శ్రీదేవి మృతి కేసు ఇప్పుడెందుకు తెర పైకి వచ్చింది?
x
sridevi

శ్రీదేవి మృతి కేసు ఇప్పుడెందుకు తెర పైకి వచ్చింది?

భూలోక సుందరి శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ ఎలియాస్ శ్రీదేవి చనిపోయి ఫిబ్రవరి24వ తేదీకి ఐదేళ్లు దాటి ఆరో ఏడు వస్తుంది. అయినా ఆమె మరణం ఇంకా వీడని మిస్టరీయే.


భూలోక సుందరి శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ ఎలియాస్ శ్రీదేవి చనిపోయి ఫిబ్రవరి24వ తేదీకి ఐదేళ్లు దాటి ఆరో ఏడు వస్తుంది. అయినా ఆమె మరణం ఇంకా మిస్టరీయే. ఆమె దుబాయ్ లో ఎలా చనిపోయిందో, ఎందుకు చనిపోయిందా ఇప్పటికీ సస్పెన్సే. సీబీఐ రంగంలోకి దిగినా ఆ మిస్టరీ వీడలేదు. వదంతులు ఆగలేదు. తాజాగా ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలను సృష్టించారనే ఆరోపణపై ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి.ఆర్‌.పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. శ్రీదేవి మృతిపై అనేత అనుమానాలను లేవనెత్తుతూ దీప్తి సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు.

సొంత విచారణ చేశానంటున్న దీప్తి...

దీప్తి భువనేశ్వర్ కు చెందిన ఓ బ్లాగర్. యూట్యూబర్. పేరు కోసం, ప్రచారం కోసం చేసిందా లేక నిజంగానే ఆమె దర్యాప్తు చేశారో తెలియదు. ఇప్పుడు ఏకంగా సీబీఐ చార్జిషీట్ దాఖలైంది. అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆమె చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. శ్రీదేవి మరణంపై సొంతంగా విచారణ జరిపానని, అందులో యూఏఈ, భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచాయంటున్నారు దీప్తి. తన వాదనలకు మద్దతుగా ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలను చూపుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లునూ చూపిస్తున్నారు. యూ ట్యూబర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె వీటిని చూపిస్తూ వచ్చారు.

ముంబై న్యాయవాది ఫిర్యాదు...

దీప్తి చూపినవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబయికి చెందిన న్యాయవాది చాందినీ షా.. సీబీఐని ఆశ్రయించారు. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు. దీనిపై రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు జరిపింది. దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. దీనిపై దీప్తి స్పందిస్తూ.. ‘‘నా వాంగ్మూలం నమోదు చేయకుండా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణం’’ అన్నారు. కేసు ఏ వైపు మలుపుతిరుగుతుందో చూడాలి.

శ్రీదేవి ఎలా మరణించారంటే...

2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలోని ఓ స్టార్ హోటల్లో మరణించారు. తమిళనాడు శివకాశి సమీపంలోని మీనంపట్టిలో 1963 ఆగస్టు 13న పుట్టిన శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ మంచి లాయర్. తల్లి గృహిణి. తల్లి రాజేశ్వరి స్వస్థలం తిరుపతి కావడంతో శ్రీదేవికి అటు తమిళం ఇటు తెలుగు రెండు భాషలు చిన్నప్పటి నుంచే వచ్చాయి. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూలుకి, కాలేజీకి వెళ్లకపోయినా నేరుగా వెళ్లి ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. బాలనటిగా, సినీ హీరోయిన్ గా ఉర్రూతలూపింది. సినీ ధ్యాస తప్ప మరేదీ లేకపోవడంతో బాల్యం ఎలా గడించిందో కూడా తెలియలేదని చెప్పేవారు శ్రీదేవి. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. సినిమాల్లోకి వచ్చాక పెట్టుకున్న పేరు శ్రీదేవి. పుట్టిన ఐదేళ్లకే ఆమె బాలనటి అయ్యారు. 40 ఏళ్లు వచ్చేపాటికే గత వందేళ్లలో ఎవరికీ రానంత కీర్తిని సంపాయించారు. మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ ఫిలిం అవార్డు అందుకున్న మహానటి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లోని జుమేర్హా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లోని గదిలోని వాటర్ టబ్ లో ఆమె మునిగి చనిపోయినట్టు కనుగొన్నారు. ఆమె మరణంపై ఆనాడు చాలా అనుమానాలు వచ్చాయి. చనిపోయిన సమయంలో ఆమె భర్త, సినీ నిర్మాత బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్ కూడా ఉన్నారు.

కుదిపేసిన మరణ వార్త..

శ్రీదేవి మరణ వార్త దేశాన్ని కుదిపేసింది. ఆమెది సహజమరణం కాదంటూ నెటిజెన్లు హోరెత్తించారు. బూటకమని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె నిజంగానే చనిపోయిందని ఆమె బావ సంజయ్ కపూర్ ధృవీకరించారు. ఆమె అభిమానులు, సహనటులు, బాలీవుడ్ తారలు మరణానికి ప్రగాడ సంతాపం తెలిపారు. కొన్ని రోజుల పోలీసు విచారణ తర్వాత ఫిబ్రవరి 27న శ్రీదేవి కేసును మూసివేశారు. ఫిబ్రవరి 28న ముంబైలోని విలే పార్లే సేవా సమాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఈ కేసు తెరపైకి వచ్చింది. సీబీఐ రంగంలోకి దిగి చార్జిషీట్లు దాఖలు చేసింది.

Read More
Next Story