ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామా ‘గురుదేవ్ హొయసాల’ రివ్యూ
x
Source: Twitter

ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామా ‘గురుదేవ్ హొయసాల’ రివ్యూ

హోంబెల్ ఫిల్మ్స్ ప్రెజెంట్ చేసిన మూవీ ‘గురుదేవ్ హొయసాల’. అంత పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అంటే కచ్చితంగా ఆసక్తి ఉంటుంది..


KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ ప్రెజెంట్ చేసిన మూవీ ‘గురుదేవ్ హొయసాల’. అంత పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అంటే కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ జనరేషన్‌లో చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ విలన్ టర్న్డ్ హీరో ‘డాలి ధనంజయ’ నటించిన సినిమా ఇది. ధనుంజయ్ ఎవరో ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా... పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా చేసిన నటుడే ఇతను. పవర్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అక్కడ మంచి విజయం సాధించిన ఈచిత్రం తాజాగా ఓటిటిలో తెలుగు వెర్షన్ రిలీజైంది. ఈ సినిమా కథేంటి...ఎలా ఉంది, చూడదగ్గ సినిమాయేనా చూద్దాం.

కథేంటి

గురుదేవ్ (ధనుంజయ్) ముక్కు సూటి పోలీస్ అధికారి. ఎదుటి వారు ఎలాంటి వాడైనా, ఎంతటి వాడైనా లెక్క చేయడు. దాంతో అతను ఒక చోట నుంచి మరొక చోటకు ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలో బెల్గాం వెళ్తాడు. అక్కడ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాడు. అలాగే అక్కడ మిస్సైపోయిన పోలీస్ ఎస్సై గురించి ఎంక్వైరీ చేస్తూంటాడు. ఈలోగా ఓ జంట లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుందామనే ప్రయత్నాల్లో ఉంటూ పోలీసులకు దొరుకుతారు. గురుదేవ్ మంచి మనస్సుతో వాళ్లిద్దరికి పెళ్లి చేస్తాడు. వాళ్లూ ఆనందంగా వెళ్లిపోతారు. అయితే అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఓ పెద్దింటి అమ్మాయి. పెళ్లి చేసుకున్న కుర్రాడు తక్కువ కులానికి చెందినవాడు. ఈ పెళ్లి విషయం తెలిసి ఆ అమ్మాయి తరుపు వాళ్లు సీన్‌లోకి వస్తారు.

డైరక్ట్‌గా గురుదేవ్ ఇంటికి వెళ్లి మా అమ్మాయికు పెళ్లి చేయటానికి నువ్వు ఎవడివి.. ముందు మా అమ్మాయిని తెచ్చి ఇవ్వు అంటారు. గురుదేవ్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపేస్తాడు. ఈలోగా వాళ్లు పైనుంచి ఒత్తిడి తెస్తారు. ఎస్పీ దగ్గరకు వెళ్తారు. మా అమ్మాయిని తేకపోతే ఊరు వల్లకాడు చేసేస్తామంటారు. ఆ స్థాయి కలగిన వాల్లే. తమ ఊళ్లో తమ దగ్గర పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్లలో పనిచేసే వాళ్ళందరినీ పనుల్లోకి రావద్దంటారు. అలాగే ఆ కుర్రాడి ఫ్యామిలిని భయపెడుతూంటారు. ఇవన్నీ చూసిన గురుదేవ్‌కు మరో విషయం తెలుస్తుంది. ఆ పెళ్లి చేసుకున్న కుర్రాడు కావాలనే ఓ స్కెచ్‌తో తన దగ్గరకు వచ్చాడని, ఆ అమ్మాయిని ప్రేమించ లేదని, ఆమె తండ్రికి బుద్ధి చెప్పడానికి ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఆ జంట ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని బయిలుదేరతాడు. ఆక్రమంలో ఏం జరిగింది.. చివరకు ఏమైంది అనేదే మిగతా సినిమా.

ఎలా ఉందంటే...

ఈ కథ పూర్తిగా పరువు హత్యల నేపథ్యంలో సాగే పోలీస్ కథ. ఇందులో హీరో ఆవేశం చూస్తుంటే మనకు అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎవరిని లెక్క చేయని తనం, కోపం, తను నమ్మిన విషయం కోసం ఎంతదూరం అయినా వెళ్లే పాత్రలో హీరో పాత్రను డిజైన్ చేశారు. అయితే పరువు హత్యలు అనే విషయాన్ని కథకు కీలకంగా తీసుకోవటంతో చాలా సీన్స్ మనకు గతంలో చూసినట్లు అనిపిస్తాయి. అయితే వాటి ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉండేలా డైరక్టర్ చూసుకున్నాడు. అలాగే డైరక్ట్‌గా కథ పరువు హత్యలు విషయంలోకి వెళ్లదు. ఓ పోలీస్ కథగా అతని పాయింటాఫ్ వ్యూ లోంచి చూపుతూ ముందుకు వెళ్తుంది. దాంతో కొత్తగా అనిపిస్తుంది. అలాగే లవ్ స్టోరీ వంటి వాటిపై కాన్సట్రేట్ చేయకుండా పోలీస్ కథగా ఫోకస్‌గా వెళ్లటంతో యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చి ఇంట్రస్ట్‌గా అనిపించింది. అయితే ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ప్రెడిక్టబుల్‌గా తయారైంది. మన తెలుగు సినిమా ఆపరేషన్ దుర్యోధన పోలికలు కనపడతాయి. అలాగే రాజ్ కుమార్ సంతోషి ' ఖాఖీ' (2004) కూడా గుర్తుకు రాకమానదు.

ఇక ‘గురుదేవ్ హొయసాల’ పాత్రలో గ్రే షేడ్ ఉన్న పోలిస్ పాత్రలో ధనంజయ ఇంటెన్స్‌గా కనిపించాడు. క్యారెక్టర్ ఇంట్రోని యాక్షన్ ఎపిసోడ్స్‌తో చూపించటం ఇంప్రెస్ చేసింది. ధనుంజయ్‌కు జోడీగా చేసిన అమృతా అయ్యింగార్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. వచ్చి వెళ్లిపోతుంది. విలన్స్‌గా చేసిన వాళ్లు కూడా బాగా చేశారు. డైరక్టర్ క్లారిటీగా ఉన్నాడు. కామెడీ అని, మరొకటి అని సైడ్‌ట్రాక్‌లకు వెళ్లకుండా సినిమాను నీట్‌గా తీసుకెళ్లాడు. అజ్నీష్ లోకనాథ్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎడిటింగ్ మంచి స్పీడ్ తో పరుగెట్టేలా ఉంది. అయితే డబ్బింగ్ మాత్రం సరిగ్గా లేదు. మధ్య మధ్యలో కన్నడ డైలాగులు వచ్చేస్తూంటాయి. చూసుకోలేదో లేక టెక్నికల్‌గా సమస్యో అర్దం కాలేదు.

చూడచ్చా

యాక్షన్ సినిమా ప్రియులకు నచ్చుతుంది.

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఉంది.

Read More
Next Story