
"కాస్టింగ్ కౌచ్‌కి కారణం మీరే".. బాంబు పేల్చిన చిరంజీవి!
షాక్‌లో టాలీవుడ్ !
సినీ ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్' (Casting Couch) అనేది ఎప్పుడూ ఒక మండుతున్న అగ్ని పర్వతమే. ఈ విషయమై ఇప్పటివరకు భాషకు, ప్రాంతానికి సంభందం లేకుండా ఎంతోమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు గొంతు విప్పారు. అయితే, తాజాగా టాలీవుడ్ పెద్ద దిక్కులాంటి మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లో జరిగిన మన శంకర్ వర ప్రసాద్ గారు (Mana Shankar Vara Prasad Garu) మూవీ సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. "సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది.. మీరు ఎలా ఉంటే అది అలాగే కనిపిస్తుంది" అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. "నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవడూ ఏమీ చేయలేడు!" అని తేల్చి చెప్పారు.
మెగాస్టార్ మాట్లాడుతూ..."ఇది చాలా గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఉన్నారని, మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ (చేదు అనుభవాలు) జరిగాయని అన్నారంటే గనుక.. అది వారి తప్పితమే అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
నువ్వు వృత్తి పట్ల సీరియస్‌గా ఉండి, స్ట్రిక్ట్‌గా ప్రవర్తిస్తే.. ఏ ఒక్కరు కూడా నిన్ను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమీ ఉండవండి.. అంతా నీ బిహేవియర్ (ప్రవర్తన) బట్టి ఉంటుంది" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
అలాగే సక్సెస్ గురించి మాట్లాడుతూ.. "అమ్మ పెట్టే అన్నం లాగే, సక్సెస్ అనేది ఎప్పుడూ బోర్ కొట్టదు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెషన్‌కు కట్టుబడి ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ఈ సందర్భంగా యువతకు భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియాలో రచ్చ!
మెగాస్టార్ వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. "చిరంజీవి గారు చెప్పింది వంద శాతం నిజం.. టాలెంట్ ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు" అని కొందరు అంటుంటే.. "ఇండస్ట్రీలో వేధింపులు ఉన్న మాట వాస్తవం కదా, దీన్ని బాధితుల తప్పే అని ఎలా అంటారు?" అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి, కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చేసిన ఈ 'బోల్డ్' కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. మరి దీనిపై మిగతా స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి!

