
'దండోరా' మూవీ రివ్యూ
కుల గజ్జిని అద్దంలో చూపించిన కథ
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న తుళ్లూరు గ్రామంలో ఈ కథ జరుగుతూంటుంది. అక్కడ ఓ పెద్ద కులానికి చెందిన రైతు శివాజీ(శివాజీ) మరణిస్తాడు. అయితే ఆ కులం వాళ్లెవరూ అతని అంత్యక్రియలు తమ స్మశాన వాటికలో చేయటానికి ఒప్పుకోరు. కుల పెద్దల తీర్మానం అది. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితి. అప్పటికీ ఆ ఊరి సర్పంచ్ (నవదీప్) ఎలాగైనా అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని వల్లా కాదు. ఈ క్రమంలో వేరే దారిలేక శివాజీ కొడుకు విష్ణు (నందు) సాయింతో ఆ ఊరి కుల పెద్దలను ఒప్పించాలనుకుంటారు.
అయితే శివాజీకు అతని కొడుకు విష్ణు చాలా ఏళ్ళుగా మాటలు లేవు. దూరంగా సిటీలో తన పెళ్లాం బిడ్డలతో జీవిస్తున్న విష్ణు తండ్రిపై తన పంతం వదలి వచ్చి ఈ అంత్యక్రియల సక్రమంగా జరగటం కోసం ఏం చేస్తాడు. అసలు తన సొంత కులం వాళ్లే శివాజీ అంత్యక్రియలకు ఎందుకు అడ్డుపడుతున్నారు. ఇక ఆ ఊళ్ళో హత్యకు గురి కాబడ్డ రవి (రవికృష్ణ) ఎవరు...అలాగే వేశ్య శ్రీలత (బిందు మాధవి) కు శివాజీకి ఉన్న రిలేషన్ ఏమిటి? చివరికి శివాజీ అంతిమ సంస్కారాల అదే ఊళ్లో జరిగాయా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని తెరపై చూడాల్సిందే.
ఎనాలసిస్
‘దండోరా’ సినిమా తనేం చెప్పాలనే విషయంలో క్లారిటీ ఉంది. అలాగే సినిమా ప్రారంభం నుంచే తన ఉద్దేశాన్ని దాచకుండా ముందుకు వెళ్తుంది. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సమస్యని టచ్ చేసిన సినిమా కాదు. సమస్యనే కథా కేంద్రంగా పెట్టుకుని, దాని చుట్టూ ఎమోషన్స్, లవ్, హ్యూమర్‌ను అల్లిన స్క్రిప్ట్. దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న దారి పెద్ద రిస్క్. అదేంటంటే – బోధించకుండా చెప్పడం. అదే ఈ స్క్రిప్ట్‌కు బేసిక్ ఫౌండేషన్. సినిమా ఓపెనింగ్‌లోనే తక్కువ కులానికి చెందిన మహిళ మృతదేహాన్ని ఊరికి దూరంగా నది దగ్గర పూడ్చేందుకు తీసుకెళ్లే సీన్ పెట్టడం స్క్రిప్ట్‌లో చాలా కీలకమైన నిర్ణయం. ఇది ప్లాట్ పాయింట్ కాదు… ఇది థీమ్ స్టేట్‌మెంట్.
ఇక్కడ దర్శకుడు పెద్ద డైలాగ్స్ రాయలేదు. విజువల్స్‌తోనే గ్రామంలో ఉన్న కుల వ్యవస్థ ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పేశాడు. ఇది స్క్రిప్ట్‌లో “show, don’t tell”కి మంచి ఉదాహరణ.
అయితే ఫస్ట్ హాఫ్‌లో రవి–సుజాతల ప్రేమ కథ మాత్రం ఇంట్రస్టింగ్ గా అనిపించదు. ఇది ఆడియెన్స్‌ను కంఫర్ట్ జోన్‌లో ఉంచే ట్రాక్.
లవ్, రొమాన్స్, కామెడీ, సరదా సీన్స్… ఇవన్నీ ఒక ఉద్దేశంతో పెట్టారు. సమస్యని ఒక్కసారిగా ముఖంపై కొట్టకుండా, ముందుగా మనల్ని కథలోకి లాగడం. అందుకే ఫస్ట్ హాఫ్‌లో సామాజిక అంశం అడపాదడపా మాత్రమే టచ్ అవుతుంది.
డైరక్టర్ ఆలోచన బాగానే ఉంది కానీ ఈ భాగం ప్రెడిక్టబుల్‌గా అనిపించింది. అదే ఇక్కడి వీక్ పాయింట్. దాంతో ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఎంత సేపు అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. సెకండాఫ్ కొద్దిసేపు డ్రైగా అనిపిస్తుంది. ఆ ఎమోషన్ కు కనెక్ట్ కాకపోతే ఇబ్బందిగా ఉంటుంది.
ఇక శివాజీ పాత్ర స్క్రిప్ట్‌లో ఎమోషనల్ యాక్సిస్. ఆయన కూతురు తక్కువ కులం వ్యక్తిని ప్రేమించడం, ఆ ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోవడం… ఇది కథలో కీలక మోరల్ షిఫ్ట్ పాయింట్. ఇక్కడ స్క్రిప్ట్ చాలా స్పష్టంగా చెబుతుంది: డబ్బు, హోదా, చదువు… ఏదీ కుల గజ్జి ముందు పనిచేయదు.
శివాజీ కూతురు మరణం తర్వాత వచ్చే సీన్స్‌లో ఆయన మనోవేదనను ఓవర్ డ్రామా లేకుండా రాసిన తీరు స్క్రిప్ట్‌కు పెద్ద ప్లస్. సెకండాఫ్‌లో స్క్రిప్ట్ పూర్తిగా టోన్ మార్చుతుంది. బిందు మాధవి పాత్ర ద్వారా చెప్పే జీవిత నిజాలు స్క్రిప్ట్‌లో ఏదో ఎక్స్‌పోజిషన్‌లా కాకుండా, వ్యక్తిగత గాయాల్లా అనిపిస్తాయి. ఆమె పాత్ర సినిమాకి ఒక మోరల్ వాయిస్. క్లైమాక్స్ కోర్ట్ సీన్ ‘దండోరా’ స్క్రిప్ట్‌కు అసలు హార్ట్. ఇక్కడ శివాజీ క్యారెక్టర్‌లో వచ్చే మార్పు స్క్రిప్ట్ పరంగా చాలా కీలకం.
మొదట వ్యవస్థలో భాగమైన వ్యక్తి… చివరికి అదే వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తిగా మారడం. ఇది ఒక్క సీన్‌లో జరిగిన మార్పు కాదు. స్క్రిప్ట్ అంతా వేసిన ఎమోషనల్ బిల్డ్‌అప్‌కు వచ్చే సహజమైన ఫలితం.ఎడిటింగ్ పరంగా మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెలంగాణ స్లాంగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి.
టెక్నికల్ గా
‘దండోరా’కి భారీ నిర్మాణ విలువలు లేవు. కానీ అది పెద్ద లోటుగా ఎక్కడా అనిపించదు. ఆ క్రెడిట్ ఎక్కువగా సినిమాటోగ్రఫీకే వెళ్తుంది. వెంకట్ శాఖమూరి కెమెరా వర్క్ చాలా నేచురల్‌గా ఉంటుంది. గ్రామీణ వాతావరణాన్ని, పాత్రల భావాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా చూపించాడు. ప్రతి సీన్ నిజంగా మన కళ్లముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
దర్శకుడు మురళీకాంత్ స్టైలిష్ ట్రీట్మెంట్‌కు వెళ్లలేదు. కథను సింపుల్‌గా చెప్పడంపైనే ఫోకస్ పెట్టాడు. నటీనటుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌లు తీసుకోవడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మార్క్ కె. రాబిన్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరమైన చోట ఎమోషన్‌ను బలపరుస్తుంది. ఓవరుగా ఎక్కడా అనిపించదు.
డైలాగ్స్ పెద్ద ఉపన్యాసాల్లా ఉండవు. కానీ ప్రతి లైన్ ఒక జీవిత సత్యాన్ని బయటపెడుతుంది. అందుకే అవి బుల్లెట్‌లా తాకుతాయి. కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి దిగింది పొద్దుగాల దిగినీకీ. కులం మత్తుసార్.. టైమ్ పట్టింది., చావునుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం., మన చావు పుట్టుకలన్నీ ఆ ఊరిబయట రాసిండ్రా దేవుడూ ఇటు పెళ్లి దగ్గర.. లేకపోతే చావు దగ్గర.. ఈ రెండింటి దగ్గరే కదా.. ఈ కులపోళ్ల ఆటలు సాగేదీ ఇలాంటి డైలాగులు సినిమా పూర్తయ్యాక కూడా గుర్తుండిపోతాయి.
నటీనటుల్లో.... శివాజీ హైలెట్ గా నిలబడతాడు. కుల పిచ్చికి బ్రాండ్ అంబాసిడర్ బాగా చేసారు. హీరో నందు.. శివాజీ కొడుకుగా బాగా చేసారు. నవదీప్ ఎప్పుడూ మంచి నటుడే. బిందు మాధవి కు మంచి రీ ఎంట్రీ.
ఫైనల్ థాట్ :
ఇలాంటి కల వివక్ష కథలు మనకు కొత్తేమీ కాదు. అయితే మిగతా సినిమాలకు దీనికి తేడా ఏంటంటే.. సమస్యను లౌడ్ గా అరుస్తూ చెప్పకపోవటమే. కుల వివక్షను నినాదంలా కాకుండా, కుటుంబాలు నలిగిలిపోతున్న కథలా చూపించాడు. పాత్రలు ఉపన్యాసాలు ఇవ్వవు… వాళ్ల బాధలే వాదనలుగా మారతాయి. ఈ స్క్రిప్ట్ రివల్యూషన్‌ని చూపించదు. కానీ మార్పు ఎలా మొదలవుతుందో చూపిస్తుంది. అదే దీనిని ప్రత్యేకం. ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత కూడా ఒక ప్రశ్న మనతోనే ఉంటుంది. “కాలం తో పాటు… మనం మారుతున్మానా?” అదే ‘దండోరా’ వేసిన అసలు దెబ్బ.

