‘దెజా వు’ డాక్యుమెంటరీ అన్నదాతకు ఇచ్చిన సందేశం ఏమిటీ?
x
డి జావ్ డాక్టుమెంటరీ పోస్టర్

‘దెజా వు’ డాక్యుమెంటరీ అన్నదాతకు ఇచ్చిన సందేశం ఏమిటీ?

2024 మార్చి 7.. రాత్రి 7 గంటలవుతోంది. స్థలం హైదరాబాద్ ‘లా మకాన్’. రైతు ఉద్యమాలంటే మక్కువ ఉన్న వాళ్లు ఒక్కొక్కరే వస్తున్నారు. కుర్చీలు నిండుతున్నాయి.


కరోనా చుట్టుముట్టి కల్లోలం సృష్టిస్తున వేళ.. దేశం యావత్తు లాక్ డౌన్ తో చేష్టలుడిగి పడున్న టైం.. బయటికెళ్తే చస్తామో బతుకుతామోననే భయం.. అటువంటప్పుడు మనకింత తిండి పెట్టిందెవరు?

మనం మూతికి ముక్కుకీ గుడ్డలు కట్టుకుని బతుకుజీవుడా అంటూ నాలుగు గోడలకే పరిమితమై ‘దీపాలు’ వెలిగిస్తున్నప్పుడు రైతుబజార్లకు కూరగాయలు తెచ్చిందెవరు! వాళ్ల ప్రాణాలను ఫణంగా పెట్టి మనకు పాలు పెరుగు పంచిందెవరు?

వాళ్లేగా మన అన్నదాతలు, రైతన్నలు. అటువంటి వాళ్ల నడ్డి విరగ్గొట్టేలా పాలకులు దాష్టీకం చేస్తుంటే సాటి మనుషులంగా మనం ఏమి చేయాలి?

జాతిపిత మహాత్మాగాంధీ ఖద్దరు గురించి ఓ సందర్భంలో.. వీలయితే మగ్గంపట్టి ఖద్దరు నేత నేయి, కాకుంటే ఖద్దరు కట్టు, అదీ చేతగాకపోతే నోర్మూసుకుని కూర్చోవాలే తప్ప తప్పు లెంచవద్దు అంటారు.

అదే సూత్రం ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు ఉద్యమానికీ వర్తిస్తుంది. చేతనైతే మనం నేరుగా రంగంలోకి దిగి రైతుతో భుజం భుజం కలిపి నడవడం, లేదంటే దూరంగా ఉండి మద్దతు పలకడం, అదీకాదంటే జరిగేది జరుగుతుందులెమ్మని చూస్తూ ఉండాలే తప్ప- అన్నంపెట్టే రైతన్నను- సాగంటే తెలియనోడికి తాకట్టు పెడతానంటే.. తానా అంటే తందాన అనకూడదు. లేనిపోని నిందలు వేయకూడదు. ఆ దిశగా వచ్చిందే ‘దెజా వ్’ డాక్యుమెంటరీ.

పశ్చిమబెంగాల్ కి చెందిన దేబబ్రత పెయిన్ అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో 15 ఏళ్లపాటు పరిశోధన చేశారు. కాల్టెక్ అనే పెద్ద సంస్థలో పని చేశారు. ప్రవృత్తి రీత్యా ఆయనకో ఆసక్తి ఉంది. అదే అన్నదాతలన్నా, ప్రజా ఉద్యమాలన్నా ప్రేమ, మమకారం. ఆ ప్రేమ కొద్ది ఆయన భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని అమెరికా రైతుల అనుభవంతో మేళవించి ఈ 75 నిమిషాల డాక్యుమెంటరీని మనముందుంచారు. ఇదేదో సంప్రదాయ వ్యవసాయ రంగ డాక్యుమెంటరీ కాదు.

అమెరికా అంటే భూతల స్వర్గమని, అక్కడందరూ సిరిసంపదలతో తులతూగుతుంటారని, వ్యవసాయానికి అమెరికా పెద్దపీట వేస్తుందనే భారతీయ సగటు మనిషి భ్రమల్ని పటాపంచలు చేశారు పెయిన్. అమెరికా రైతులూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భారతీయ రైతులూ పొలాల్లో చెట్లకు వేలాడుతున్నారు. రోనాల్డ్ రీగన్ అనే పెద్ద మనిషి అమెరికా అధ్యక్షుని హోదాలో తెచ్చిన సంస్కరణలు రైతుల్ని నట్టేట ముంచాయి. చిన్న చితకా రైతులు కణతలకు గురిపెట్టుకుని కాల్చుకుని ప్రాణాలు వదిలారు. అమెరికా వ్యవసాయం మొత్తాన్ని ఆరేడు కార్పొరేట్ సంస్ధలు శాసించేలా తీసుకువచ్చిన ఘనత ఆవేళ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కు దక్కితే... ఇప్పటికీ నూటికి 67 శాతంగా ఉన్న భారతీయ రైతాంగాన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే అధునాతన మార్కెట్ వ్యవస్థకి శ్రీకారం చుట్టింది భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. అమెరికా చిన్న మధ్యతరహా రైతులు ఆవేళ పడిన కష్టనష్టాలను మనకు వివరిస్తూ.. ‘పోరాడండి, మీకు మేమూ మద్దతు ఇస్తామనే’ సందేశమే ఈ డాక్యుమెంటరీ.

మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం 2020లో తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ రైతాంగం మహత్తర పోరాటానికి దిగింది. ఏడాదికిపైగా ఢిల్లీలో పోరు సాగించింది. 700 మంది ఈ పోరాటానికి సమిధలయ్యారు. దేశ చరిత్రలో తొలిసారి కేంద్రప్రభుత్వం తాను తెచ్చిన చట్టాలను వెనక్కుతీసుకుంది. చట్టాలనైతే వెనక్కు తీసుకుంది కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) చట్టంలో చేర్చడానికి ససేమిరా అంటోంది. మళ్లీ ఇప్పుడు.. 2024లో రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ఈనేపథ్యంలో గతం భవిష్యత్ తో కలవడమనే థీమ్ తో ఈ డిజావ్ డాక్యుమెంటరీ వచ్చింది.

ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమంతో డాక్యుమెంటరీ మొదలవుతుంది. ఉద్యమంపై ప్రభుత్వ దాష్టీకం మొదలవుతుంది. అప్పుడు నలుగురు భారతీయులు ఢిల్లీకి పది వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికా రైతుల అనుభవాలను ఈ ఉద్యమంతో మేళవించి చెప్పేందుకు వెళతారు. అక్కడ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో మాట్లాడి వాళ్ల అనుభవాలను రంగరించి భారతీయ రైతు ఉద్యమం ఎందుకు అవసరమో చెబుతారు. మార్కెట్ శక్తులు ఏకమై రైతుల్ని ఎలా దోపిడి చేస్తాయో, ధరల్ని ఎలా నియంత్రిస్తాయో, రైతులు ఎలా నష్టాల పాలై.. తమ భూమి నుంచి తామే పరాయివాళ్లుగా ఎలా మారతారో అమెరికా అనుభవాల్ని చిత్రీకరిస్తారు డైరెక్టర్ దేబబ్రత పెయిన్. అమెరికా అయినా ఇండియా అయినా వ్యవసాయంలో ఎటువంటి మార్పు లేదని, అక్కడెన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడా అంతేనని, వాళ్ల అనుభవాన్ని పాఠంగా తీసుకుని పోరాటంలో ముందుకురకమని చెబుతోంది ఈ డాక్యుమెంటరీ.

నూటికి 70 శాతంగా ఉన్న భారతీయ రైతుల్లో రోజుకు 500 మంది రాలిపోతున్నారు. 4 వేల ప్రతి నిత్యం వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. ధాన్యం క్వింటాల్ కనీస మద్దతు (ఎంఎస్పీ) ధర రూ.2,800గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా రూ.2,180కి మించి కొనే నాధుడు లేడు. ఎంఎస్పీఇస్తే ఆహార సంక్షోభం తలెత్తుతుందనే కార్పొరేట్ మేధావుల అభిప్రాయాన్ని పటాపంచలు చేసేలా ఈ డాక్యుమెంటరీ సాగింది. రైతుల్ని సిరిసంపదల్లో తులతూగేందుకే వ్యవసాయ చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిందనే భారతీయ ఆర్థివేత్తల, ప్రభుత్వ వర్గాల వాదన సరికాదని ఈ డాక్యుమెంటరీ రుజువు చేస్తుంది.

2024 మార్చి 7.. రాత్రి 7 గంటలవుతోంది. స్థలం హైదరాబాద్ ‘లా మకాన్’. రైతు ఉద్యమాలంటే మక్కువ ఉన్న వాళ్లు ఒక్కొక్కరే వస్తున్నారు. వేసిన కుర్చీలు వేసినట్టు నిండుతున్నాయి. డైరెక్టర్ దేబబ్రత పెయిన్ ఓ సామాన్యుడి మాదిరిగా తిరుగుతున్నారు. డాక్యుమెంటరీ మొదలైంది. 75 నిమిషాల పాటు చీమచిటుక్కుమంటే ఒట్టు. రైతంటే ప్రేమ, చుట్టుపక్కల వారి సంక్షేమమంటే శ్రద్ధ ఉన్న సామాజిక సేవా కార్యకర్తలు సుమనస్పతి రెడ్డి, డి. నరసింహారెడ్డి, కన్నెగంటి రవి, కాంగ్రెస్ కిసాన్ సెల్ కోదండరెడ్డి లాంటి వాళ్లు ఈ డాక్యుమెంటరీని చూసి వాళ్లు చెప్పాల్సింది చెప్పారు. డైరెక్టర్ దేబబ్రత పెయిన్ సహా ఆయన బృందం ప్రేక్షకుల సందేహాలను తీర్చారు. వాదోపవాదాలకు ఇది సమయం కాదంటూనే అనేక సందేహాలకు జవాబు చెప్పి... వీలయితే రైతుకు అండగా నిలబడాలే గాని రైతు ఉద్యమాలను వ్యతిరేకించవద్దని మందలింపులాంటి హెచ్చరిక చేస్తూ సభను ముగించారు. చిత్రమేమిటంటే ఈ డాక్యుమెంటరీని చూడడానికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది యువతీ యువకులే ఉండడం.

Read More
Next Story