
కొరియన్ హారర్ ‘డార్క్ నన్స్’ మూవీ రివ్యూ
భయమా? లేక భావోద్వేగమా?
చర్చ్ మౌనంలో నడిచే రెండు నీడలు—సిస్టర్ జునియా & సిస్టర్ మైకలా. ప్రార్థనలు, పూజలు, సేవ—అన్నీ పైపైనే. వారి అసలైన ప్రపంచం అయితే… ఆత్మలు, దెయ్యాలు, నిషేధాలు లోపల దాచిన చీకట్లు.
సిస్టర్ జునియా ఒక సాధారణ నన్ కాదు— ఆమెకు ప్రేతాత్మలు కనిపిస్తాయి. వాటితో మాట్లాడగలదు. దెయ్యం ఎవరినైనా ఆవహిస్తే… ఆమె పసిగట్టగలదు. అలాగే ఒక చిన్న హెచ్చరికతో “వెళ్ళిపో” అని చెప్పగానే దుష్టశక్తులు వెనక్కి పంపగలదు. అయితే ఆమెను ఓ సమస్య వేధిస్తోంది. ఆమె లోలోపల నుంచి క్రమంగా తినేస్తోంది క్యాన్సర్. రోజు రోజుకీ శరీరం బలహీనం అవుతోంది…కానీ ఆత్మలతో చేసే యుద్ధంలో ఆమె ఏ మాత్రం తగ్గదు.
ఇక సిస్టర్ మైకలా— ఆమెకు ఆత్మల గురించి జ్ఞానం ఉంది. జునియా స్నేహం ఉంది. కానీ ఆమెది వేరే ప్రపచం. చర్చ్ వీళ్లను పూర్తిగా ఏక్సెప్ట్ చెయ్యదు. వాళ్లకు అడ్డంగా నిలబడేది— ఫాదర్ పాలో.
ఫాలో దృష్టిలో దెయ్యాలు, దుష్టశక్తులు అన్నీ “మనసు పుట్టించిన భ్రాంతులు” మాత్రమే. తాను ఒక డాక్టర్ & ఫాదర్‌గా “ ప్రజలను మానసిక వ్యాధుల నుంచి రక్షించడమే తన పని ” అని స్పష్టంగా చెబుతాడు. ప్రేతాత్మలు, ఎగ్జార్సిజం అనే మాటలకి ఆయన నిర్దాక్షిణ్యంగా నో చెప్పేస్తాడు. ఇదే కారణంతో మైకలా అతడి ముందు మాట కూడా మాట్లాడలేక భయపడుతుంది.
ఈ నేపథ్యంలోనే, హీ-జూన్ అనే చిన్నారి ఒక భయంకరమైన దెయ్యం చేతిలో చిక్కుకుని అక్కడకి వస్తాడు. అది సాధారణ ఆత్మ కాదు—మొండి దెయ్యం.ఎవరు ఎంత ప్రయత్నించినా ఓ కొలిక్కి రాదు. దాంతో హీ-జూన్ తల్లి, తీవ్ర నిరాశలో అక్కడే ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ మరణం జునియాకు ఒక లైటింగ్ స్ట్రైక్ లాంటిది.
దాంతో చర్చ్ ఎగ్జార్సిజంను నిషేధించినా— జునియా, మైకలాతో కలిసి ప్రాణాల పణంగా పెట్టి ఆ దెయ్యంపై యుద్ధం మొదలెడుతుంది. ఇంతకీ ఈ దెయ్యం ఎవరిది? హీ-జూన్ నే ఆ దెయ్యం ఎందుకు ఎంచుకుంది? అది కోరేది ఏమిటి? దాని లక్ష్యం ఒక బాలుడా…? లేక చర్చ్‌కే ఒక హెచ్చరికా…? చివరకు ఏమైంది అనేదే కథలో అసలైన హారర్.
విశ్లేషణ
Dark Nuns చూడగానే మొదట వచ్చేది ఆశ్చర్యం… తర్వాత వచ్చేది నిరాశ. ఎందుకంటే సినిమా లో ఉన్న కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపిస్తే,
కొన్ని మాత్రం పూర్తిగా “ ఎగ్జార్సిజం ట్రోప్స్”. హారర్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకి ముందే తెలిసిపోయే బీట్‌లు. ఎందుకంటే “దెయ్యం పట్టిన సినిమాకు కథేమిటో ముందే తెలిసిపోయే కాలంలో మనం ఉన్నాం… ఇలాంటి జానర్‌కి ఒక పెద్ద సమస్య ఉంది— దానిపై ‘The Exorcist’ నీడ వాలక తప్పదు.
1973లో ఆ చిత్రం ప్రపంచ సినిమాపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. దాంతో ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎగ్జార్సిజం మూవీ,ఆ కథ నీడని దాటుకుని ముందుకు రావడం కష్టంగా మారింది. ఓ రకంగా “డార్క్ నన్స్”కి అదే సమస్య… అదే అదృష్టం. ఈ కొరియన్ హారర్ సినిమాకు స్పిన్-ఆఫ్ హారర్ సినిమాలకు ఉన్న క్లాసిక్ బీట్స్ అన్నీ ఇందులో ఉన్నాయ్. కానీ అవన్ని రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా అనిపించాయి.
నమ్మే నన్లు vs నమ్మని చర్చ్ – క్లాసిక్ కాన్ఫ్లిక్ట్
ఇద్దరు నన్లు ఆ బాలుడిని రక్షించాలనే తమ ధర్మం కోసం నిలబడితే, చర్చ్ మాత్రం: “ఎగ్జార్సిజం వద్దు. ఇది మెడికల్ కేసు మాత్రమే.” అంటూ అడ్డుపడుతుంది. ఈ “విశ్వాసం vs వ్యవస్థ” ఢీ అంటే స్ట్రాంగ్ సెటప్… కానీ కొత్తదనం తక్కువ.
అలాగే మనం The Exorcistలో చిన్న రెగాన్‌ను ప్రేమిస్తాము. ఆమె అమాయకత్వం, తల్లితో ఉన్న బంధం—అవే ఆమె పైకి దెయ్యం ఎక్కినప్పుడు నిజమైన భయం,బాధ కలిగిస్తాయి. ఆ పాయింట్ లోనే “డార్క్ నన్స్” డ్రాప్ అయ్యిపోయింది. కథలో ప్రధాన మలుపు అయిన హీ-జూన్‌ను మొదటిసారి చూసేసరికి… అతను అప్పటికే దెయ్యం ఆవహించబడ్డ బాలుడు.
అతని అమాయకత్వం, బ్యాక్‌స్టోరీ, అతనితో కనెక్షన్—ఏదీ లేదు. బాలుడి కోసం మనం ఫీల్ కావాల్సింది అతనితో ఏర్పడ్డ కనెక్షన్ వల్ల కాదు, కేవలం “మనిషి కాబట్టి చచ్చిపోవద్దు” అనే మనిషితన స్థాయి సింపతీ మాత్రమే. మొత్తం సినిమాలో ఎక్కువ సమయం అతను — వీల్‌చెయిర్‌లో కూర్చొని ఉన్న ప్రాప్ అంతే.
టెక్నికల్ గా
ఈ సినిమాలో కెమెరా వర్క్ చాలా క్లిష్టమైన టోన్‌ను సృష్టిస్తుంది. చీకటిని బాగా ఉపయోగించడం, నెమ్మదిగా కదిలే షాట్లు, క్లోజ్-అప్స్—ఇవన్నీ కలిసి భయాన్ని క్రియేట్ చేస్తాయి. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కువగా నిశ్శబ్దంలో నెమ్మదిగా పెరుగుతూ ప్రేక్షకుల్లో ఒక టెన్షన్‌ను ఏర్పరుస్తుంది. టెక్నికల్‌గా చూస్తే ఇవి పాజిటివ్ పాయింట్లే. కానీ సమస్య ఏంటంటే— ఈ మొత్తం మూడ్ చివరి భాగం వరకు పూర్తిగా రైజ్ అవ్వదు. అంతవరకు సినిమా ప్రధానంగా సంభాషణలపైనే నడవడం వల్ల కొంతమందికి ఇది స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఫైనల్ థాట్
Dark Nuns కొత్తదనంతో వచ్చిన సినిమా కాదు— పాత చీకటిని కొత్త వెలుగులో చూపించిన సినిమా. హీ-జూన్ పాత్రలో లోతు లేకపోవడం, క్లాసిక్ ట్రోప్స్ పునరావృతం అవడం స్క్రిప్టుకి పెద్ద మైనస్. భయపెట్టాల్సిన చోట డ్రామాగా మారిపోవడం కూడా దెబ్బతీసింది. అయితే ఈ సినిమా మిమ్మల్ని భయపెట్టకపోవచ్చు… కానీ నీలోని నలుపు మూలల్లో ఏదో ఒక ఆలోచనను మాత్రం వదిలేస్తుంది.
చూడచ్చు
హారర్ సినిమా అభిమానులు ఓ లుక్కేయవచ్చు. మిగతావాళ్లకు పెద్దగా ఎక్కకపోవచ్చు.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ ఓటిటిలో తెలుగులో ఉంది.

