‘శర్మ అండ్ అంబానీ’ మినీ  రివ్యూ
x
Source: Twitter

‘శర్మ అండ్ అంబానీ’ మినీ రివ్యూ

ధన్య బాలకృష్ణ నటించిన ‘శర్మ అండ్ అంబానీ’ మూవీ. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..


అర్దరాత్రి జోరున వర్షం.. ఓ భవంతి.. అందులో ఓ మర్డర్ జరుగుతుంది. హీరోల ఇంట్రడక్షన్. ఆ తర్వాత ఎక్కడో కథకు ఆ మర్డర్‌కు లింక్ ఇస్తారు. అప్పటిదాకా క్యారక్టర్స్ పరిచయంతో కాలక్షేపం చేస్తారు. ఆ తర్వాత మెల్లిగా కథలోకి వచ్చి ఆ మర్డర్‌తో ముడిపెడతారు. ఇది సినిమా పుట్టిననాటి నుంచి క్రైమ్ జానర్ ఫిల్మ్‌లకు అనుసరిస్తున్న స్క్రీన్ ప్లే. ఇదే పద్దతిలో ఈ సినిమా కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఎన్నిసార్లు ఈ స్క్రీన్ ప్లేతో సెట్ చేసిన సినిమా చూసినా కొద్దో గొప్పో ఆసక్తిగానే ఉంటుంది. సినిమా బాగుందా లేదా అనేది ప్రధాన కథ ఎలా ఉందనేదానిపై ఆధారపడి ఉంటుంది. అసలు ఆ మెయిన్ కథేంటి...చూడదగ్గదేనా ?

అనగనగా ఓ కిల్లర్. వాడు చక్కగా టీవీలో మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫుడ్ సూచనలు వింటూ... వాటిని ఫాలో అవుతున్న సమయంలో ఓ ఫోన్ కాల్ వస్తుంది. వాడు ఓ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి అక్కడ ఒకరిని చంపేసి బ్యాగ్‌లో పెట్టుకుని వస్తాడు. మరో చోట నెల్లూరులో ఆయుర్వేద డాక్టర్‌ శర్మ( భరత్ తిప్పిరెడ్డి). అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉంటాడు. అయినా ఉన్నంతలో కస్టమర్స్‌తో మంచిగా ఉంటూ జీవితం అనే బండిని లాగుతూంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ (ధన్య బాలకృష్ణ). ఆమెతో చిలిపి తగువులు. ఇక అతని షాప్ దగ్గరే పగలు షూ క్లీన్ చేస్తూ, రాత్రుళ్లు రోడ్డుపై పడుకునే ఓ క్యారెక్టర్ అంబానీ (కేశవ). అంబానీకి ఒక్కరోజు అయినా రిచ్‌గా బ్రతకాలి అనేది తీరని జీవిత కాల కోరిక. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్.

ఇక ఓ రోజు అంబానికి వజ్రాలు ఉన్న చిన్న సంచీ దొరుకుతుంది. అది చూసిన అంబానీ షాక్ అవుతాడు. తేరుకుని ఫ్రెండ్ శర్మకి కాల్ చేసి చెప్పి ఆ సంచి తీసుకుని వెళ్తాడు. ఆ వజ్రాలని చూసిన శర్మ అవి నిజమైన వజ్రాలు కాదని చెప్పేసి వెళ్తాడు. అయితే మరుసటి రోజు అంబానీ దగ్గరికి కొంతమంది రౌడీలు వచ్చి ఆ వజ్రాల సంచి గురించి ఎంక్వైరీ చేస్తూంటే..అప్పుడు అవి నిజమైన వజ్రాలే అని అర్థం అవుతుంది. దాంతో వీళ్లిద్దరు కలిసి ఎవరికి తెలియకుండా ఆ వజ్రాలను అమ్మేసి జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ వజ్రాల సంచి కోసం కొందరు రౌడీలు తిరుగుతూంటారు. ఆ క్రమంలో రకరకాల అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేమిటి.. వజ్రాలను ఈ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మగలిగారా...ఆ వజ్రాలు అసలు ఎవరివి, చివరకు ఏమైంది వంటి విషయాలుతో సినిమా నడుస్తుంది.

ఏదో చేద్దామని మొదలెట్టి చివరకు ..ఏదేదో చేసి ముగించినట్లు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కాదు. వజ్రాలు, మర్డర్ అంటూ మొదలెట్టి దాన్ని క్రైమ్ కామెడీగా చూపెడదామనే ప్రయత్నంలో ఎక్కడా ఫన్ జనరేట్ కాకుండా సీన్స్ రాసుకున్నారు. ధన్య బాలకృష్ణని హీరోయిన్ అనడానికి లేదు..సినిమాలో ఆమెకు చెప్పుకోదగ్గ రోల్ లేదు. అయితే సినిమాలో తెలిసున్న ఫేస్ ఆమెదే. స్క్రిప్టులో మినిమం లాజిక్ కూడా లేకపోవడం దెబ్బ కొట్టింది. కథలో కీలకమైన వజ్రాల సంచి అంబానీకి దొరికిందని సీసీటీవీ కెమెరాలో క్లియర్‌గా చూసినా రౌడీలు వాడిని పట్టుకోకపోవడంలో లాజిక్ ఏమిటో అర్థం కాదు.. అసలే కొత్తవాళ్లు.. దానికి తోడు వీక్ స్క్రిప్ట్, సోసోగా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్. హై తెప్పించే సీన్ ఒక్కటీ లేకపోవటంతో ఏదీ ఆసక్తిగా అనిపించదు.

సినిమా బిగినింగ్‌లో ఒక హత్య . దీనికీ అసలు సినిమాకు లింక్ ఉంటుందని ముందే తెలిసిపోతుంది. అయితే డైరెక్టర్ తెలివి అంతా ఇలాంటి డాట్స్‌ని కలిపేటప్పుడు కథనం ఇంట్రస్టింగ్‌గా నడపటంలోనే చూపాలి. ఐతే ఇందులో అలాంటి స్పీడు, ఉత్సాహం, ఇంటెన్స్ కనిపించదు. దర్శకుడు తనకు అనుకూలమైన సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్ళాడు.

అయినా క్రైమ్ కామెడీకి హీరోయిజం, పాటలు వల్ల పెద్ద కలిసొచ్చేదేమీ ఉండదు. అలాగే హీరోయిజం చూపించటాలు, బిల్డప్‌లు దండగ. ఏదో మెసేజ్ ఇవ్వడం పరమ వేస్ట్ వ్యవహారం. ఇలాంటి కథల్లో హీరో క్రైమ్‌లో దొరికిపోతాడా… తప్పించుకుంటాడా... అని వెతుకుతుంటాడే తప్పించి హీరోకి ప్రేమకథ ఉందా లేదా? అనే విషయాలను ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోడు. అయితే ఈ సినిమాలో మాత్రం ఇవన్నీ ఉన్నాయి.

టెక్నికల్‌గా చూస్తే నార్మల్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. చాలా రెగ్యులర్ లైటింగ్, కలర్ గ్రేడింగ్‌లో సన్నివేశాలని లాగించేశారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ అలా అలా నడిచిపోతుంది. శశాంక్ ఆలమూరు సంగీతం ఫరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రమే. నటీనటులు ఎంత నటించినా వాళ్లకు స్క్రిప్ట్ సపోర్ట్ ఇవ్వలేదు. ధన్య బాలకృష్ణ కనపడేది కొద్దిసేపే. శర్మగా భరత్ తిప్పిరెడ్డి బాగానే చేశారు. అంబానీగా చేసిన కేశవలో మంచి ఈజ్ ఉంది.

ఏదైమైనా ఓటిటిలు రావడంతో వారానికి బోలెడు సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రేక్షకుడు ఉన్న వాటిల్లో బెస్ట్ ఎంచుకుని చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే థియేటర్‌లో రిలీజైన సినిమాలతో సమస్య ఉండదు. వాటి రిజల్ట్‌లు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటాయి. కానీ స్ట్రైయిట్‌గా ఓటిటిలోకి వచ్చేసే సినిమాలతోనే సమస్య అంతా. అందులోనూ దర్శకుడితో మొదలెట్టి అంతా కొత్తవారితో చేసిన ఇలాంటి సినిమాలను ట్రైలర్స్, టీజర్స్ చూసి కూడా అంచనా వేయలేం. టైటిల్ ఆసక్తిగా ఉన్న ఈ సినిమా ఈటీవి విన్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. కాబట్టి ఉన్నంతలో ఏదో ఉందనుకుంటే అంతే లేదని తేలిపోయింది.

చూడచ్చా

కామిడీ, థ్రిల్స్ లేని క్రైమ్ కామెడీని చూడమని రికమెండ్ చేయలేం.

ఎక్కడుంది

ఈటీవి విన్‌లో (తెలుగులో )

Read More
Next Story