పవన్ కల్యాణ్‌తో నన్నెందుకు పోలుస్తున్నారన్న రేణూ దేశాయ్
సినీనటి రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్ ఈసారి కాస్తంత కటువుగానే కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన గతాన్ని, మాజీ భర్త ప్రస్తావనను పదేపదే తీసుకురావొద్దని పవన కల్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘సోషల్ మీడియాలో నేను పెట్టే ప్రతీ పోస్ట్‌పై స్పందిస్తూ ఎప్పుడూ నా మాజీ భర్తతో నన్ను పోలుస్తారెందుకు?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మాటలు బాధతో అన్నవే గానీ కోపంతో కాదని మరో పోస్ట్ ద్వారా తెలిపారు. వ్యక్తిగతంగా తన మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదని, తనని తానుగా చూడాలని కోరారు.
అసలేం జరిగిందంటే...
రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో మూగ జీవాల సంరక్షణ చేపట్టారు. జంతు సంరక్షణ కోసం ఆమె ఇటీవల విరాళాలు కూడా సేకరించారు. ఆ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు ఆమె తీవ్రంగానే స్పందించారు. ఆ పోస్టు పెట్టిన వ్యక్తికి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆ నెటిజన్ ఏమని పోస్ట్ పెట్టారంటే ‘మా పవన్ కల్యాణ్ అన్నయ్యది గోల్డెన్ హార్ట్’ అంటూ ఈమెను పోల్చి కామెంట్ పెట్టారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘పదేళ్ల వయసు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నా. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు. జంతువులపై నేను చూపించే ప్రేమ, కేర్ ఆయనకు లేవు. దయచేసి నేను చేసే పనుల గురించి పోస్ట్ పెడితే.. ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి’’ అని బదులిచ్చారు. గతంలోనూ ఆమె ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. అయినా పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా రెచ్చగొట్టే తరహాలో పోస్టులు పెడుతున్నారన్నది ఆమె ఆవేదన.
ఇదీ గతం...
పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రవేశించిన తరువాత 2001లో నటి రేణూదేశాయ్‌తో కొత్త కాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అంతకుముందే ఆయనకు వేరొకరితో వివాహం జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత రేణుదేశాయ్‌ని పెళ్లి చేసుకున్నారు. 2004లో వారికి ఓ కుమారుడు జన్మించాడు. అతడే అకీరానందన్. ఆ తర్వాత ఓ కుమార్తె ‘ఆద్య’ కూడా జన్మించింది. వీరి కాపురం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎనిమిదేళ్ల సహజీవనం తరువాత వీళ్ల కాపురంలో కలతలు రేగాయి. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. 2018లో రేణూ దేశాయ్ విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ చేయలేదు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణూ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. విడిపోయే సమయంలో ఆమె పవన్ నుంచి పెద్దమొత్తంలో భరణం తీసుకున్నారని ఆరోపణలు వచ్చినా అది నిజం కాదని ఆమె కొట్టిపారేశారు.
పవన్ కల్యాణ్ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సందర్భంగా రష్యా నటి అన్నా లెజెనేవాను కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ 2013 సెప్టెంబరు 30న హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ అనడం, దానికి పవన్ కల్యాణ్.. జగన్ తన నాలుగో పెళ్లామంటూ కౌంటర్ వేయడం.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అదో పెద్ద వ్యవహారంగా మారడం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ ఇలా ప్రకటించడం చర్చనీయాంశమైంది.