శ్రీకాంత్ కొడుకు ఛాంపియన్ మూవీ రివ్యూ
x

శ్రీకాంత్ కొడుకు 'ఛాంపియన్' మూవీ రివ్యూ

తెలంగాణ చరిత్రను తెరపైకి తెచ్చిన ప్రయత్నం

హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలిసే ముందు నడిచిన అల్లకల్లోల సమయం అది. నిజాం పాలనలో రజాకార్లు అరాచకం, ఆ భయాలతో వాతావరణం నిండిపోయి ఉంటుంది. సికింద్రాబాద్‌కు చెందిన యంగ్ ఫుట్‌బాలర్ మైఖేల్ విలియమ్స్ (రోషన్) ఓ బేకరీలో పనిచేస్తూంటాడు. అతని జీవితంలో ఏకైక కల – ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆడటం. కానీ అతని తండ్రి జార్జ్‌పై బ్రిటిష్‌లకు ద్రోహం చేశాడన్న ఆరోపణలతో మైఖేల్ వీసా తిరస్కరణకు గురి అవుతుంది. అతని భవిష్యత్తునే చీకట్లోకి నెట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.

దాంతో ఆ కలను వదులుకోలేక, అడ్డ దారిలో అయినా ఇంగ్లాండు వెళ్లాలని డబ్బు కోసం సికింద్రాబాద్ నుంచి ఆయుధాలను అక్రమంగా తరలించే ప్రమాదకర ఒప్పందానికి మైఖేల్ ఒప్పుకుంటాడు. ఆ ప్రయాణంలోనే స్నేహితుడు షబీర్‌తో కలిసి అనుకోకుండా భైరన్‌పల్లి గ్రామంలో అడుగుపెడతాడు. కానీ ఇది సాధారణ గ్రామం కాదు. రజాకార్లకు ఎదురు తిరుగుతున్న తిరుగుబాటుకు ఇది కేంద్రబిందువు. రాజీ రెడ్డి (కల్యాణ్ చక్రవర్తి) నేతృత్వంలో, సుందరయ్య (మురళీ శర్మ) ఆలోచనలతో ఊపిరి పీల్చుకుంటున్న ఉద్యమం అక్కడ నడుస్తోంది.

అక్కడే మైఖేల్ జీవితాన్ని మార్చే మరో మలుపు. గ్రామస్తుల కోసం నాటకాలు రాసి, దర్శకత్వం వహించే చంద్రకళ (అనస్వర రాజన్)తో పరిచయం. మాటల్లో స్నేహం, చూపుల్లో భావం… నెమ్మదిగా ప్రేమ మొలకెత్తుతుంది. కానీ ఇది కేవలం ప్రేమ కథ కాదు. అనుకోకండా ఆ గ్రామంలోకి వచ్చిన మైఖేల్, క్రమంగా ఆ పోరాటానికి అర్థం కనుగొంటాడు. తన కలలకే పరిమితమైన జీవితం నుంచి, సమూహ బాధ్యతను గుర్తించే మనిషిగా మారతాడు.ఆ ఊరికి బయటి వ్యక్తిగా అడుగుపెట్టిన మైఖేల్… చివరకు ఉద్యమంలో భాగమయ్యే ప్రయాణమే ‘ఛాంపియన్‌’. ఆ క్రమంలో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. చివరకు మైఖేల్ తన లక్ష్యాన్ని సాధించాడా...తిరుగుబాట్లు, ఉద్యమాలతో రగిలిపోతున్న భైరన్‌పల్లి గ్రామానికి అతనేం సాయిం చేసాడు. చంద్రకళ తో అతని ప్రేమ కథ ఎంతవరకూ వచ్చింది విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

తెలంగాణ సాయుధ పోరాటం, ముఖ్యంగా రజాకార్ల అఘాయిత్యాలకు ఎదురు నిలిచిన భైరన్‌పల్లి తిరుగుబాటు – ఇది సినిమాల పరంగా చాలా అరుదుగా టచ్ చేసిన అంశం. చరిత్రలో ఉన్న నైతిక ఆగ్రహం, మానవీయ ధైర్యం, సమూహ త్యాగం అన్నీ చాలా పవర్‌ఫుల్ డ్రామాటిక్ ఎలిమెంట్స్. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ కథను ఓ డాక్యుమెంటరీలా కాకుండా, ఒక వ్యక్తి మార్పు (Transformation) ద్వారా చెప్పాలని ప్రయత్నించారు. ఇది సరైన ఆలోచనే. ఎందుకంటే చరిత్రను ప్రేక్షకుడు అర్థం చేసుకోవడం కన్నా అనుభవించడం ముఖ్యం కాబట్టి. అక్కడి దాకా దర్శకుడు సక్సస్సే.

దాంతో స్క్రీన్‌ప్లే పరంగా “ఛాంపియన్‌” పూర్తిగా Outsider / Reluctant Hero Arc మీద నడిపారు. అయితే ఈ ఫార్మాట్ ఏమీ కొత్తది కాదు. ప్రపంచ సినిమాల్లో ఇది ఎన్నోసార్లు వాడబడిందే – ముఖ్యంగా Akira Kurosawa’s “Seven Samurai” లో స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ రెండు సినిమాలకు ముఖ్యమైన తేడా ఏంటంటే: Seven Samurai లో గ్రామస్తులే యోధులను కోరుకుని రప్పించుకుంటారు. Champion లో మైఖేల్ యాదృచ్ఛికంగా అక్కడికి వస్తాడు ఈ యాదృచ్ఛిక ప్రవేశం కథకు సహజత్వం ఇస్తుంది. కానీ అదే సమయంలో ఒక ప్రమాదం కూడా ఉంది –అతని నిర్ణయాలు “కథ అవసరం వల్ల” జరిగాయా? లేక “పాత్ర అంతర్గత సంఘర్షణ వల్ల” జరిగాయా? అన్న ప్రశ్న మొదలవుతుంది.

ఇక ఈ సినిమాకు కీలకమైన మైఖేల్ క్యారెక్టర్ – థీమాటిక్ గా బలమైనది, డ్రామాటిక్ గా తక్కువ ప్రెషర్ తో ఉంది. మైఖేల్ క్యారెక్టర్ ఫిలాసఫికల్‌గా చాలా క్లియర్. అతని ఆర్క్ బాగానే ఉంది. కానీ స్క్రిప్టులో సమస్య ఏంటంటే: ఈ మార్పు ఇంటర్నల్‌గా జరుగుతుంది , కానీ దానికి సరైన డ్రామాటిక్ ట్రిగ్గర్స్ కొద్దిగా అండర్‌ప్లేడ్‌గా ఉంటాయి. దాంతో చూసే ప్రేక్షకుడు అనుభూతి చెందటం కష్టమైపోతుంది.

దీనికి తోడు ఈ కథకు హార్ట్ బీట్ లాంటి ఎలిమెంట్ భైరన్‌పల్లి తిరుగుబాటు, కానీ స్క్రీన్‌ప్లేలో అక్కడికి చేరుకునేసరికి చాలా ఆలస్యం అవుతుంది. దాంతో కథలో అసలైన కాంప్లిక్ట్స్ ప్రవేశించేసరికి సమయం చాలా అయ్యిపోతుంది. ఫలితం: ప్రేక్షకుడు కథతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఓపిక చూపించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఇది పెద్ద రిస్క్. ఏదైమైనా “ఈ కథలో కావాల్సినంత డ్రామా ఉంది… కానీ కథనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది.” ఇది చాలదన్నట్లు ఈ సినిమాకు పేసింగ్ సమస్య. కథలో ఎక్కడా Urgency లేకపోవడం. దాంతో ప్రెడిక్టబుల్ గా మారిపోయింది.

టెక్నికల్ గా ..

మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. “గిరా గిరా” పాటతో పాటు మిగతా పాటలు కూడా కథకు సరిపోయేలా ఉన్నాయి. తోట తరణి చేసిన ప్రొడక్షన్ డిజైన్ కాలాన్ని నిజంగా చూపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఆ కాలాన్ని మళ్లీ సృష్టించడంలో నిర్మాతలు మంచి ఖర్చే పెట్టినట్టు కనిపిస్తుంది.

కానీ ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉంటే సినిమా పేస్ బాగా నిలబడేది. అలాగే దర్శకుడు తీసుకున్న కొన్ని చారిత్రక మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛలు తెలంగాణ చరిత్రను ప్రేమించే కొందరికి నచ్చకపోవచ్చు.

నటీనటుల్లో ...

రోషన్ స్క్రీన్‌పై బాగానే కనిపిస్తాడు. ప్రతి సీన్‌లో నిజాయితీగా ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అతని క్యారెక్టర్‌కు స్క్రిప్టులో ఇంకాస్త బలం ఉంటే, పెర్ఫార్మెన్స్ ఇంకా మెరుగ్గా ఉండేదనిపిస్తుంది. అనస్వర రాజన్ బాగానే చేసింది, కానీ ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు.

కళ్యాణ్ చక్రవర్తి పాత్ర కీలకమైనదే కానీ ఎమోషన్ అంతగా వర్క్ కాలేదు.

కేకే మీనన్, రణవీర్ షోరీ లాంటి నటులు ఉన్నా పాత్రలు డల్‌గా అనిపిస్తాయి.

నరేష్ పెద్దగా కనిపించడు.

ఫైనల్ థాట్...

హిస్టరీ vs కమర్షియల్ సినిమా – బ్యాలెన్స్ పూర్తిగా కుదరలేదు. దర్శకుడుగా, రచయితగా ప్రదీప్ చేసిన ప్రయత్నం నిజంగా గౌరవించదగినది. చరిత్రను వాడుకుని చౌక డ్రామా చేయలేదు కానీ కమర్షియల్ సినిమా అవసరమైన ఎమోషనల్ హుక్స్ , టైటైన స్క్రీన్‌ప్లే మాత్రం మిస్ అయ్యాయి. ఫలితం: చరిత్రకు న్యాయం, సినిమాకు అర్ధ న్యాయం, ప్రేక్షకుడుకి మరీ పావు న్యాయం

Read More
Next Story