్యాణ్ శంకర్ – మ్యాడ్ స్క్వేర్ (Mad Square)

'మ్యాడ్' సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్కడక్కడా నవ్వించినా, కథలో పస లేకపోవడంతో సాగదీసినట్టు అనిపించింది. మొదటి భాగంలోని ఫ్రెష్ నెస్ ఇందులో కనిపించలేదు. ఈ సినిమా వల్ల కళ్యాణ్ కెరీర్ కు ఒరిగిందేమీ లేదు.

10. చందూ మొండేటి – తండేల్ (Thandel)

'కార్తికేయ 2' తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూకు 'తండేల్' ఒక చేదు అనుభవం. మంచి బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నా.. సెకండ్ హాఫ్ లో కథా గమనం దెబ్బతింది. అద్భుతమైన విజువల్స్ ఉన్నా, కథలో బలం లేకపోవడంతో ఇది ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది.

ఏదైమైనా...

స్ట్రాంగ్ ఉండే స్క్రిప్టు, రైటింగ్ , స్పష్టమైన విజన్ లేకపోతే ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా పతనం తప్పదని 2025 నిరూపించింది. కొందరికి ఇది కేవలం ఒక నిరాశాజనక ఏడాది అయితే, మరికొందరికి తమ కెరీర్‌ను మళ్ళీ మొదటి నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది.

Read More
Next Story