
భారత్ లో తొలిసారి సంపూర్ణ 'AI' సినిమా!
మనుషుల అవసరం ఉండదా?
గత వందేళ్లుగా సినిమా అంటే మనిషి మేధస్సు, శ్రమ, సృజనాత్మకత కలయిక. కానీ, ఇప్పుడు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ సమీకరణాన్ని మార్చేస్తోంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రతిఒక్కరూ AI వైపు ఆసక్తిగా, అదే సమయంలో కొంచెం భయంగానూ చూస్తున్నారు. ఈ నేపధ్యంలో నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాజేష్ మాపుస్కర్ ఒక సాహసోపేతమైన అడుగు వేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, పూర్తిగా AI సాంకేతికతతో రూపొందించిన 'చిరంజీవి హనుమాన్: ది ఎటర్నల్' అనే థియేట్రికల్ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.
హనుమాన్ జయంతికే రిలీజ్!
ఈ ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ AI నిర్మిత చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. మానవ శ్రమను AI భర్తీ చేస్తుందనే ఆందోళనల మధ్య ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకు రావడం ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నానని రాజేష్ మాపుస్కర్ పేర్కొన్నారు.
యానిమేషన్ కాదు.. AI ఒక 'సహ రచయిత'!
సంప్రదాయ యానిమేషన్ చిత్రాలకు, AI కి ఉన్న తేడాను ఆయన వివరించారు:
యానిమేషన్: ఇందులో పాత్రల కదలికలపై దర్శకుడికి పూర్తి నియంత్రణ ఉంటుంది.
AI సాంకేతికత: ఇది ఒక ఇంటరాక్టివ్ కొలాబరేటర్ (సహకారి) లా పనిచేస్తుంది. ఇది కొన్నిసార్లు ఊహించని విధంగా స్పందిస్తూ, మన ఊహకు అందని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
మరో మెదడుతో ప్రయాణం: AI తో పనిచేయడం అంటే మరో ఆలోచించే మెదడుతో కలిసి పనిచేసినట్లు ఉంటుందని ఆయన అన్నారు. ఇది మనం చెప్పినట్లుగా ఖచ్చితంగా వినకపోయినా, సంప్రదాయ పద్ధతుల్లో సాధించలేని రిజల్ట్స్‌తో మేకర్స్‌ను ఆశ్చర్యపరుస్తుంది.
ఉద్యోగాలకు ముప్పు ఉందా?
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలపై రాజేష్ క్లారిటీ ఇచ్చారు. AI మానవ సృజనాత్మకతను భర్తీ చేయలేదని, అది కేవలం పని వేగాన్ని పెంచి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయన నమ్ముతున్నారు. AI సరైన అవగాహనతో వాడితే, ఇది సృజనాత్మకతకు శత్రువు కాదు – సహాయకుడు.” అని అన్నారు. అంటే, ఇది ‘రిప్లేస్‌మెంట్’ కాదు… ‘రిఫార్మేషన్’ అని ఆయన భావన.
రాజేష్ మాట్లాడుతూ, “నా ఈ ‘చిరంజీవి హనుమాన్ – ది ఈటర్నల్’ ప్రాజెక్ట్‌లోనే 200 మందికి పైగా జనరేటివ్ టీమ్ ఉంది. ఇంకా ఎన్నో రంగాల్లో మానవ శ్రమ అవసరం. AI ఒంటరిగా సినిమా చేయలేదు” అన్నారు.
మహాభారతం వెబ్‌సిరీస్ వివాదం తర్వాత… ఈ సినిమా రిస్క్ అవుతుందా?
ఇటీవలే AIతో రూపొందించిన వెబ్ సిరీస్ ‘Mahabharat: Ek Dharmayudh’ తీవ్ర విమర్శలకు గురైంది. టెక్నికల్ తప్పిదాలు, కథనం లోపాలు… ఇవన్నీ “AI సృజనాత్మకతకు ప్రమాదమా?” అనే చర్చకు దారితీశాయి. అలాంటి నేపధ్యంలో, ఇప్పుడు ‘Chiranjeevi Hanuman: The Eternal’ ప్రేక్షకుల ముందుకు రావడం…ఇది ఒక సాహసమా? లేదా భారతీయ సినిమాకు కొత్త దిశ చూపే మైలురాయా? అనేది తేలాల్సి ఉంది.
ఈ క్రంలో AI వెబ్‌సిరీస్ ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ నుంచి తాను చాలా నేర్చుకున్నానని రాజేష్ చెప్పారు. “ఇలాంటి కొత్త టెక్నాలజీతో పని చేస్తున్నప్పుడు ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ చాలా ముఖ్యం. ఆ కామెంట్స్ నుంచే లోపాలు తెలుస్తాయి. అక్కడ ఎక్కడ తడబడ్డారో చూసి, వాటిని కరెక్ట్ చేసుకుని నా ‘చిరంజీవి హనుమాన్’ను తీర్చిదిద్దుతున్నాను” అని దర్శకుడు రాజేష్ మాపుస్కర్ తెలిపారు.
సినిమా కాదు… భవిష్యత్తుకు ఒక ప్రశ్న!
ఈ చిత్రం విజయం సాధిస్తే, భారతీయ సినిమా రంగంలో AI ఆధారిత కథనాలు, పాత్రల రూపకల్పన, విజువల్ డిజైన్ అన్నీ కొత్త దశలోకి అడుగుపెడతాయి. విఫలమైతే… “టెక్నాలజీ కళను మించిపోయిందా?” అనే ప్రశ్న మరింత బలపడే అవకాశం ఉంది.

