బోమన్ ఇరాని ‘మెహతా బాయ్స్’ తో దర్శకుడిగా మెప్పించగలిగారా?
x

బోమన్ ఇరాని ‘మెహతా బాయ్స్’ తో దర్శకుడిగా మెప్పించగలిగారా?

పాత్రల చిత్రీకరణ విషయంలో తానూ పోషిస్తున్న శివ్ మెహతా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా బోమన్ ఇరాని కథ రాయడంతో సినిమా తెలిపోయిందా?


‘మున్నా భాయ్ ఎం బి బి యస్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ లాంటి హిందీ చిత్రాలతోనూ, ‘అత్తారింటికి దారేది’,అజ్ఞాతవాసి’, ఎన్ టి ఆర్ కథానాయకుడు,మహానాయకుడు వంటి సినిమాల్లో సహాయక పాత్రలే పోషించినా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బోమన్ ఇరాని. తన నలభైల్లో నటనా జీవితాన్ని ప్రారంభించినా విభిన్న పాత్రల ఎంపికతో అటూ బాలివుడ్, ఇటు టాలివుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు సినీ రచయిత,దర్శకుడిగా కూడా మారి ‘ద మెహతా బాయ్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలి ఎమోషనల డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? బోమన్ ఇరానీ దర్శకుడిగా మెప్పించగలిగారా? లేదా ? ఈ రివ్యూలో చూద్దాం.

ఒకరినొకరు అర్థం చేసుకోలేని తండ్రి కొడుకుల కథే ‘ద మెహతా బాయ్స్.’ ఈ తండ్రి కొడుకుల మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల ఇద్దరికీ జీవితం మీద ఉన్న భిన్న విలువలు, నమ్మకాల గురించి కూడా పరోక్షంగా చిత్రించారు బోమన్ ఇరాని. ఓ పక్క దర్సకత్వం వహిస్తూనే ఈ సినిమాలో తండ్రి పాత్ర పోషించారు బోమన్. ముంబైలో ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్న కొడుకు తల్లి మరణంతో ఇంటికి వస్తాడు. కొడుకు పేరు అమేయ్ మెహతా. తండ్రి పేరు శివ్ మెహతా. ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుండి గ్యాప్ వచ్చింది అన్న విషయంలో కథలో స్పష్టత లేదు. కొడుకు సామర్థ్యం మీద, తెలివి మీద ఒక వైపు నమ్మకం లేకపోవడం; ఇంకో వైపు ప్రతి దానికి తన చుట్టూ తిరిగిన చిన్ననాటి కొడుకు తనను పట్టించుకోకుండా స్వంత అభిప్రాయాలతో ఉండటం వంటివి తండ్రికి కొంత నచ్చని విషయాలుగా ఉంటాయి. తన మనసులో ఉన్నది అర్థం చేసుకోవడంలొనూ, మారిన తరం అభిరుచులు కూడా భిన్నంగా ఉంటాయని తండ్రి గుర్తించకపోవడం, ప్రతి దానికి వాదిస్తూ ఉండటం; ఇవి కొడుక్కి తండ్రి మీద ఉన్న ఫిర్యాదులు. ఇది మెయిన్ స్టొరీ. ఇక పోతే శివ్ మెహతా కి ఒక కూతురు కూడా ఉంది. ఆమె అను. తండ్రిని తనతో పాటు అమెరికాకు తీసుకువెళ్లాలని అనుకుంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో శివ్ మెహతా అమెరికా వెళ్ళే ముందు ముంబైలోని తన కొడుకుతో కలిసి 48 గంటలు ఉండాల్సి వస్తుంది. మరి కలిసి ఉన్నపుడు ఈ తండ్రికొడుకులు ఒకరినోకరిని అర్థం చేసుకున్నారా? లేదా?అన్నదే సినిమా కథ.

మొదటి సినిమాకు బోమన్ ఇరాని ఎన్నుకున్న కథ మములుదే.అందులోనూ ఎవరైనా ఊహించగలిగే కథే. దానికి తోడు చాలా నెమ్మదిగా సాగే కథ. బలమైన సంఘటనలు లేకపోవడం. కథ రాసే క్రమంలో పాత్రల చిత్రీకరణ విషయంలో తానూ పోషిస్తున్న శివ్ మెహతా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా బోమన్ ఇరాని కథ రాయడంతో అనేక చోట్ల కథ తేలిపోయింది. పాత్రల చిత్రీకరణలో తండ్రి,కొడుకు రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండేలా బలమైన సంఘటనలు ఉంటే సినిమా ఇంకా బావుండేది. అలాగే కథలో బలం లేకపోవడం, సింగిల్ లైన్ మీద కథను నడిపే ప్రయత్నం చేయడం వల్ల సాగతీతలా అనిపిస్తుంది.

సినిమాకు బలమైన ప్రీ క్లైమాక్స్ .ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాలో ఊహించిన స్థాయిలో లేవు. ఉత్కంట కలిగించే మలుపులు ఎక్కడా కథలో లేవు. శివ్ మెహతాకి ఇంటి మీద, ఇంటితో పెంచుకున్న జ్ఞాపకాల మీద, ఇంటి దగ్గర పిల్లలతో ఆడే క్రికెట్ మీద ఉండే మక్కువను చూపించినా; శివ్ మెహతా అనేక చోట్ల ‘నా ఇల్లు’ అనే ఉనికిని ప్రకటిస్తూ దానిని బలపరుస్తూ ఉన్నా; ముగింపులో దీనికి భిన్నంగా ఆ అస్తిత్వాన్ని ఆ పాత్ర వదులుకోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కథ సుఖాంతం చేయడానికే చివరిలో అమేయ పాత్ర మారిపోయినట్టు అనిపిస్తుంది తప్ప సహజంగా లేదు. అమేయ పాత్రలో అవినాష్ తివారి పాత్ర అనేక చోట్ల తేలిపోయింది. ఈ పాత్ర తేలిపోవడం వల్ల సినిమా మొత్తం శివ్ మెహతా (ఇమాన్ బోరాని) వన్ మ్యాన్ షో లా నడిచింది. ఇకపోతే కథలో ఏం కావాలో, ఏం కోరుకుంటున్నామో తెలియకుండా ఒక అర్బన్ లైఫ్ స్టైల్ లో, ఉద్యోగాలకు అంకితమవుతున్న యువతను తమను తాము ప్రూవ్ చేసుకోవడంలో తప్పు లేదు కాని దాని కోసం ఒక యాంత్రిక జీవితాన్ని గడపొద్దని చెప్పే హెచ్చరిక కూడా అమేయ పాత్ర ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసారు దర్శకుడు. ఇదొక్కటే సినిమాకు ఒక స్ట్రాంగ్ పాయింట్. కొన్ని చోట్ల కెమెరా వర్క్ బావుంది. మ్యూజిక్ కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంటే బావుండేది. అమేయ పాత్రలో నటించిన అవినాష్ తివారి పాత్ర బోమన్ ఇరాని కాంబినేషన్ లో కొంత తేలిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో సపోర్టింగ్ కాస్ట్ గా జారా పాత్రలో శ్రేయ చౌదరి ,అను పాత్రలో పూజ నటన పర్లేదనిపించింది.

ఒక మంచి కథనే బోమన్ ఇరాని ఎన్నుకున్నా దానికి తగ్గ పాత్రల చిత్రణ,బలమైన సంఘటనలు స్క్రీన్ ప్లే లకో లేకపోవడం వల్ల కొంతమేరకు ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన సినిమానే ‘ద మెహతా బాయ్స్.’

(ఈ సినిమా అమెజాన్ ప్రైం లో ఉంది.)



Read More
Next Story