‘భారతీయుడు 2’ రిలీజ్ ఆపాలని కోర్టులో పిటిషన్
x

‘భారతీయుడు 2’ రిలీజ్ ఆపాలని కోర్టులో పిటిషన్

రిలీజ్ కు మరికొద్ది గంటలే ఉన్న టైమ్ లో ‘భారతీయుడు 2’ చిత్రానికి లీగల్ సమస్య ఎదురైంది.


కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ (Bharateeyudu). దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కు మరికొద్ది గంటలే ఉన్న టైమ్ లో ‘భారతీయుడు 2’ చిత్రానికి లీగల్ సమస్య ఎదురైంది.

ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్‌ రాజేంద్రన్‌ (Aasaan Rajendran) మధురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ సినిమాలో వినియోగించారని.. థియేటర్‌, ఓటీటీలోనూ రిలీజ్‌ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందించాలని ‘భారతీయుడు 2’ చిత్ర టీమ్ కి మరికొంత సమయం ఇస్తూ కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్‌ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివి స్ఫూర్తి పొందిన దర్శకుడు శంకర్‌ ‘భారతీయుడు’లో మర్మకళకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌ కు రాజేంద్రన్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ వినియోగించుకున్నారనేది రాజేంద్రన్‌ వాదన.

Read More
Next Story