
టీనేజ్ లవ్ స్టోరీ : 'క్రష్డ్ ' సిరీస్ రివ్యూ!
ఇంతకీ 'క్రష్డ్ ' లో ఉన్న కంటెంట్ ఏమిటి? యూత్ కి ఎంత వరకూ నచ్చుతుంది?
పెద్ద తెరకి తీసుకురావాలంటే కాస్త ఆలోచించే కథలతో ఓటీటీలో ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి సక్సెస్ అవుతున్నాయి కూడా. ఎందుకంటే చూసే వాళ్లకు క్లారిటీగా తెలుసు. తాము ఓటీటీ ప్రేక్షకులమని, భారీదనం అక్కర్లేదని, అలాగే సినిమాటెక్ నేరేషన్ అవసరం లేదని. అలా స్టార్ లేకుండా కేవలం కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ అప్పుడప్పుడు కొందరు మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్‌లొచ్చాయి. అయితే వాటిలో సింహభాగం థ్రిల్లర్లే. యూత్ ని టార్గెట్ చేసుకుని కొన్ని కథలు చెప్పినా అందులోనూ సెక్స్, హింసకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా… ఓ యూత్ ఫుల్ … టీనేజ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే.. 'క్రష్ '. ఇంతకీ 'క్రష్ ' లో ఉన్న కంటెంట్ ఏమిటి? యూత్ కి ఎంత వరకూ నచ్చుతుంది?
స్టోరీ లైన్ ఏమిటి
లక్నో సెంట్రల్ కాన్వెంట్ స్కూల్ లో జరిగే ఈ కథలో సంవిధాన్ శర్మ ( రుద్రాక్ష జై స్వాల్) ఆద్య మాధుర్ ( ఆద్య ఆనంద్) ప్రతీక్ (నమన్ జైన్) జాస్మిన్ (ఉర్వి సింగ్) సాహిల్ (అర్జున్) ఫ్రెండ్స్. అక్కడే జాస్మిన్ ను మొదటి సారి చూసిన సంవిధాన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అయితే ఆమె పట్టించుకోదు. దీంతో జాస్మిన్ ఫ్రెండ్ ఆద్య కు లైన్ వేయడం మొదలెడతాడు.
ఆద్యను ఇంప్రెస్ చేయటానికి ఏమి కావాలి అని ఆలోచిస్తాడు. ఆమెకు కవితలు చదవడమన్నా .. రాయడమన్నా చాలా ఇష్టం అని తెలుసుకుంటాడు. కానీ సంవిధాన్ అవేమీ రావు. అప్పుడు కవితలు రాసే తన ఫ్రెండ్ సాహిల్ సాయం తీసుకుంటాడు. మిగతా స్నేహితులు కూడా తమకు తగ్గ అమ్మాయిలను లైన్ లో పెట్టే పోగ్రామ్ లో ఉంటారు.
ఇక ఓ టైమ్ లో సంవిధాన్ ప్రేమ కథ ఓ కొలిక్కి వచ్చిందనుకుంటాడు. అయితే ఆమె కవితలు రాసేది సాహిల్ అని, సంవిధాన్ కాదని తెలుసుకుంటుంది. అప్పుడు ఏమైంది. అసలు నిజం తెలిసిన ఆధ్య ప్రేమకు బ్రేకప్ చెప్పేసిందా, చివరకు ఈ ప్రేమ కథ ఏ తీరం చేరింది అనేది మిగతా కథ .
ఎలా ఉంది
సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే థ్రిల్లర్, క్రైమ్ కామెడీ జోనర్ లు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ఓటిటి మాధ్యమంలో ఎన్నో అందమైన ప్రేమకథలూ చెప్పొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు కొందరు. ఈ సీరిస్ లో చెప్పుకోవటానికి పెద్దగా కథేం లేదు. ఫ్రెండ్ షిప్, లవ్, చిన్న చిన్న ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ సీన్స్ నడుస్తుంటాయి. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపూ..మనకు శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ గుర్తొస్తుంది.
లేత వయసులో మనసులో జరిగే సంఘర్షణ, ఆకర్షణ.. ప్రేమ, ఫ్రెండ్ షిప్ లో చిన్న చిన్న అపార్థాలూ.. మళ్లీ కలిసిపోవడం – ఇదీ ఈ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ కదా అని మరీ ట్విస్ట్ లు ఇస్తూ, అవసరం లేకపోయినా సాగదీసేయ్యకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సరదా సంఘటనలు.. అల్లర్లతో హాయిగా సాగిపోయింది. ఇంట్రస్టింగ్ గానే ఉంది చివరి వరకూ చూసేయొచ్చు. యూత్ ఫుల్ కథ కదా అని రొమాన్స్ జోలికి పోకుండా నీట్ గానే కథ చెప్పాడు. అయితే మరింత ఎంటర్టైన్మెంట్ జోడించవచ్చు. ఏదైమైనా క్రష్డ్ అనే సిరీస్ హైస్కూల్ సమయంలో మొదటి ప్రేమ, సమస్యలు, క్రష్‌ల యొక్క సాధారణ కథను చెబుతుంది.
టెక్నికల్ గా
డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి కానీ అద్బుతంగా ఏమీ లేదు. కథ చాలా మామూలుగా ఉంటుంది, ముఖ్యంగా ఇది ఒక చిన్న టౌన్ లో సెట్ చేయబడింది. సీన్స్ సహజంగా ఉన్నాయి. నటీనటులు వారి అచ్చం హైస్కూల్ పిల్లల్లాగే కనిపిస్తారు.అనిపిస్తారు. ప్రతీ సీజన్ అరగంట నిడివితో ఉంటుంది, మీరు మీ ఆఫీసు బ్రేక్ సమయంలో లేదా మీ లంచ్‌లో మునిగిపోవడానికి స్నాక్ చేయదగిన కంటెంట్ కోసం చూస్తున్నప్పుడు ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.
చూడచ్చా
ఓ టీనేజీ లవ్ స్టోరీని చాలా క్యూట్ గా రాసుకుని,అసభ్యత లేకుండా ఫ్యామిలీ మొత్తం చూసేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. రన్ టైమ్ కూడా తక్కువే కాబట్టి.. హాయిగా చూసేయొచ్చు. అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చూసాక ..ఏమి చూసామా అని ఆలోచిస్తే ఏమీ చూడలేదనే అనిపిస్తుంది.
ఎక్కడ చూడచ్చు
క్రష్డ్ అనే చిన్న-సిరీస్ ఎపిసోడ్‌లు Amazon miniTVలో తెలుగులో ఉన్నాయి.