కోర్టుకెక్కిన నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ...కేంద్రానికి  నోటీసులు, కారణం ఏమిటి?
x

కోర్టుకెక్కిన నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ...కేంద్రానికి నోటీసులు, కారణం ఏమిటి?

కూతురుకు అన్యాయం చేయడం కోసం ఓ తండ్రి చేసిన పోరాట గాథ ‘టు కిల్ ఏ టైగర్’. ఇప్పుడు ఈ సినిమా కోర్టుకు ఎక్కింది. ఎందుకో తెలుసా..

స్కూలు నుంచి ఎప్పటిలాగే ఉషారుగా రావాల్సిన 13 ఏళ్లమ్మాయి. ఒళ్లంతా గాయాలతో ఇంటికొచ్చి పడిపోయింది. భరించలేని బాధతో గిలగిల్లాడుతున్న ఆ బిడ్డని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు,ఎవరు మాత్రం తట్టుకోగలరు? తన బంగారుతల్లిపై ముగ్గురు లైంగికంగా దాడి చేశారని తెలిసి గుండె బ్రద్దలైపోయింది. కానీ తనకున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరు. ఎంత బాధ ఉన్నా, ఈ విషయం బయటికి తెలిస్తే అమ్మాయికి పెళ్లవదు. ఇంటి పరువు పోతుందని అందరూ వారించారు. కానీ ఆ తండ్రి కిమ్మనకుండా ఉండిపోలేదు. పోరాడాడు. తను ఉంటున్న గ్రామం అంతా ఎదురుతిరిగినా...తనకు ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని జైల్లో పెట్టాడు. ఝార్ఖండ్‌లోని మారుమూల పల్లెలో చోటుచేసుకున్న ఈ కథను డాక్యుమెంటరీగా తెరకెక్కించి ‘ఆస్కార్‌’ బరిలో నిలిపారు నిషా పహూజా. అయితే ఇప్పుడీ డాక్యుమెంటరీ కోర్టుకు ఎక్కింది. నెట్ ప్లిక్స్ కు, దర్శకురాలికి, కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపింది డిల్లీ హైకోర్టు.

‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్‌ ఏ టైగర్‌’ పేరుతో డాక్యుమెంటరీగా తీయటంలో ఏం పొరపాటు జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించి, టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ లో మైనర్ గ్యాంగ్ రేప్ బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు చిత్రనిర్మాత నిషా పహుజా, నెట్‌ఫ్లిక్స్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్ర స్టాండ్ (వైఖరి)ని కోరింది.

తులిర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ మరియు జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం కెనడాలోని టొరంటోకు చెందిన ఎమ్మీ-నామినేట్ ఫిల్మ్ మేకర్ పహుజా మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసు జారీ చేసింది. వారి సమాధానాలు దాఖలు చేయవలసిందిగా కోర్టు వారిని కోరింది, అయితే ఈ విషయం తేలకుండా ఉన్న పళంగా డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయడానికి నిరాకరించింది.

పీటిషనర్ ఆరోపణ ఏమిటంటే... 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి గుర్తింపును ఈ డాక్యుమెంటరీ బహిర్గతం చేసిందని పిటిషనర్ . మూడున్నర సంవత్సరాలుగా డాక్యుమెంటరీ షూట్ చేసినప్పటికీ, పహుజా మైనర్ గుర్తింపును కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. డాక్యుమెంటరీ తీసేటప్పుడు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తన కష్టాలను పదేపదే చెప్పమని కోరినట్లు చెప్పారు. అలాగే ఈ విషయాలన్నీ నెట్‌ఫ్లిక్స్‌కు తెలుసునని న్యాయవాది పేర్కొన్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం , మైనర్ రేప్ బాధితుల గుర్తింపుకు సంబంధించిన ఇతర చట్టపరమైన నిబంధనలను ఈ డాక్యుమెంటరీ ఉల్లంఘించిందని పిటిషన్ పేర్కొంది.

డాక్యుమెంటరీలో ఏముంది

2013లో జార్ఖండ్‌లోని బెరో జిల్లాలో వెలుగు చూసిన దారుణమైన సామూహిక అత్యాచార ఘటన పై తీసిన డాక్యుమెంటరీ ఇది. ప‌ద‌మూడేళ్ల‌ అమ్మాయిపై ముగ్గురు దుండగులు అమానుష అత్యాచార దాడి చేసారు. ఈ దుండగుల్లో ఒకడు ఆ బాలిక బంధువు కావడం మరో విషాదం. ఈ ఘటనలో బాలిక తండ్రి రంజిత్, గ్రామ పెద్దలని, ప్రజలని ఎదురించి చేసిన న్యాయపోరాటాన్ని ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు నిషా పహుజా. అమ్మాయి కుటుంబం, ఆ గ్రామం పద్దతి, నిందితులు , ‘శ్రీజన్’ అనే ఎన్జీవో చేసిన సాయం, బాలిక తండ్రి చేసిన న్యాయపోరాటం.. ఇలా వివిధ కోణాల్లో ఈ డాక్యుమెంటరీ నడుస్తుంది.

కూతురికి అన్యాయం జరిగితే న్యాయం తండ్రి పోరాటం చేయటం కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ ఆ పిల్ల తండ్రి రంజిత్ పరిస్థితులు వేరు. ఆయన ముగ్గురు ఆడపిల్లకు తండ్రి. అమాయకుడు. వ్యవసాయం చేసుకుని బ్రతికేవాడు. ఆర్దికంగా ఉన్నవాడు కాదు. కోర్టులు, పోలీస్ స్టేషన్ ల మొహం ఎప్పుడూ చూసిన వాడు కాదు. పేపర్లో ఆ వార్తలు కూడా చదివే రకం కాదు. ఈ క్రమంలో తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలతో మొరపెట్టుకుంటే.. అత్యాచారం చేసినవాడే పెళ్లి చేసుకుంటాడని, దీంతో ఆ మచ్చ తోలిగిపోతుందని తీర్పు ఇవ్వటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

మరి కొంతమంది అయితే అసలు అమ్మాయికి రాత్రి సమయంలో అక్కడ ఏం చేస్తోంది. ఆమె అజాగ్రత్త వలనే ఇదంతా జరిగిందని వాదిస్తారు. ఈ విషయంలో కేసులు పెడితే… మన ఊరుకి చెడ్డపేరు వస్తుందని ఆ గ్రామంలో మహిళలు అంటారు. వీటిని అన్నిటినీ తట్టుకుని, రంజిత్ చేసిన ప్రతిఘనటన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకమే. ముఖ్యంగా అన్యాయానికి గురైన బాధితుల మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో వున్నది ఉన్నట్లుగా చూపించటంలో సఫలీకృతులయ్యారు. 14 నెలలు విచారణ తర్వాత ముగ్గురు నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది స్థానిక కోర్టు.

ఇక ఈ పిటిషన్‌పై సూచనల కోసం సమయం కావాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు. నెట్ ప్లిక్స్ తరపు న్యాయవాది వాదిస్తూ, ఈ చిత్రం అమ్మాయి తల్లిదండ్రుల అనుమతితో తీసాము. షూట్ జరిగేనాటికి ఆమెకు మైనార్టీ నిండలేదు. దాంతో తల్లితండ్రుల అనుమతి తీసుకున్నామని, ప్రాణాలతో బయటపడిన ఆమె కథను షేర్ చేసుకోవటానికి అంగీకరించబట్టే డాక్యుమెంటరీ చేసామని చెప్పుకొచ్చారు. ఇక నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, నెట్‌ఫ్లిక్స్, డాక్యుమెంటరీ డైరెక్టర్ నిషా పహుజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Read More
Next Story